ప్రేమ యొక్క ఉపకారం
ప్రేమ యొక్క ఉపకారం
అధ్యాయము 1
యూదయదేశపు రాజైన హేరోదు దినములలో అబీయా తరగతిలోనున్న జెకర్యా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతె; ఆమె పేరు ఎలీసబెతు. వీరిద్దరు ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞలచొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై యుండిరి. ఎలీసబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి; మరియు వారిద్దరు బహు కాలము గడచిన (వృద్ధులైరి. ) జెకర్యా తన తరగతి క్రమముచొప్పున దేవునియెదుట యాజక ధర్మము జరిగించుచుండగ యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్లి ధూపమువేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా. ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా. జెకర్యా అతని చూచి, తొందరపడి భయపడినవాడాయెను. అప్పుడా దూత అతనితో జెకర్యా భయపడకుము; నీ ప్రార్థన వినబడినది, నీ భార్యయైన ఎలీసబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై, ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక, తన తల్లిగర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై, ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానము ననుసరించుటకును త్రిప్పి, ప్రభువు కొరకు ఆయత్తపడియున్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలీయాయొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్లును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును; అతడు పుట్టినందున అనేకులు సంతో షింతురనెను.
జెకర్యా–యిది నాకేలాగు తెలియును? నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడచినదని ఆ దూతతో చెప్పగా . దూత–నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును; నీతో మాటలాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని. మరియు నా మాటలు వాటికాలమందు నెరవేరును; నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినమువరకు నీవు మాటలాడక మౌనివై యుందువని అతనితో చెప్పెను. ప్రజలు జెకర్యాకొరకు కనిపెట్టుచుండి, ఆలయమునందు అతడు ఆలస్యము చేసినందుకు ఆశ్చర్యపడిరి. అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాటలాడలేక పోయినందున, ఆలయమునందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి; అప్పుడతడు వారికి సంజ్ఞలుచేయుచు, మూగవాడై యుండెను. అతడు సేవచేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన యింటికి వెళ్లెను. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలీసబెతు గర్భవతియై–మనుష్యులలో నాకుండిన అవమానమును తీసి వేయుటకు. నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఈలాగున చేసెననుకొని, అయిదు నెలలు ఇతరుల కంటబడకుండెను.
ఆరవ నెలలో గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యకయొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి–దయాప్రాప్తురాలా నీకు శుభము; ప్రభువు నీకు తోడైయున్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి–ఈ శుభవచన మేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత – మరియా, భయపడకుము; దేవునివలన నీవు కృపపొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు; ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును; ఆయన రాజ్యము అంతములేనిదై యుండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియ–నేను పురుషుని ఎరుగనిదాననే; యిదేలాగు జరుగునని దూతతో అనగా దూత–పరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. మరియు నీ బంధువురాలు ఎలీసబెతుకూడ తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించియున్నది; గొడ్రాలనబడిన ఆమెకు ఇది ఆరవమాసము; దేవుడు చెప్పిన యేమాటయైనను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియ–ఇదిగో ప్రభువు దాసురాలను; నీ మాటచొప్పున నాకు జరుగును గాక అనెను. అంతట దూత ఆమెయొద్ద నుండి వెళ్లెను.
ప్రసవకాలము వచ్చినప్పుడు ఎలీసబెతు కుమారుని కనెను. అప్పుడు ప్రభువు ఆమెమీద మహాకనికరముంచెనని ఆమె పొరుగువారును బంధువులును విని ఆమెతోకూడ సంతోషించిరి. ఎనిమిదవ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి, తండ్రి పేరునుబట్టి జెకర్యా అను పేరు వానికి పెట్టబోవుచుండగా తల్లి–ఆలాగు వద్దు; వానికి యోహానను పేరు పెట్టవలెనని చెప్పెను. అందుకు వారు–నీ బంధువులలో ఆ పేరు గలవాడెవడును లేడే అని ఆమెతో చెప్పి వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వాని తండ్రికి సంజ్ఞలుచేసి అడిగిరి. అతడు వ్రాతపలక తెమ్మని–వాని పేరు యోహానని వ్రాసెను; అందుకు వారందరు ఆశ్చర్యపడిరి. వెంటనే అతని నోరు తెరవబడి, నాలుక సడలి, అతడు దేవుని స్తుతించుచు మాటలాడసాగెను. అందునుబట్టి వారి చుట్టు పట్ల కాపురమున్న వారికందరికిని భయము కలిగెను. ఆ సంగతులన్నియు యూదయ కొండసీమలయందంతట ప్రచురమాయెను. ప్రభువు హస్తము అతనికి తోడైయుండెను గనుక ఆ సంగతులనుగూర్చి వినినవారందరును –ఈ బిడ్డ యేలాటివాడగునో అని వాటిని మనస్సులో ఉంచుకొనిరి.
అధ్యాయము 2
యేసు క్రీస్తు జననవిధమెట్లనగా, ఆయన తల్లియైన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మవలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడై యుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను.అతడు ఈ సంగతులనుగూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై –దావీదు కుమారుడవైన యోసేపూ, నీ భార్యయైన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మవలన కలిగినది; ఆమె యొక కుమారుని కనును; తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. అని ప్రభువు తన ప్రవక్తద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్రమేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారముచేసి, తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను;
ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు ఔగుస్తువలన ఆజ్ఞ ఆయెను. ఇది కురేనియు సిరియదేశమునకు అధిపతియైయున్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరును ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమతమ పట్టణములకు వెళ్లిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక, తనకు భార్యగా ప్రధానము చేయబడి గర్భవతియైయుండిన మరియతోకూడ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతునుండి యూదయలోని బేత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్లెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవదినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని, పొత్తిగుడ్డలతో చుట్టి, సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను.
ఆ దేశములో కొందరు గొఱ్ఱెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారియొద్దకు వచ్చి నిలిచెను; ప్రభువు మహిమ వారిచుట్టు ప్రకాశించినందున, వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత–భయపడకుడి; ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను; దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీకానవాలు; ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్ట బడి యొకతొట్టిలో పండుకొనియుండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోకసైన్యసమూహము ఆ దూతతోకూడనుండి –సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆ దూతలు తమయొద్దనుండి పరలోకమునకు వెళ్లిన తరువాత ఆ గొఱ్ఱెల కాపరులు–జరిగిన యీ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించియున్నాడు; మనము బేత్లెహేమువరకు వెళ్లి చూతము రండని యొకనితో నొకడు చెప్పుకొని త్వరగా వెళ్లి, మరియను యోసేపును తొట్టిలో పండుకొనియున్న శిశువును చూచిరి. వారు చూచి, యీ శిశువునుగూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొఱ్ఱెల కాపరులు తమతో చెప్పిన సంగతులనుగూర్చి విన్నవారందరు మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియ ఆ మాటలన్నియు తన హృదయములో తలపోసికొనుచు భద్రము చేసికొనెను. అంతట ఆ గొఱ్ఱెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటినన్నిటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రముచేయుచు తిరిగి వెళ్లిరి. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన యెనిమిదవ దినము వచ్చినప్పుడు, గర్భమందాయన పడకమునుపు దేవదూతచేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి.
అధ్యాయము 3
రాజైన హేరోదు దినములయందు యూదయదేశపు బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి –యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి. హేరోదురాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితోకూడ యెరూషలేము వారందరును కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధానయాజకులను ప్రజలలోనుండు శాస్త్రులను అందరిని సమకూర్చి – క్రీస్తు ఎక్కడ పుట్టునని వారినడిగెను. అందుకు వారు – యూదయ బేత్లెహేములోనే; ఏలయనగా యూదయదేశపు బేత్లెహేమా నీవు యూదా ప్రధానులలో ఎంతమాత్రమును అల్పమైనదానవు కావు; ఇశ్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలోనుండి వచ్చును అని ప్రవక్తద్వారా వ్రాయబడియున్నదనిరి.
అంతట హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి, ఆ నక్షత్రము కనబడిన కాలము వారిచేత పరిష్కారముగా తెలిసికొని – మీరు వెళ్లి, ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలిసికొనగానే, నేనును వచ్చి, ఆయనను పూజించునట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బేత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా, ఇదిగో తూర్పుదేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచువరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి, అత్యానందభరితులై యింటిలోనికి వచ్చి, తల్లియైన మరియను ఆ శిశువును చూచి, సాగిలపడి, ఆయనను పూజించి, తమ పెట్టెలు విప్పి, బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తరువాత హేరోదునొద్దకు వెళ్లవద్దని స్వప్నమందు దేవునిచేత బోధింపబడినవారై వారు మరియొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్లిరి.
వారు వెళ్లిన తరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై–హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోవుచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి, నేను నీతో తెలియజెప్పువరకు అక్కడనే యుండుమని అతనితో చెప్పెను. అప్పుడతడు లేచి, రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని, ఐగుప్తునకు వెళ్లి, ఐగుప్తులోనుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్తద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడునట్లు హేరోదు మరణమువరకు అక్కడనుండెను. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని, తాను జ్ఞానులవలన వివరముగా తెలిసికొనిన కాలమునుబట్టి, బేత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను, రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సుగల మగపిల్లల నందరిని వధించెను. అందువలన –రామాలో అంగలార్పు వినబడెను ఏడ్పును మహా రోదనధ్వనియు కలిగెను రాహేలు తన పిల్లలవిషయమై యేడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లక యుండెను అని ప్రవక్తయైన యిర్మీయాద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను.
హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై –నీవు లేచి, శిశువును తల్లిని తోడుకొని, ఇశ్రాయేలుదేశమునకు వెళ్లుము; శిశువు ప్రాణము తీయజూచుచుండినవారు చనిపోయిరని చెప్పెను. అప్పుడతడు లేచి, శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలుదేశమునకు వచ్చెను. అయితే అర్కెలాయు తన తండ్రియైన హేరోదునకు ప్రతిగా యూదయదేశమును ఏలుచున్నాడని విని, అక్కడికి వెళ్ల వెరచి, స్వప్నమందు దేవునిచేత బోధింపబడినవాడై గలిలయ ప్రాంతములకు వెళ్లి, నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పినమాట నెరవేరునట్లు (ఈలాగు జరిగెను)
మోషే ధర్మశాస్త్రముచొప్పునవారు తమ్మును శుద్ధి చేసికొను దినములు గడచినప్పుడు –ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును, ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను రెండు పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును, వారు ఆయనను యెరూషలేమునకు తీసికొనిపోయిరి. 'అంతట వారు ప్రభువు ధర్మశాస్ర్తము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతను తమ ఊరికి తిరిగి వెళ్లిరి.
అధ్యాయము 4
బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు, ఎదిగి బలము పొందుచుండెను; దేవుని దయ ఆయనమీద నుండెను. పస్కాపండుగప్పుడు ఆయన తలిదండ్రులు ఏటేట యెరూషలేమునకు వెళ్లుచుండువారు. ఆయన పండ్రెండేండ్లవాడై యున్నప్పుడు ఆ పండుగ నాచరించుటకై వాడుకచొప్పునవారు యెరూషలేమునకు వెళ్లిరి. ఆ దినములు తీరినతరువాత వారు తిరిగి వెళ్లుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లి దండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి, యొక దినప్రయాణము సాగిపోయి, తమ బంధువులలోను నెళవైనవారిలోను ఆయనను వెదకుచుండిరి. ఆయన కనబడనందున ఆయనను వెదకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. మూడుదినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి, వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలడుగుచు ఉండగా చూచిరి. ఆయన మాటలు వినినవారందరు ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయమొందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి–కుమారుడా, మమ్మును ఎందుకీలాగు చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదకుచుంటిమని ఆయనతో చెప్పగా ఆయన–మీరేల నన్ను వెదకుచుంటిరి? నేను నా తండ్రి పనులమీద నుండవలెనని మీరెరుగరా అని వారితో చెప్పెను; అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతట ఆయన వారితోకూడ బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి యుండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటిని తన హృదయములో భద్రము చేసికొనెను. యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును, మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను.
తిబెరికైసరు ఏలుబడిలో పదునైదవ సంవత్సరమందు యూదయకు పొంతిపిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరయ త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబిలేనే దేశమునకు లుసానియ అధిపతిగాను, అన్నయు, కయపయు ప్రధానయాజకులుగాను, ఉన్నకాలమున అరణ్యములోనున్న జెకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. – ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళముచేయుడి ప్రతి పల్లము పూడ్చబడును ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును వంకర మార్గములు తిన్ననివగును కరకు మార్గములు నున్ననివగును సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేకలువేయుచున్న యొకని శబ్దము అని ప్రవక్తయైన యెషయా వాక్యముల గ్రంథమందు వ్రాయబడినట్టు ఇది జరిగెను. బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాపక్షమాపణనిమిత్తము మారుమనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచు వచ్చెను. –పరలోకరాజ్యము సమీపించియున్నది, మారుమనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును, మొలచుట్టు తోలుదట్టియు ధరించుకొనువాడు; మిడతలును అడవి తేనెయు అతనికి ఆహారము. ఆ సమయమున యెరూషలేమువారును యూదయ వారందరును యొర్దాను నదీప్రాంతముల వారందరును, అతనియొద్దకు వచ్చి, తమ పాపములు ఒప్పుకొనుచు, యొర్దాను నదిలో అతనిచేత బాప్తిస్మము పొందుచుండిరి.
అధ్యాయము 5
దేవుని కుమారుడైన యేసు క్రీస్తు సువార్త ప్రారంభము. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆయన ఆదియందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగియున్నదేదియు ఆయనలేకుండ కలుగలేదు. ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను. దేవునియొద్దనుండి పంపబడిన యొక మనుష్యుడు ఉండెను; అతని పేరు యోహాను. అతని మూలముగా అందరు విశ్వసించునట్లు అతడు ఆ వెలుగునుగూర్చి సాక్ష్య మిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగైయుండ లేదు గాని ఆ వెలుగునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను; అది లోకములోనికి వచ్చుచు ప్రతిమనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకమాయన మూలముగా కలిగెను గాని లోకమాయనను తెలిసికొనలేదు. ఆయన తన స్వకీయులయొద్దకు వచ్చెను; ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవునివలన పుట్టినవారేగాని, రక్తమువలననైనను శరీరేచ్ఛవలననైనను మానుషేచ్ఛవలననైనను పుట్టినవారు కారు. ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వితీయకుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి యోహాను ఆయననుగూర్చి సాక్ష్యమిచ్చుచు–నా వెనుక వచ్చువాడు నాకంటె ప్రముఖుడు గనుక ఆయన నాకంటె ముందటివాడాయెననియు, నేను చెప్పినవాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పెను. ఆయన పరిపూర్ణతలోనుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ధర్మశాస్త్రము మోషేద్వారా అనుగ్రహింపబడెను; కృపయు సత్యమును యేసు క్రీస్తుద్వారా కలిగెను. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు; తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను.
ఆ సమయమున యోహానుచేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయనుండి యొర్దాను దగ్గర నున్న అతనియొద్దకు వచ్చెను. అందుకు యోహాను –నేను నీచేత బాప్తిస్మము పొందవలసినవాడనై యుండగా నీవు నాయొద్దకు వచ్చుచున్నావా? అని ఆయనను నివారింపజూచెను గాని యేసు–ఇప్పటికికానిమ్ము; నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతడాలాగు కానిచ్చెను. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చెను; ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురమువలె దిగి తనమీదికి వచ్చుట చూచెను. మరియు–ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.
మరునాడు యోహాను యేసు తనయొద్దకు రాగా చూచి–ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల. నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు; ఆయన నాకంటె ప్రముఖుడు గనుక నాకంటె ముందటి వాడాయెనని నేనెవరినిగూర్చి చెప్పితినో ఆయనే యీయన. నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిస్మమిచ్చుచు వచ్చితినని చెప్పెను. మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు–ఆత్మ పావురమువలె ఆకాశమునుండి దిగివచ్చుట చూచితిని; ఆ ఆత్మ ఆయనమీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తిస్మమిచ్చుటకు నన్ను పంపినవాడు–నీవెవనిమీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మమిచ్చువాడని నాతో చెప్పెను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలిసికొని సాక్ష్యమిచ్చితిననెను.
యేసు (బోధింప) మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు ముప్పది ఏండ్ల యీడుగలవాడు; ఆయన యోసేపు కుమారుడని యెంచబడెను. యోసేపు హేలీకి, హేలీ మత్తతుకు, మత్తతు లేవికి, లేవి మెల్కీకి, మెల్కీయన్నకు, యన్న యోసేపుకు, యోసేపు మత్తతీయకు, మత్తతీయ ఆమోసుకు, ఆమోసు నాహోముకు, నాహోము ఎస్లికి, ఎస్లి నగ్గయికి, నగ్గయి మయతుకు, మయతు మత్తతీయకు, మత్తతీయ సిమియకు, సిమియ యోశేఖుకు, యోశేఖు యోదాకు, యోదా యోహన్నకు, యోహన్న రేసాకు, రేసా జెరుబ్బాబెలుకు, జెరుబ్బాబెలు షయల్తీ యేలుకు, షయల్తీయేలు నేరికి, నేరి మెల్కీకి, మెల్కీ అద్దికి, అద్ది కోసాముకు, కోసాము ఎల్మదాముకు, ఎల్మదాము ఏరుకు, ఏరు యెహోషువకు, యెహోషువ ఎలీయెజెరుకు, ఎలీయెజెరు యోరీముకు, యోరీము మత్తతుకు, మత్తతు లేవికి, లేవి షిమ్యోనుకు, షిమ్యోను యూదాకు, యూదా యోసేపుకు, యోసేపు యోనాముకు, యోనాము ఎల్యాకీముకు, ఎల్యాకీము మెలెయాకు, మెలెయా మెన్నాకు, మెన్నా మత్తతాకు, మత్తతా నాతానుకు, నాతాను దావీదుకు,
దావీదు యెష్షయికి, యెష్షయి ఓబేదుకు, ఓబేదు బోయజుకు, బోయజు శల్మానుకు, శల్మాను నయస్సోనుకు, నయస్సోను అమ్మీనాదాబుకు, అమ్మీనాదాబు అరాముకు, అరాము ఎస్రోముకు, ఎస్రోము పెరెసుకు, పెరెసు యూదాకు, యూదా యాకోబుకు, యాకోబు ఇస్సాకుకు, ఇస్సాకు అబ్రాహాముకు, అబ్రాహాము తెరహుకు, తెరహు నాహోరుకు, నాహోరు సెరూగుకు, సెరూగు రయూకు, రయూ పెలెగుకు, పెలెగు హెబెరుకు, హెబెరు షేలహుకు, షేలహు కేయినానుకు, కేయినాను అర్పక్షదుకు, అర్పక్షదు షేముకు, షేము నోవహుకు, నోవహు లెమెకుకు, లెమెకు మెతూషెలకు, మెతూషెల హనోకుకు, హనోకు యెరెదుకు, యెరెదు మహలలేలుకు, మహలలేలు కేయినానుకు, కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు.
అధ్యాయము 6
అప్పుడు యేసు అపవాదిచేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. నలువది దినములు నలువదిరాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా, ఆ శోధకుడు ఆయనయొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే, ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకాయన –మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదు గాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును అని వ్రాయబడియున్నదనెను. అంతట అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసికొనిపోయి, దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి –నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము – ఆయన నిన్నుగూర్చి తన దూతల కాజ్ఞాపించును, నీ పాదమెప్పుడైనను రాతికి తగులకుండ వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడియున్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు – ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరియొక చోట వ్రాయబడియున్నదని వానితో చెప్పెను. అప్పుడు అపవాది ఆయనను తీసికొనిపోయి, భూలోక రాజ్యములన్నిటిని ఒక నిమిషములో ఆయనకు చూపించి –ఈ అధికారమంతయు, ఈ రాజ్యముల మహిమయునీకిత్తును; అది నాకప్పగింపబడియున్నది, అదెవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును; కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా యిదంతయు నీదగునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు –నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడియున్నదని వానికి ప్రత్యుత్తరమిచ్చెను. అంతట అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్యచేసిరి. అపవాది ప్రతి శోధనను ముగించి, కొంతకాలము ఆయనను విడిచిపోయెను.
అప్పుడు యేసు, ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్లెను; ఆయననుగూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతట వ్యాపించెను. ఆయన అందరిచేత ఘనతనొంది, వారి సమాజమందిరములలో బోధించుచు వచ్చెను. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను.తనవాడుక చొప్పున విశ్రాంతిదినమందు సమాజమందిరములోనికి వెళ్లి, చదువుటకై నిలుచుండగా ప్రవక్తయైన యెషయా గ్రంథము ఆయన చేతి కియ్యబడెను; ఆయన గ్రంథము విప్పగా – –ప్రభువు ఆత్మ నామీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును, (కలుగునని) ప్రకటించుటకును నలిగినవారిని విడిపించుటకును. ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరకెను. ఆయన గ్రంథముచుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను. సమాజమందిరములోనున్నవారందరు ఆయనను తేరిచూడగా, ఆయన–నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను. అప్పుడందరును ఆయననుగూర్చి సాక్ష్యమిచ్చుచు, ఆయన నోటనుండి వచ్చిన దయగల మాటలకాశ్చర్యపడి–ఈయన యోసేపు కుమారుడు కాడా? అని చెప్పుకొనుచుండగా
ఆయన వారిని చూచి–వైద్యుడా, నిన్ను నీవే స్వస్థపరచుకొనుము అను సామెత చెప్పి, కపెర్నహూములో ఏ కార్యములు నీవు చేసితివని మేము వింటిమో, ఆ కార్యములు ఈ నీ స్వదేశమందును చేయుమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురనెను. మరియు ఆయన–ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడుకాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలీయా దినములయందు మూడేండ్ల ఆరు నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్ప కరవు సంభవించినప్పుడు, ఇశ్రాయేలులో అనేకమంది విధవరాండ్రుండినను, ఏలీయా సీదోనులోని సారెపతు అను ఊరిలో ఉన్న యొక విధవరాలియొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. మరియు ప్రవక్తయైన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులుండినను, సిరియ దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సమాజమందిరములో ఉన్నవారందరు ఆ మాటలు విని ఆగ్రహముతో నిండుకొని, లేచి ఆయనను పట్టణములోనుండి వెళ్లగొట్టి, ఆయనను తలక్రిందుగా పడద్రోయవలెనని తమ పట్టణము కట్టబడిన కొండపేటువరకు ఆయనను తీసికొనిపోయిరి. అయితే ఆయన వారి మధ్యనుండి దాటి తన మార్గమున వెళ్లిపోయెను.
అధ్యాయము 7
అయితే చతుర్థాధిపతియైన హేరోదుచేసిన సకల దుష్కార్యముల నిమిత్తమును, అతని సోదరుని భార్యయైన హేరోదియ నిమిత్తమును, యోహాను అతనిని గద్దించినందుకు అదివరకు తాను చేసినవన్నియు చాలవన్నట్టు అతడు యోహానును చెరసాలలో వేయించెను. యోహాను చెరపట్టబడెనని యేసు విని గలిలయకు తిరిగి వెళ్లి నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలియను దేశముల ప్రాంతములలో సముద్రతీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. – జెబూలూను దేశమును, నఫ్తాలిదేశమును, యొర్దానుకు ఆవలనున్న సముద్రతీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండియున్న ప్రజలును గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణచ్ఛాయలోను కూర్చుండియున్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్తయైన యెషయాద్వారా పలుకబడినది నెరవేరునట్లు (ఈలాగు జరిగెను.) యేసు –కాలము సంపూర్ణమైయున్నది, దేవునిరాజ్యము సమీపించియున్నది; మారుమనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు, గలిలయకు వచ్చెను.
ఆయన గలిలయ సముద్రతీరమున వెళ్లుచుండగా సీమోనును సీమోను సహోదరుడగు అంద్రెయయు, సముద్రములో వలవేయుట చూచెను; వారు జాలరులు. యేసు నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులనుగా చేసెదనని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. ఆయన ఇంక కొంతదూరము వెళ్లి జెబెదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహానును చూచెను; వారు దోనెలో ఉండి తమ వలలు బాగుచేసికొనుచుండిరి. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రియైన జెబెదయిని దోనెలో జీతగాండ్రయొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.
మూడవదినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను; యేసును ఆయన శిష్యులును ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి–వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో–అమ్మా, నాతో నీకేమి (పని)? నా సమయమింకను రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి –ఆయన మీతో చెప్పునది చేయుడనెను. యూదుల శుద్ధీకరణాచారప్రకారము రెండేసి మూడేసి తూములు పట్టు ఆరు రాతిబానలు అక్కడ ఉంచబడియుండెను. యేసు–ఆ బానలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచులమట్టుకు నింపిరి. అప్పుడాయన వారితో–మీరిప్పుడు ముంచి, విందు ప్రధానియొద్దకు తీసికొనిపొండని చెప్పగా, వారు తీసికొనిపోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడనుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసికొనిపోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయెను గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచిచూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లికుమారుని పిలిచి –ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి, జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయును; నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొనియున్నావని అతనితో చెప్పెను. గలిలయలోని కానాలో, యేసు ఈ మొదటి సూచకక్రియను చేసి తన మహిమను బయలుపరచెను; అందువలన ఆయన శిష్యులు ఆయనయందు విశ్వాసముంచిరి. అటుతరువాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులును ఆయన శిష్యులును కపెర్నహూమునకు వెళ్లి అక్కడ కొన్ని దినములుండిరి.
అధ్యాయము 8
యూదుల పస్కాపండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్లి దేవాలయములో ఎడ్లను గొఱ్ఱెలను పావురములను అమ్మువారును రూకలు మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్లతో కొరడాలుచేసి, గొఱ్ఱెలను ఎడ్లనన్నిటిని దేవాలయములోనుండి తోలివేసి, రూకలు మార్చువారి రూకలు చల్లివేసి, వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మువారితో–వీటిని ఇక్కడ నుండి తీసికొనిపొండి; నా తండ్రి యిల్లు వ్యాపారపుటిల్లుగా చేయకుడని చెప్పెను. ఆయన శిష్యులు– నీ యింటినిగూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడియున్నట్టు జ్ఞాపకము చేసికొనిరి. కాబట్టి యూదులు –నీవు ఈ కార్యములు చేయుచున్నావే; యే సూచక క్రియను మాకు చూపెదవని ఆయనను అడుగగా యేసు –ఈ దేవాలయమును పడగొట్టుడి, మూడుదినములలో దాని లేపుదునని వారితో చెప్పెను. యూదులు–ఈ దేవాలయము నలువదియారు సంవత్సరములు కట్టిరే; నీవు మూడుదినములలో దానిని లేపుదువా అనిరి. అయితే ఆయన తన శరీరమను దేవాలయమునుగూర్చి యీ మాట చెప్పెను. ఆయన మృతులలోనుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పెనని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసికొని, లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. ఆయన పస్కా (పండుగ) సమయమున యెరూషలేములో ఉండగా, ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచకక్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసముంచిరి. అయితే యేసు అందరిని ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసికొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడును మనుష్యుని గూర్చి ఆయనకు సాక్ష్యమియ్యనక్కరలేదు.
యూదుల అధికారియైన నీకొదేమను పరిసయ్యుడొకడుండెను. అతడు రాత్రియందు ఆయనయొద్దకు వచ్చి–బోధకుడా, నీవు దేవునియొద్దనుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము; దేవుడతనికి తోడైయుంటేనే గాని నీవు చేయుచున్న సూచకక్రియలను ఎవడును చేయలేడని ఆయనతో చెప్పెను. అందుకు యేసు అతనితో –ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. అందుకు నీకొదేము – ముసలివాడైన మనుష్యుడేలాగు జన్మింపగలడు? రెండవమారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా యేసు ఇట్లనెను–ఒకడు నీటిమూలముగాను ఆత్మమూలముగాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మమూలముగా జన్మించినది ఆత్మయునై యున్నది. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తన కిష్టమైన చోటను విసరును; నీవు దాని శబ్దము విందువేగాని అది యెక్కడనుండి వచ్చునో యెక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మమూలముగా జన్మించిన ప్రతివాడును ఆలాగే యున్నాడనెను.
అందుకు నీకొదేము–ఈ సంగతులేలాగు సాధ్యములని ఆయనను అడుగగా యేసు ఇట్లనెను–నీవు ఇశ్రాయేలుకు బోధకుడవై యుండి వీటిని ఎరుగవా? మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచినదానికే సాక్ష్యమిచ్చుచున్నాము, మా సాక్ష్యము మీరంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూసంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు, పరలోకసంబంధమైనవి మీతో చెప్పినయెడల ఏలాగు నమ్ముదురు? మరియు పరలోకమునుండి దిగివచ్చినవాడే, అనగా పరలోకములో ఉండు మనుష్యకుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు. అరణ్యములో మోషే సర్పమును ఏలాగు ఎత్తెనో, ఆలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందునట్లు మనుష్యకుమారుడు ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంపలేదు. .ఆయనయందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు; విశ్వసింపనివాడు దేవుని అద్వితీయకుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకుమునుపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే; వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డైవెనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడియున్నవని ప్రత్యక్షపరచబడునట్లు వెలుగునొద్దకు వచ్చును.
పైనుండి వచ్చువాడు అందరికి పైనున్నవాడు; భూమి నుండి వచ్చువాడు భూసంబంధియై భూసంబంధమైన సంగతులనుగూర్చి మాటలాడును; పరలోకమునుండి వచ్చువాడు అందరికి పైగానుండి తాను కన్నవాటినిగూర్చియు విన్నవాటినిగూర్చియు సాక్ష్యమిచ్చును; ఆయన సాక్ష్యము ఎవడును అంగీకరింపడు. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్రవేసి యున్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపినవానికి కొలతలేకుండ ఆత్మననుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు. గనుక ఆయన చేతికి సమస్తము అప్పగించియున్నాడు. కుమారునియందు విశ్వాసముంచువాడే నిత్యజీవముగలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వానిమీద నిలిచి యుండును.
అధ్యాయము 9
యోహాను కంటె యేసు ఎక్కువమందిని శిష్యులనుగా చేసికొని వారికి బాప్తిస్మమిచ్చుచున్న సంగతి పరిసయ్యులు వినిరని ప్రభువునకు తెలిసినప్పుడు ఆయన యూదయ దేశము విడిచి గలిలయదేశమునకు తిరిగి వెళ్లెను. అయినను యేసే బాప్తిస్మమియ్యలేదు గాని ఆయన శిష్యులిచ్చుచుండిరి. ఆయన సమరయ మార్గమున వెళ్లవలసివచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుఖారను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి యుండెను గనుక యేసు ప్రయాణమువలన అలసియున్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను; అప్పటికి ఇంచుమించు పండ్రెండు గంటలాయెను. సమరయ స్త్రీ ఒకతె నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు–నాకు దాహమునకిమ్మని ఆమె నడిగెను. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్లియుండిరి. ఆ సమరయ స్త్రీ –యూదుడవైన నీవు సమరయ స్త్రీ నైన నన్ను దాహమునకిమ్మని యేలాగు అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు.
అందుకు యేసు–నీవు దేవుని వరమును– నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగియుంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను. అప్పుడా స్త్రీ –అయ్యా, యీ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమియు లేదే; ఆ జీవజలము ఏలాగు నీకు దొరకును? తానును తన కుమాళ్లును, పశువులును, యీ బావినీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రియైన యాకోబుకంటె నీవు గొప్పవాడవా? అని ఆయనను అడిగెను. అందుకు యేసు –ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరల దప్పిగొనును; నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పిగొనడు; నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ ఆయనను చూచి–అయ్యా, నేను దప్పిగొనకుండునట్లును, చేదుకొనుట కింతదూరము రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయుమని అడుగగా యేసు నీవు వెళ్లి నీ పెనిమిటిని పిలుచుకొని యిక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ –నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో– నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాటసరియే; నీకు అయిదుగురు పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు; సత్యమే చెప్పితివనెను.
అప్పుడా స్త్రీ –అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను –అమ్మా, ఒక కాలమువచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము; మీరు మీకు తెలియనిదానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసినదానిని ఆరాధించువారము; రక్షణ యూదులలోనుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలమువచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు; దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను. ఆ స్త్రీ ఆయనతో–క్రీస్తనబడిన మెస్సీయ వచ్చునని నేనెరుగుదును; ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా యేసు–నీతో మాటలాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పెను.
ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీ తో మాటలాడుట చూచి ఆశ్చర్యపడిరి గాని నీకేమికావలెననియైనను, ఈమెతో ఎందుకు మాటలాడుచున్నావనియైనను ఎవడును అడుగలేదు. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్లి –మీరు వచ్చి, నేను చేసిన వన్నియు నాతో చెప్పిన మనుష్యుని చూడుడి; ఈయన క్రీస్తుకాడా అని ఆ ఊరివారితో చెప్పగా వారు ఊరిలోనుండి బయలుదేరి ఆయనయొద్దకు వచ్చుచుండిరి. ఆ లోగా శిష్యులు–బోధకుడా, భోజనము చేయుమని ఆయనను వేడుకొనిరి. అందుకాయన–భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా శిష్యులు–ఆయన భుజించుటకు ఎవడైన నేమైనను తెచ్చెనేమో అని యొకనితో ఒకడు చెప్పు కొనిరి. యేసు వారిని చూచి–నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై యున్నది. ఇంక నాలుగు నెలలైన తరువాత కోతకాలమువచ్చునని మీరు చెప్పుదురు గదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి; అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చియున్నవని మీతో చెప్పుచున్నాను. విత్తువాడును కోయువాడును కూడ సంతోషించునట్లు, కోయువాడు జీతము పుచ్చుకొని నిత్యజీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. విత్తువాడొకడు కోయువాడొకడను మాట యీ విషయములో సత్యమే. మీరు దేనినిగూర్చి కష్టపడ లేదో దానిని కోయుటకు మిమ్మును పంపితిని; ఇతరులు కష్టపడిరి మీరు వారి కష్టఫలములో ప్రవేశించుచున్నారని చెప్పెను.
–నేను చేసినవన్నియు నాతో చెప్పెనని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటనుబట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి. ఆ సమరయులు ఆయనయొద్దకు వచ్చి, తమయొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ రెండు దినములుండెను. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి–ఇకమీదట నీవు చెప్పిన మాటనుబట్టి కాక మామట్టుకు మేము విని, యీయన నిజముగా లోకరక్షకుడని తెలిసికొని నమ్ముచున్నామనిరి. ఆ రెండుదినములైన తరువాత ఆయన అక్కడనుండి బయలుదేరి గలిలయకు వెళ్లెను. ఎందుకనగా ప్రవక్త స్వదేశములో ఘనత పొందడని యేసు సాక్ష్యమిచ్చెను. గలిలయులు కూడ ఆ పండుగకు వెళ్లువారు గనుక యెరూషలేములో పండుగ సమయమున ఆయనచేసిన కార్యములన్నియు వారు చూచినందున ఆయన గలిలయకు వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి.
తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధానికుమారుడు రోగియైయుండెను. యేసు యూదయనుండి గలిలయకు వచ్చెనని అతడు విని ఆయనయొద్దకు వెళ్లి, తన కుమారుడు చావ సిద్ధమైయుండెను గనుక ఆయనవచ్చి అతని స్వస్థపరచవలెనని వేడుకొనెను. యేసు–సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంతమాత్రము నమ్మరని అతనితో చెప్పెను. అందుకా ప్రధాని–ప్రభువా, నా కుమారుడు చావకమునుపే రమ్మని ఆయనను వేడుకొనెను. యేసు–నీవు వెళ్లుము, నీ కుమారుడు బ్రదికియున్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్లిపోయెను. అతడింక వెళ్లుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగావచ్చి, అతని కుమారుడు బ్రదికి యున్నాడని తెలియజెప్పిరి. ఏ గంటకు వాడు బాగు పడసాగెనని వారిని అడిగినప్పుడు వారు–నిన్న ఒంటి గంటకు జ్వరము వానిని విడిచెనని అతనితో చెప్పిరి. –నీ కుమారుడు బ్రదికియున్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలిసికొనెను గనుక అతడును అతని యింటివారందరును నమ్మిరి. ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన రెండవ సూచకక్రియ.
అధ్యాయము 10
అటుతరువాత యూదుల పండుగ యొకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్లెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర, హెబ్రీ భాషలో బేతెస్ద అనబడిన యొక కోనేరు కలదు, దానికి అయిదు మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదలించుట కలదు. నీరు కదలింపబడిన పిమ్మట, మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధిగలవాడైనను బాగుపడును, గనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలుచేతులు గలవారు, గుంపులుగా పడియుండిరి. అక్కడ ముప్పది యెనిమిది ఏండ్లనుండి వ్యాధిగల యొక మనుష్యుడుండెను. యేసు, వాడు పడియుండుట చూచి, వాడప్పటికి బహుకాలమునుండి ఆ స్థితిలోనున్నాడని యెరిగి–స్వస్థపడగోరుచున్నావా అని వానినడుగగా ఆ రోగి–అయ్యా, నీళ్లు కదలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడును లేడు గనుక నేను వచ్చునంతలో మరియొకడు నాకంటె ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. యేసు–నీవు లేచి నీ పరుపెత్తికొని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థతనొంది తన పరుపెత్తికొని నడిచెను.
ఆ దినము విశ్రాంతిదినము గనుక యూదులు–ఇది విశ్రాంతిదినము గదా; నీవు నీ పరుపెత్తికొన తగదే అని స్వస్థత నొందినవానితో చెప్పిరి. అందుకు వాడు– నన్ను స్వస్థపరచినవాడు–నీ పరుపెత్తికొని నడువుమని నాతో చెప్పెననెను. వారు–నీ పరుపెత్తికొని నడువుమని నీతో చెప్పినవాడెవడని వానిని అడిగిరి. ఆయన ఎవడో స్వస్థతనొందినవానికి తెలియలేదు; ఆ చోటను గుంపు కూడియుండెను గనుక యేసు తప్పించుకొనిపోయెను. అటుతరువాత యేసు దేవాలయములో వానిని చూచి– ఇదిగో స్వస్థతనొందితివి; మరి యెక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా వాడు వెళ్లి, తన్ను స్వస్థపరచినవాడు యేసు అని యూదులకు తెలియజెప్పెను. ఈ కార్యములను విశ్రాంతిదినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. అయితే యేసు–నాతండ్రి యిదివరకు పనిచేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరమిచ్చెను. ఆయన విశ్రాంతిదినాచారము మీరుట మాత్రమేగాక, దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి, తన్ను దేవునితో సమానునిగా చేసికొనెను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలెనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి.
కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను– తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు; ఆయన వేటిని చేయునో, వాటినే కుమారుడును ఆలాగే చేయును. తండ్రి, కుమారుని ప్రేమించుచు, తాను చేయువాటి నెల్లను ఆయనకు అగపరచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడునట్లు వీటికంటె గొప్ప కార్యములను ఆయనకు అగపరచును. తండ్రి మృతులను ఏలాగు లేపి బ్రదికించునో ఆలాగే కుమారుడును తనకిష్టము వచ్చినవారిని బ్రదికించును. తండ్రి యెవనికిని తీర్పు తీర్చడు గాని తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుని ఘనపరచవలెనని తీర్పుతీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించియున్నాడు; కుమారుని ఘనపరచనివాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు. నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవముగలవాడు; వాడు తీర్పులోనికి రాక మరణములోనుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చియున్నది, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి యేలాగు తనంతట తానే జీవముగలవాడై యున్నాడో ఆలాగే కుమారుడును తనంతట తానే జీవముగలవాడైయుండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పుతీర్చుటకు (తండ్రి) అధికారము అనుగ్రహించెను. దీనికి ఆశ్చర్యపడకుడి; ఒక కాలమువచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు ఆయన శబ్దము విని మేలు చేసినవారు జీవ పునరుత్థానమునకును కీడు చేసినవారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు.
నా అంతట నేనే ఏమియు చేయలేను; నేను వినునట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్తప్రకారమే చేయగోరుదును గాని నా యిష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది. నన్నుగూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనినయెడల నా సాక్ష్యము సత్యము కాదు. నన్నుగూర్చి సాక్ష్యమిచ్చు వేరొకడు కలడు; ఆయన నన్నుగూర్చి ఇచ్చు సాక్ష్యము సత్యమని యెరుగుదును. మీరు యోహాను నొద్దకు (కొందరిని) పంపితిరి; అతడు సత్యమునకు సాక్ష్యమిచ్చెను. నేను మనుష్యులవలన సాక్ష్యమంగీకరింపను గాని మీరు రక్షింపబడవలెనని యీ మాటలు చెప్పుచున్నాను. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమైయుండెను, మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. అయితే యోహాను సాక్ష్యముకంటె నా కెక్కువైన సాక్ష్యము కలదు; అదేమనిన, నేను నెరవేర్చుటకై తండ్రి యే క్రియలను నా కిచ్చియున్నాడో, నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపియున్నాడని నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. మరియు నన్ను పంపిన తండ్రియే నన్నుగూర్చి సాక్ష్య మిచ్చుచున్నాడు; మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు; ఆయన స్వరూపము చూడలేదు. ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు గనుక మీలో ఆయన వాక్యము నిలిచియుండలేదు.
లేఖనములయందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నాయొద్దకు రానొల్లరు. నేను మనుష్యులవలన మహిమ పొందువాడనుకాను. నేను మిమ్మును ఎరుగుదును; దేవుని ప్రేమ మీలో లేదు. నేను నా తండ్రి నామమున వచ్చియున్నాను, మీరు నన్ను అంగీకరింపరు, మరి యొకడు తన నామమున వచ్చినయెడల వానిని అంగీకరింతురు, అద్వితీయ దేవునివలన వచ్చు మెప్పునుకోరక యొకనివలన ఒకడు మెప్పుపొందుచున్న మీరు ఏలాగు నమ్మగలరు? నేను తండ్రియొద్ద మీమీద నేరము మోపుదునని తలంచకుడి; మీరాశ్రయించుచున్న మోషే మీమీద నేరము మోపును. అతడు నన్నుగూర్చి వ్రాసెను గనుక మీరు మోషేను నమ్మినట్టయిన నన్నును నమ్ముదురు. మీరతని లేఖనములను నమ్మనియెడల నా మాటలు ఏలాగు నమ్ముదురనెను.
అధ్యాయము 11
అప్పుడాయన గలిలయలోని కపెర్నహూము పట్టణమునకు వచ్చి, విశ్రాంతిదినమున వారికి బోధించుచుండెను. ఆయన వాక్యము అధికారముతోకూడినదై యుండెను గనుక వారాయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆ సమాజమందిరములో అపవిత్రమైన దయ్యపు ఆత్మపట్టిన వాడొకడుండెను. వాడు–నజరేయుడవైన యేసూ, మాతో నీకేమి? మమ్ము నశింపజేయ వచ్చితివా? నీ వెవడవో నేనెరుగుదును; నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేసెను. అందుకు యేసు–ఊరకుండుము, ఇతనిని వదలి పొమ్మని దానిని గద్దింపగా, దయ్యము వానిని వారిమధ్యను పడద్రోసి వానికి ఏ హానియు చేయక వదలి పోయెను. అందుకందరు విస్మయమొంది ఇది ఎట్టి మాట? ఈయన అధికారముతోను బలముతోను అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే అవి వదలిపోవుచున్నవని యొకనితో నొకడు చెప్పుకొనిరి. అంతట ఆయననుగూర్చిన సమాచారము ఆ ప్రాంతములందంతటను వ్యాపించెను.
ఆయన సమాజమందిరములోనుండి లేచి, సీమోను ఇంటిలోనికి వెళ్లెను. సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడియుండెను గనుక ఆమె విషయమై ఆయనయొద్ద మనవి చేసికొనిరి. ఆయన ఆమె చెంతను నిలువబడి, జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను; వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగెను. సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి. సూర్యుడస్తమించుచుండగా నానావిధ రోగములచేత పీడింపబడుచున్నవారు ఎవరెవరియొద్ద నుండిరో వారందరు ఆ రోగులను ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి; అప్పుడాయన వారిలో ప్రతివానిమీద చేతులుంచి, వారిని స్వస్థపరచెను. ఇంతేకాక దయ్యములు–నీవు దేవుని కుమారుడవని కేకలు వేసి అనేకులను వదలిపోయెను; ఆయన క్రీస్తు అని వాటికి తెలిసియుండెను గనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాటాడనీయలేదు. ఆయన మాటవలన దయ్యములను వెళ్ల గొట్టి రోగులనెల్లను స్వస్థపరచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్తయైన యెషయాద్వార చెప్పబడినది నెరవేరెను.
ఆయన పెందలకడనే లేచి యింకను చాలా చీకటి యుండగానే బయలుదేరి, అరణ్యప్రదేశమునకు వెళ్లి, అక్కడ ప్రార్థన చేయుచుండెను. సీమోనును అతనితోకూడ నున్నవారును ఆయనను వెదకుచు వెళ్లి ఆయనను కనుగొని, –అందరు నిన్ను వెదకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన ఇతర సమీప గ్రామములలోను నేను ప్రకటించునట్లు వెళ్లుదము రండి; యిందునిమిత్తమే గదా నేను బయలుదేరి వచ్చితినని వారితో చెప్పెను. యేసు వారి సమాజమందిరములలో బోధించుచు, (దేవుని) రాజ్యమునుగూర్చిన సువార్తను ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయయందంతట సంచరించెను. ఆయన కీర్తి సిరియ దేశమంతట వ్యాపించెను. నానావిధములైన రోగములచేతను వేదనలచేతను పీడింపబడిన వ్యాధి గ్రస్తులనందరిని, దయ్యముపట్టినవారిని, చాంద్రరోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయనయొద్దకు తీసికొని రాగా ఆయన వారిని స్వస్థపరచెను. గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయయను ప్రదేశములనుండియు యొర్దానునకు అవతలనుండియు బహుజనసమూహములు ఆయనను వెంబడించెను.
అధ్యాయము 12
ఆయన ఆ జనసమూహములను చూచి కొండయెక్కి కూర్చుండగా ఆయన శిష్యులాయనయొద్దకు వచ్చిరి. అప్పుడాయన నోరు తెరచి యీలాగు బోధింపసాగెను– ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది.దుఃఖపడువారు ధన్యులు; వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు; వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతికొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు; వారు తృప్తిపరచబడుదురు. కనికరముగలవారు ధన్యులు; వారు కనికరము పొందుదురు. హృదయశుద్ధిగలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు ;వారు దేవుని కుమారులనబడుదురు. నీతినిమిత్తము హింసింపబడువారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగునవారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. అయ్యో, ధనవంతులారా, మీరు (కోరిన) ఆదరణ మీరు పొంది యున్నారు. అయ్యో యిప్పుడు (కడుపు) నిండియున్నవారలారా, మీరాకలిగొందురు. అయ్యో యిప్పుడు నవ్వుచున్నవారలారా, మీరు దుఃఖించి యేడ్తురు. మనుష్యులందరు మిమ్మును కొనియాడునప్పుడు మీకు శ్రమ; వారి పితరులు అబద్ధప్రవక్తలకు అదే విధముగా చేసిరి.
నరహత్య చేయవద్దు; నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వికులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పునదేమనగా – తన సహోదరునిమీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును; ద్రోహీ అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీమీద నీ సహోదరునికి విరోధమేమైననుకలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చినయెడల అక్కడ బలిపీఠము నెదుటనే నీ యర్పణము విడిచిపెట్టి, మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడుము; అటు తరువాత వచ్చి నీ యర్పణము నర్పింపుము. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము; లేనియెడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతుకు అప్పగించును, అంతట నీవు చెరసాలలో వేయబడుదువు. కడపటి కాసు చెల్లించువరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారుగదా; నేను మీతో చెప్పునదేమనగా–ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును. నీ కుడికన్ను నిన్ను అభ్యంతర పరచినయెడల దాని పెరికి నీయొద్దనుండి పారవేయుము; నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండ నీ అవయవములలో నొకటి నశించుట నీకు ప్రయోజనకరముగదా. నీకుడిచెయ్యి నిన్నభ్యంతర పరచినయెడల దాని నరికి నీయొద్దనుండి పారవేయుము; నీ దేహమంతయు నరకములో పడకుండ నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా. తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక యియ్యవలెనని చెప్పబడియున్నది గదా; నేను మీతో చెప్పునదేమనగా–వ్యభిచారకారణమునుబట్టిగాక, తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు; విడనాడబడినదానిని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు.
మరియు–నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలెనని పూర్వికులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా, నేను మీతో చెప్పునదేమనగా–ఎంతమాత్రము ఒట్టుపెట్టుకొనవద్దు; ఆకాశము తోడనవద్దు; అది దేవుని సింహాసనము, భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము, యెరూషలేము తోడనవద్దు; అది మహారాజు పట్టణము నీ తల తోడని ఒట్టుపెట్టుకొనవద్దు, నీవు ఒక వెండ్రుకనైనను తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని యుండవలెను; వీటికి మించునది దుష్టునినుండి పుట్టునది.
కంటికి కన్ను, పంటికి పల్లు అని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పునదేమనగా దుష్టుని ఎదిరింపక, నిన్ను కుడిచెంపమీద కొట్టువాని వైపునకు ఎడమచెంప కూడ త్రిప్పుము. ఎవడైన నీమీద వ్యాజ్యెము వేసి నీ అంగీ తీసికొనగోరినయెడల వానికి నీ పైవస్త్రము కూడ ఇచ్చివేయుము. ఒకడు ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసినయెడల, వానితోకూడ రెండు మైళ్లు వెళ్లుము. నిన్ను అడుగువానికిమ్ము, నిన్ను అప్పు అడుగగోరువానినుండి నీ ముఖము త్రిప్పు కొనవద్దు. కావున మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై యున్నది.
నీ పొరుగువాని ప్రేమించి, నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా; వినుచున్న మీతో నేను చెప్పునదేమనగా–మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించువారికి మేలుచేయుడి, మిమ్మును శపించువారిని దీవించుడి, మిమ్మును బాధించువారికొరకు ప్రార్థనచేయుడి. ఆయన చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులమీదను, అనీతిమంతులమీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మును ప్రేమించువారినే ప్రేమించినయెడల మీకేమి ఫలము కలుగును? సుంకరులును ఆలాగు చేయుచున్నారు గదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసినయెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులును ఆలాగు చేయుచున్నారు గదా. మీకు మేలుచేయువారికే మేలు చేసినయెడల మీకేమి మెప్పుకలుగును? పాపులును ఆలాగే చేతురు గదా మీరెవరియొద్ద మరల పుచ్చుకొనవలెనని నిరీక్షింతురో వారికే అప్పు ఇచ్చినయెడల మీకేమి మెప్పు కలుగును? పాపులును తామిచ్చినంత మరల పుచ్చుకొనవలెనని పాపులకు అప్పు ఇచ్చెదరు గదా. మీరైతే ఎట్టి వారిని గూర్చియైనను నిరాశ చేసికొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలుచేయుడి, అప్పు ఇయ్యుడి; అప్పుడు మీ ఫలము గొప్పదైయుండును, మీరు సర్వోన్నతుని కుమారులైయుందురు. ఆయన, కృతజ్ఞతలేనివారియెడలను దుష్టులయెడలను ఉపకారియై యున్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరముగలవాడై యున్నట్టు మీరును కనికరముగలవారై యుండుడి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు.
అధ్యాయము 13
మనుష్యులకు కనబడవలెనని వారియెదుట మీ నీతి కార్యము చేయకుండ జాగ్రత్తపడుడి; లేనియెడల పరలోకమందున్న మీ తండ్రియొద్ద మీరు ఫలము పొందరు. కావున నీవు ధర్మము చేయునప్పుడు, మనుష్యులవలన ఘనత నొందవలెనని, వేషధారులు సమాజమందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బూర ఊదింప వద్దు; వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయునప్పుడు, నీ ధర్మము రహస్యముగానుండు నిమిత్తము నీ కుడిచెయ్యి చేయునది నీ యెడమచేతికి తెలియకయుండవలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతి ఫలమిచ్చును. మరియు మీరు ప్రార్థనచేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు; మనుష్యులకు కనబడవలెనని సమాజమందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము; వారు తమ ఫలము పొంది యున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయునప్పుడు, నీ గదిలోనికి వెళ్లి తలుపువేసి, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థనచేయుము; అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతి ఫలమిచ్చును. మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారులవలె దుఃఖముఖులై యుండకుడి; తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసికొందురు; వారు తమ ఫలము పొంది యున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలెనని కాక, రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలెనని, నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని, నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును.
మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనులవలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు; విస్తరించి మాటలాడుటవలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు; మీరు వారివలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగకమునుపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియును; కాబట్టి మీరీలాగు ప్రార్థనచేయుడి, –పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరునుగాక, మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము. మా ఋణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములు క్షమించుము. మమ్మును శోధనలోకి తేక దుష్టునినుండి మమ్మును తప్పించుము. మనుష్యుల అపరాధములను మీరు క్షమించినయెడల, మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపక పోయినయెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు.
మీకు కలిగినవాటిని అమ్మి ధర్మము చేయుడి, పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి; అక్కడికి దొంగరాడు, చిమ్మెటకొట్టదు. భూమిమీద మీకొరకు ధనమును కూర్చుకొనవద్దు; ఇక్కడ చిమ్మెటయు, తుప్పును తినివేయును, దొంగలు కన్నమువేసి దొంగిలెదరు. నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును. ఎవడును దీపము వెలిగించి, చాటుచోటునైనను కుంచముక్రిందనైనను పెట్టడు గాని, లోపలికి వచ్చువారికి వెలుగు కనబడుటకు దీపస్తంభముమీదనే పెట్టును. నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక, నీ కన్ను తేటగా నుంటె నీ దేహమంతయు వెలుగుమయమై యుండును; అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై యుండును. కాబట్టి నీలోనుండు వెలుగు చీకటియైయుండకుండ చూచుకొనుము. ఏ భాగమైనను చీకటికాక నీ దేహమంతయు వెలుగు మయమైతే, దీపము తన కాంతివలన నీకు వెలుగిచ్చునప్పుడు ఏలాగుండునో ఆలాగు దేహమంతయు వెలుగుమయమై యుండునని చెప్పెను.
ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు; అతడు ఒకని ద్వేషించి యొకని ప్రేమించును; లేదా యొకని పక్షముగానుండి యొకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు. అందువలన నేను మీతో చెప్పునదేమనగా–ఏమి తిందుమో యేమి త్రాగుదుమో అని మీ ప్రాణమునుగూర్చియైనను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమునుగూర్చియైనను చింతింపకుడి; ఆహారముకంటె ప్రాణమును, వస్త్రము కంటె దేహమును గొప్పవి కావా? ఆకాశపక్షులను చూడుడి; అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు; అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు; మీరు వాటికంటె బహు శ్రేష్ఠులు కారా? మీలో నెవడు చింతించుటవలన తన యెత్తు మూరెడెక్కువ చేసికొనగలడు? కాబట్టి అన్నిటికంటె తక్కువైనవి మీచేత కాకపోతే తక్కిన వాటిని గూర్చి మీరు చింతింపనేల?
వస్త్రములనుగూర్చి మీరు చింతింప నేల? అడవిపువ్వులు ఏలాగు నెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఒడకవు అయినను తన సమస్త వైభవముతోకూడిన సొలొమోను సహితము వీటిలో నొకదానివలెనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడీలాగు అలంకరించినయెడల, అల్పవిశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా. కాబట్టి– ఏమి తిందుమో యేమి త్రాగుదుమో యేమి ధరించుకొందుమో అని చింతింపకుడి; అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును. చిన్న మందా భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైయున్నది. రేపటినిగూర్చి చింతింపకుడి; రేపటి దినము దాని సంగతులనుగూర్చి చింతించును; ఏనాటికీడు ఆనాటికి చాలును.
అధ్యాయము 14
మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మునుగూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మునుగూర్చియు తీర్పు తీర్చబడును, మీరు కొలుచుకొలత చొప్పుననే మీకును కొలువబడును.
క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు; ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును; అణచి, కుదిలించి, దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలువబడునని చెప్పెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను–గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చూపగలడా? వారిద్దరును గుంటలో పడుదురు గదా. నీవు నీ కంటిలో ఉన్న దూలము ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేల? నీకంటిలో దూలముండగా, నీవు నీ సహోదరుని చూచి–నీకంటిలో నున్న నలుసును తీసి వేయనిమ్మని చెప్ప నేల? వేషధారీ, మొదట నీ కంటిలో నున్న దూలమును తీసివేసికొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందులయెదుట వేయకుడి; వేసినయెడల అవి యొకవేళ వాటిని కాళ్లతో త్రొక్కి మీ మీదపడి మిమ్మును చీల్చి వేయును.
మరియు ఆయన వారితో ఇట్లనెను–మీలో ఎవనికైన ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రివేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్లి–స్నేహితుడా, నాకు మూడురొట్టెలు బదులిమ్ము; నా స్నేహితుడు ప్రయాణముచేయుచు మార్గములో నాయొద్దకు వచ్చియున్నాడు; అతనికి పెట్టుటకు నాయొద్ద ఏమియు లేదని అతనితో చెప్పినయెడల అతడు లోపలనేయుండి నన్ను తొందరపెట్టవద్దు; తలుపు వేసియున్నది, నా చిన్నపిల్లలు నాతోకూడ పండుకొని యున్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా? అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను, అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుటవలననైనను లేచి అతనికి కావలసినవన్నియు ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అటువలె మీరును అడుగుడి, మీ కియ్యబడును; వెదకుడి, మీకు దొరకును;తట్టుడి, మీకు తీయబడును. అడుగు ప్రతివానికియ్యబడును, వెదకువానికి దొరకును,తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రియైనవాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? గుడ్డునడిగితే తేలు నిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారైయుండియు, మీ పిల్లలకు మంచి యీవులనియ్య నెరిగియుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి; నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునైయున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై యున్నది, దాని కనుగొనువారు కొందరే.
అబద్ధ ప్రవక్తలనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు గొఱ్ఱెల చర్మములు వేసికొని మీయొద్దకు వత్తురు కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు. వారి ఫలములవలన మీరు వారిని తెలిసికొందురు. ముండ్లపొదలలో ద్రాక్ష పండ్లనైనను, పల్లేరుచెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా? ఆలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కానిఫలములు ఫలించును. మంచి చెట్టు కానిఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతిచెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలములవలన వారిని తెలిసికొందురు. సజ్జనుడు, తన హృదయమను మంచి ధననిధిలోనుండి సద్విషయములను బయటికి తెచ్చును; దుర్జనుడు చెడ్డ ధననిధిలోనుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండియుండు దానినిబట్టి యొకని నోరు మాటలాడును.
–ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి–ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్లగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు. అప్పుడు –నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమముచేయువారలారా, నాయొద్దనుండి పొండని వారితో చెప్పుదును. కాబట్టి యీ నా మాటలు విని వాటిచొప్పునచేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను గాని దాని పునాది బండమీద వేయబడెను గనుక అది పడలేదు. మరియు యీ నా మాటలు విని వాటిచొప్పున చేయని ప్రతివాడు ఇసుకమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను, అప్పుడది కూలబడెను; దాని పాటు గొప్పదని చెప్పెను.
యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఏలయనగా ఆయన వారి శాస్త్రులవలె కాక అధికారముగలవానివలె వారికి బోధించెను.
అధ్యాయము 15
ఆయన ఆ కొండమీదనుండి దిగి వచ్చినప్పుడు బహుజనసమూహములు ఆయనను వెంబడించెను. ఆయన యొక పట్టణములోనున్నప్పుడు ఇదిగో కుష్ఠ రోగముతో నిండిన యొక మనుష్యుడుండెను. వాడు యేసును చూచి, సాగిలపడి–ప్రభువా, నీ కిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనను వేడుకొనెను. ఆయన కనికరపడి, చెయ్యిచాపి వానిని ముట్టి నాకిష్టమే; నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయెను. అప్పుడాయన–ఎవనితోను ఏమియు చెప్పకు సుమీ; కాని నీవు వెళ్లి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనబరచుకొని, నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించుమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేసెను. అయితే వాడు వెళ్లి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును, ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించెను గనుక ఆయన ఇక పట్టణములో బహిరంగముగా ప్రవేశింపలేక, వెలుపల అరణ్యప్రదేశములలో నుండెను. నలుదిక్కులనుండి జనులు ఆయనయొద్దకు వచ్చుచుండిరి.
ఆయన సముద్రతీరమున మరల నడచిపోవుచుండెను. జనులందరును ఆయనయొద్దకు రాగా ఆయన వారికి బోధించెను. అటుపిమ్మట ఆయన బయలుదేరి, లేవి యను ఒక సుంకరి, సుంకపు మెట్టునొద్ద కూర్చుండియుండుట చూచి –నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి, లేచి, ఆయనను వెంబడించెను. ఆ లేవి, తన యింట ఆయనకు గొప్ప విందు చేసెను. సుంకరులును ఇతరులు అనేకులును వారితోకూడ భోజనమునకు కూర్చుండిరి. పరిసయ్యులును వారి శాస్త్రులును ఇది చూచి–సుంకరులతోను పాపులతోను మీరేల తిని త్రాగుచున్నారని ఆయన శిష్యులమీద సణిగిరి. అందుకు యేసు – రోగులకే గాని ఆరోగ్యముగలవారికి వైద్యుడక్కరలేదు. మారుమనస్సు పొందుటకై నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను.
వారాయనను చూచి–యోహాను శిష్యులు తరచుగా ఉపవాసప్రార్థనలు చేయుదురు; ఆలాగే పరిసయ్యుల శిష్యులును చేయుదురు గాని, నీ శిష్యులు తిని త్రాగుచున్నారే అని చెప్పిరి. అందుకు యేసు–పెండ్లికుమారుడు తమతో ఉన్నంతకాలము పెండ్లి ఇంటి వారి చేత మీరు ఉపవాసము చేయింపగలరా? పెండ్లికుమారుడు వారియొద్దనుండి కొనిపోబడు దినములు వచ్చును; ఆ దినములలో వారు ఉపవాసము చేతురని వారితో చెప్పెను.
ఆయన వారితో ఒక ఉపమానము చెప్పెను. ఎట్లనగా– ఎవడును పాతబట్టకు క్రొత్తగుడ్డ మాసికవేయడు; వేసినయెడల క్రొత్తది దానిని చింపివేయును; అదియునుగాక క్రొత్తదానిలోనుండి తీసిన ముక్క పాతదానితో కలియదు. మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయరు; పోసినయెడల తిత్తులు పిగిలి, ద్రాక్షారసము కారిపోవును, తిత్తులు పాడగును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయుదురు, అప్పుడు ఆ రెండును చెడిపోక యుండునని చెప్పెను. పాత ద్రాక్షారసము త్రాగి వెంటనే క్రొత్త దానిని కోరువాడెవడును లేడు; పాతదే మంచిదనునని చెప్పెను.
అధ్యాయము 16
ఆ కాలమందు యేసు విశ్రాంతిదినమున పంట చేలలో పడి వెళ్లుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగిరి. పరిసయ్యులదిచూచి– ఇదిగో, విశ్రాంతిదినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను–తానును తనతోకూడ నున్నవారును ఆకలిగొని యుండగా దావీదు చేసిన దానిగూర్చి మీరు చదువ లేదా? అతడు దేవుని మందిరములో ప్రవేశించి, యాజకులే తప్ప తానైనను తనతోకూడ ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినెను. మరియు యాజకులు విశ్రాంతిదినమున దేవాలయములో విశ్రాంతిదినమును ఉల్లంఘించియు నిర్దోషులై యున్నారని మీరు ధర్మశాస్త్రమందు చదువలేదా? దేవాలయముకంటె గొప్ప వాడిక్కడ నున్నాడని మీతో చెప్పుచున్నాను. మరియు–కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అను వాక్యభావము మీకు తెలిసియుంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు. మరియు–విశ్రాంతిదినము మనుష్యులకొరకే నియమింపబడెను గాని మనుష్యులు విశ్రాంతిదినముకొరకు నియమింపబడలేదు. అందువలన మనుష్యకుమారుడు విశ్రాంతిదినమునకును ప్రభువై యున్నాడని వారితో చెప్పెను.
మరియొక విశ్రాంతిదినమున ఆయన సమాజమందిరములోనికి వెళ్లి బోధించుచున్నప్పుడు, అక్కడ ఊచ కుడి చెయ్యిగలవాడొకడుండెను. శాస్త్రులును పరిసయ్యులును ఆయనమీద నేరము మోపవలెనని, విశ్రాంతి దినమున స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి; అయితే ఆయన వారి ఆలోచన లెరిగి, ఊచచెయ్యిగలవానితో– నీవు లేచిమధ్యను నిలువుమని చెప్పగా, వాడు లేచి నిలిచెను. వారాయనమీద నేరము మోపవలెనని–విశ్రాంతిదినమున స్వస్థపరచుట న్యాయమా? అని ఆయనను అడిగిరి. అప్పుడు యేసు–విశ్రాంతిదినమున మేలుచేయుట ధర్మమా కీడుచేయుట ధర్మమా? ప్రాణరక్షణ ధర్మమా ప్రాణ హత్య ధర్మమా? అని మిమ్ము నడుగుచున్నానని వారితో చెప్పి. అందుకాయన మీలో ఏ మనుష్యునికైనను నొక గొఱ్ఱెయుండి అది విశ్రాంతిదినమున గుంటలో పడినయెడల దాని పట్టుకొని పైకి తీయడా? గొఱ్ఱె కంటె మనుష్యుడెంతో శ్రేష్ఠుడు; కాబట్టి విశ్రాంతిదినమున మేలుచేయుట ధర్మమే అని చెప్పి. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి, కోపముతో వారిని కలయ చూచి నీ చెయ్యిచాపుమని ఆ మనుష్యునితో చెప్పెను; వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదీయులతో కలిసికొని, ఆయన నేలాగు సంహరింతుమా యని ఆయనకు విరోధముగా ఆలోచనచేసిరి.
యేసు ఆ సంగతి తెలిసికొని అచ్చటనుండి వెళ్లిపోయెను. బహుజనులాయనను వెంబడింపగా ఆయన వారినందరిని స్వస్థపరచి, తన్ను ప్రసిద్ధిచేయవద్దని వారికి ఆజ్ఞాపించెను. ప్రవక్తయైన యెషయాద్వారా చెప్పినది నెరవేరునట్లు (ఆలాగు జరిగెను) అదేమనగా – ఇదిగో ఈయన నా సేవకుడు ఈయనను నేను ఏర్పరచుకొంటిని ఈయన నా ప్రాణమున కిష్టుడైన నా ప్రియుడు ఈయనమీద నా ఆత్మ నుంచెదను ఈయన అన్యజనులకు న్యాయవిధిని ప్రచురము చేయును. ఈయన జగడమాడడు, కేకలువేయడు వీధులలో ఈయన శబ్దమెవనికిని వినబడదు విజయమొందుటకు న్యాయవిధిని ప్రబలము చేయువరకు ఈయన నలిగిన రెల్లును విరువడు మకమకలాడుచున్న అవిసెనారను ఆర్పడు ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు అనునదే. యేసు తన శిష్యులతోకూడ సముద్రమునొద్దకు వెళ్లగా, గలిలయనుండి వచ్చిన గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను, మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యూదయనుండియు, యెరూషలేమునుండియు, ఇదూమయనుండియు, యొర్దాను అవతలనుండియు, తూరు సీదోను అనెడి పట్టణప్రాంతములనుండియు ఆయనయొద్దకు గుంపులు గుంపులుగా వచ్చిరి. జనులు గుంపుకూడగా చూచి, వారు తనకు ఇరుకు కలిగింపకుండునట్లు చిన్నదోనె యొకటి తనకు సిద్ధపరచియుంచవలెనని ఆయన తన శిష్యులతో చెప్పెను. ఆయన అనేకులను స్వస్థపరచెను గనుక రోగపీడితులైన వారందరు ఆయనను ముట్టుకొనవలెనని ఆయనమీద పడుచుండిరి. అపవిత్రాత్మలు పెట్టినవారు ఆయనను చూడగానే ఆయన యెదుట సాగిలపడి–నీవు దేవుని కుమారుడ వని చెప్పుచు కేకలువేసిరి. తన్ను ప్రసిద్ధిచేయవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను.
అధ్యాయము 17
ఆ దినములయందు ఆయన ప్రార్థనచేయుటకు కొండకు వెళ్లి, దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి, వారిలో పండ్రెండుమందిని ఏర్పరచి, వారికి అపొస్తలులు అను పేరు పెట్టెను. వారు తనతోకూడ ఉండునట్లును దయ్యములను వెళ్లగొట్టు అధికారముగలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన పండ్రెండు మందిని నియమించెను. ఆ పండ్రెండుమంది అపొస్తలుల పేర్లు ఏవనగా, మొదట పేతురనబడిన సీమోను, అతని సహోదరుడగు అంద్రెయ; జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను; ఫిలిప్పు, బర్తొలొమయి; తోమా, సుంకరియైన మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయియను మారుపేరుగల లెబ్బయి; కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా.
ఆయన తరువాత కపెర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగియై చావ సిద్ధమైయుండెను. శతాధిపతి యేసునుగూర్చి విని, ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వారు యేసునొద్దకు వచ్చి–నీవలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు; అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజమందిరము తానే కట్టించెనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి.కావున యేసు వారితోకూడ వెళ్లెను. ఆయన ఆ యింటిదగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి–మీ రాయనయొద్దకు వెళ్లిప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు; నీవు నా యింటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. అందుచేత నీయొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు; అయితే మాటమాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును, నేను సహా అధికారమునకు లోబడినవాడను; నా చేతిక్రిందను సైనికులు ఉన్నారు; నేనొకని పొమ్మంటె పోవును, ఒకని రమ్మంటె వచ్చును, నాదాసుని చేయుమంటే ఇది చేయునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపెను. యేసు ఈ మాటలు విని, అతనిగూర్చి ఆశ్చర్యపడి, తనవెంట వచ్చుచున్న జనసమూహమువైపు తిరిగి–ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని. అనేకులు తూర్పునుండియు పడమటనుండియు వచ్చి అబ్రాహాముతోకూడను, ఇస్సాకుతోకూడను, యాకోబుతోకూడను, పరలోకరాజ్యమందు కూర్చుందురు గాని రాజ్యసంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయునుండునని మీతో చెప్పుచున్నాననెను. ఆ గడియలోనే అతనిదాసుడు స్వస్థతనొందెను. పంపబడినవారు ఇంటికి తిరిగివచ్చి, ఆ దాసుడు స్వస్థుడైయుండుట కనుగొనిరి.
వెంటనే ఆయన నాయీనను ఒక ఊరికి వెళ్లుచుండగా, ఆయన శిష్యులును బహుజనసమూహమును ఆయనతోకూడ వెళ్లుచుండిరి. ఆయన ఆ ఊరి గవినియొద్దకు వచ్చినప్పుడు, చనిపోయిన యొకడు వెలుపలికి మోసికొని పోబడుచుండెను; అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు; ఆ ఊరి జనులు అనేకులు ఆమెతోకూడ ఉండిరి. ప్రభువు ఆమెను చూచి ఆమెయందు కనికరపడి–ఏడువవద్దని ఆమెతో చెప్పి, దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. ఆయన –చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయినవాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను; ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. అందరు భయాక్రాంతులై–మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి యున్నాడనియు, దేవుడు తన ప్రజలకు దర్శనమను గ్రహించియున్నాడనియు దేవుని మహిమపరచిరి. ఆయననుగూర్చిన యీ సమాచారము యూదయ యందంతటను చుట్టుపట్ల ప్రదేశమందంతటను వ్యాపించెను.
పరిసయ్యులలో ఒకడు తనతోకూడ భోజనము చేయవలెనని ఆయననడిగెను. ఆయన ఆ పరిసయ్యుని యింటికి వెళ్లి, భోజనపంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన యొక స్త్రీ, యేసు పరిసయ్యుని యింట భోజనమునకు కూర్చున్నాడని తెలిసికొని, యొక బుడ్డిలో అత్తరు తీసికొనివచ్చి వెనుకతట్టు ఆయన పాదములయొద్ద నిలువబడి, యేడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి, తన తలవెండ్రుకలతో తుడిచి, ఆయన పాదములను ముద్దుపెట్టుకొని, ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి–ఈయన ప్రవక్తయైనయెడల తన్ను ముట్టుకొనిన యీ స్త్రీ ఎవతెయో ఎటువంటిదో యెరిగియుండును; ఇది పాపాత్మురాలు అని తనలో తాననుకొనెను. అందుకు యేసు– సీమోనూ, నీతో ఒక మాట చెప్పవలెనని యున్నానని అతనితో అనగా అతడుబోధకుడా, చెప్పుమనెను. అప్పుడు యేసు–అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు ఋణస్థులుండిరి. వారిలో ఒకడు ఐదువందల దేనారములును మరియొకడు ఏబది దేనారములును అచ్చియుండిరి. ఆ అప్పు తీర్చుటకు వారియొద్ద ఏమియు లేకపోయెను గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగెను. అందుకు సీమోను–అతడెవనికి ఎక్కువ క్షమించెనో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన–నీవు సరిగా యోచించితివని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి, సీమోనుతో ఇట్లనెను–ఈ స్త్రీ ని చూచుచున్నావే, నేను నీ యింటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్లియ్య లేదు గాని, యీమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తలవెండ్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దుపెట్టుకొనలేదు గాని, నేను లోపలికి వచ్చినప్పటి నుండి యీమె నా పాదములు ముద్దుపెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమెయొక్క విస్తార పాపములు క్షమించబడెనని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో, వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి –నీ పాపములు క్షమింపబడియున్నవి అని ఆమెతో అనెను. అప్పుడాయనతోకూడ భోజన పంక్తిని కూర్చుండినవారు–పాపములు క్షమించుచున్న యితడెవడని తమలోతాము అనుకొనసాగిరి. అందుకాయన– నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్లుమని ఆ స్త్రీ తో చెప్పెను.
అధ్యాయము 18
వెంటనే ఆయన దేవుని రాజ్యసువార్తను తెలుపుచు, ప్రకటించుచు, ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా పండ్రెండుమంది శిష్యులును, అపవిత్రాత్మలును వ్యాధులును పోగొట్టబడిన కొందరు స్త్రీ లును, అనగా ఏడు దయ్యములు వదలి పోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదుయొక్క గృహనిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నయు, సూసన్నయు ఆయనతోకూడ ఉండిరి. వీరును ఇతరులనేకులును, తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి.
ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరల గుంపు కూడి వచ్చిరి గనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయెను. అప్పుడు దయ్యముపట్టిన గ్రుడ్డివాడును మూగవాడునైన యొకడు ఆయనయొద్దకు తేబడెను. ఆయన వానిని స్వస్థపరచినందున ఆ మూగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడాయెను. అందుకు ప్రజలందరు విస్మయమొంది –ఈయన దావీదు కుమారుడు కాడా, అని చెప్పుకొనుచుండిరి. పరిసయ్యులు ఆ మాట విని వీడు దయ్యములకు అధిపతియైన బయెల్జెబూలువలననే దయ్యములను వెళ్లగొట్టుచున్నాడు గాని మరియొకని వలన కాదనిరి. అప్పుడాయన వారిని తన యొద్దకు పిలిచి, ఉపమానరీతిగా వారితో ఇట్లనెను– సాతాను సాతాను నేలాగు వెళ్లగొట్టును? ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడినయెడల, ఆ రాజ్యము నిలువనేరదు. ఒక యిల్లు తనుకుతానే విరోధముగా వేరు పడినయెడల, ఆ యిల్లు నిలువనేరదు. తనకుతానే విరోధముగా వేరుపడిన యే పట్టణమైనను ఏ యిల్లయినను నిలువదు. ' సాతాను సాతానును వెళ్లగొట్టినయెడల తనకుతానే విరోధముగా వేరుపడును; అట్లయితే వాని రాజ్యమేలాగు నిలుచును?
నేను బయెల్జెబూలువలన దయ్యములను వెళ్లగొట్టుచున్నానని మీరు చెప్పుచున్నారే. నేను బయెల్జెబూలువలన దయ్యములను వెళ్లగొట్టుచున్నయెడల మీ కుమారులు ఎవనివలన వెళ్లగొట్టుచున్నారు? అందుచేత వారే మీకు తీర్పరులైయుందురు. అయితే నేను దేవుని వ్రేలితో దయ్యములను వెళ్లగొట్టుచున్నయెడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీయొద్దకు వచ్చియున్నది. ఒకడు బలవంతుడైనవానిని మొదట బంధించితేనే తప్ప, ఆ బలవంతుని ఇంటజొచ్చి వాని సామగ్రి దోచుకొననేరడు; బంధించినయెడల వాని యిల్లు దోచుకొనవచ్చును. నా పక్షమున నుండనివాడు నాకు విరోధి; నాతో కలిసి సమకూర్చనివాడు చెదరగొట్టువాడు.
అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదలిపోయిన తరువాత అది విశ్రాంతివెదకుచు నీరులేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున–నేను వదలివచ్చిన నా యింటికి తిరిగి వెళ్లుదుననుకొని వచ్చి, ఆ యింట ఎవరును లేక అది ఊడ్చి అమర్చియుండుటచూచి, వెళ్లి తనకంటె చెడ్డవైన మరి యేడు దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును; అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుష్యుని కడపటిస్థితి మొదటిస్థితికంటె చెడ్డదగును. ఆలాగే యీ దుష్టతరమువారికిని సంభవించుననెను.
కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా– సమస్త పాపములును మనుష్యులుచేయు దూషణలన్నియు వారికి క్షమింపబడును గాని పరిశుద్ధాత్మ విషయము దూషణచేయువాడెప్పుడును క్షమాపణ పొందక నిత్యపాపము చేసినవాడైయుండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. మనుష్యకుమారునికి విరోధముగా మాటలాడువానికి పాపక్షమాపణ కలదుగాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు. చెట్టు మంచిదని యెంచి దాని పండును మంచిదే అని యెంచుడి; లేదా, చెట్టు చెడ్డదని యెంచి దాని పండును చెడ్డదే అని యెంచుడి. చెట్టు దాని పండువలన తెలియబడును. సర్పసంతానమా, మీరు చెడ్డవారైయుండి ఏలాగు మంచిమాటలు పలుకగలరు? హృదయమందు నిండియుండు దానినిబట్టి నోరు మాటలాడును గదా. సజ్జనుడు తన మంచి ధననిధిలోనుండి సద్విషయములను తెచ్చును; దుర్జనుడు తన చెడ్డ ధననిధిలోనుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పునదేమనగా –మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటనుగూర్చియు విమర్శదినమున లెక్క చెప్పవలసియుండును. నీ మాటలనుబట్టి నీతిమంతుడవని తీర్పునొందుదువు, నీ మాటలనుబట్టియే అపరాధివని తీర్పునొందుదువు. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పట్టినవాడని వారు చెప్పిరి.
ఆయన యీ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములోనున్న యొక స్త్రీ ఆయనను చూచి–నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములును ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులని చెప్పెను. అప్పుడు శాస్త్రులలోను పరిసయ్యులలోను కొందరు–బోధకుడా, నీవలన ఒక సూచకక్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లనెను. –వ్యభిచారులైన చెడ్డ తరమువారు సూచక క్రియను అడుగుచున్నారు. ప్రవక్తయైన యోనానుగూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియయైనను వారికి అనుగ్రహింపబడదు. యోనా మూడు రాత్రింబగళ్లు తిమింగిలము కడుపులో ఏలాగుండెనో ఆలాగు మనుష్యకుమారుడు మూడు రాత్రింబగళ్లు భూగర్భములో ఉండును. నీనెవెవారు యోనా ప్రకటన విని మారుమనస్సు పొందిరి గనుక విమర్శ సమయమున నీనెవెవారు ఈ తరమువారితో నిలువబడి వారిమీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనాకంటె గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. విమర్శ సమయమున దక్షిణదేశపురాణి యీ తరము వారితో నిలువబడి వారిమీద నేరస్థాపన చేయును; ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమ్యంతములనుండి వచ్చెను; ఇదిగో సొలొమోనుకంటె గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.
ఆయన జనసమూహములతో ఇంక మాటలాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులును ఆయనతో మాటలాడ గోరుచు వెలుపల నిలిచియుండిరి. అప్పుడొకడు –ఇదిగో నీ తల్లియు నీ సహోదరులును నీతో మాటలాడవలెనని వెలుపల నిలిచియున్నారని ఆయనతో చెప్పెను. అందుకాయన తనతో ఈ సంగతి చెప్పినవానిచూచి– నా తల్లి యెవరు? నా సహోదరు లెవరు? అని చెప్పి. తన చుట్టుకూర్చున్న వారిని కలయచూచి– ఇదిగో నా తల్లియు నా సహోదరులును; దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహోదరియు తల్లియునని. –దేవుని వాక్యము విని, దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులునని వారితో చెప్పెను.
అధ్యాయము 19
ఆయన సముద్రతీరమున మరల బోధింపనారం భింపగా, బహుజనులాయనయొద్దకు కూడివచ్చియున్నందున ఆయన సముద్రములో ఒక దోనెయెక్కి కూర్చుండెను. జనులందరు సముద్రతీరమున నేలమీద నుండిరి. ఆయన ఉపమానరీతిగా చాల సంగతులు వారికి బోధించుచు తన బోధలో వారితో ఇట్లనెను –వినుడి; ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్లెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవప్రక్కను పడెను. పక్షులువచ్చి వాటిని మ్రింగివేసెను. కొన్ని చాల మన్ను లేని రాతినేలను పడెను; అక్కడ మన్ను లోతుగా ఉండ నందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయింపగానే అవి మాడి, వేరులేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్లపొదలలో పడెను; ముండ్లపొదలు ఎదిగి వాటిని అణచివేసెను గనుక అవి ఫలింపలేదు. కొన్ని మంచినేలను పడెను; అవి మొలిచి పెరిగి పైరై ముప్పదంతలుగాను అరువదంతలుగాను నూరంతలుగాను ఫలించెను. –వినుటకు చెవులుగలవాడు వినునుగాక అని చెప్పెను.
తరువాత శిష్యులు వచ్చి–నీవు ఉపమానరీతిగా ఎందుకు వారితో మాటలాడుచున్నావని ఆయనను అడుగగా, ఆయన వారితో ఇట్లనెను. అందుకాయన దేవుని రాజ్య మర్మము (తెలిసికొనుట) మీకు అనుగ్రహింపబడియున్నది గాని వెలుపలనుండువారు ఒకవేళ దేవునివైపు తిరిగి పాపక్షమాపణ పొందుదురని, వారు చూచుటకైతే చూచియు కనుగొనకను, వినుటకైతే వినియు గ్రహింపకయు నుండుటకును అన్నియు ఉపమానరీతిగా వారికి బోధింపబడుచున్నవని వారితో చెప్పెను. కలిగినవానికే యియ్యబడును, వానికి సమృద్ధి కలుగును; లేనివానికి కలిగినదియు వానియొద్దనుండి తీసివేయబడును. మరియు–వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయునున్నారు. ఈ ప్రజలు కన్నులార చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నావలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందము లైనవి, వారు తమ కన్నులు మూసికొనియున్నారు గనుక మీరు వినుటమట్టుకు విందురుగాని గ్రహింపనే గ్రహిoపరు, చూచుటమట్టుకు చూతురు గాని యెంత మాత్రమును తెలిసికొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది. అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. అనేక ప్రవక్తలును నీతిమంతులును మీరు చూచువాటిని చూడగోరియు చూడక పోయిరి, మీరు వినువాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
ఆయన శిష్యులు–ఈ ఉపమానభావమేమిటని ఆయనను అడుగగా, మరియు–ఈ ఉపమానము మీకు తెలియలేదా? ఆలాగైతే ఉపమానములన్నియు మీకేలాగు తెలియుననెను. ఈ ఉపమాన భావమేమనగా, విత్తనము దేవుని వాక్యము. త్రోవ ప్రక్కనుండువారు, వారు వినువారు గాని నమ్మిరక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయములోనుండి వాక్యమెత్తికొని పోవును. రాతినేలనుండు వారెవరనగా, వినునప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు గాని వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధనకాలమున తొలగిపోవుదురు. ముండ్ల పొదలలో పడిన (విత్తనమును పోలిన) వారెవరనగా, విని కాలము గడిచినకొలది యీ జీవనసంబంధమైన విచారములచేతను ధనభోగములచేతను అణచివేయబడి పరిపక్వముగా ఫలింపనివారు. మంచి నేల నుండు (విత్తనమును పోలిన) వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు.
ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను, ఏమనగా పరలోకరాజ్యము, తన పొలములో మంచి విత్తనము విత్తిన యొక మనుష్యుని పోలియున్నది. మనుష్యులు నిద్రించుచుండగా, అతని శత్రువు వచ్చి గోధుమలమధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజపెట్టినప్పుడు గురుగులు కూడ అగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి –అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనమువిత్తితివి గదా, అందులో గురుగులెక్కడనుండి వచ్చినవని అడిగిరి. –ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు–మేము వెళ్లి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా? అని అతనిని అడిగిరి. అందుకతడు –వద్దు; గురుగులను పెరుకుచుండగా, వాటితోకూడ ఒకవేళ గోధుమలను పెల్లగింతురు. కోతకాలమువరకు రెంటినికలిసి యెదుగ నియ్యుడి; కోతకాలమందు గురుగులను ముందుగాకూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి, గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదుననెను.
అప్పుడాయన జనసమూహములను పంపివేసి, యింటిలోనికి వెళ్లగా ఆయన శిష్యులాయనయొద్దకు వచ్చి–పొలములోని గురుగులనుగూర్చిన ఉపమానభావము మాకు తెలియజెప్పుమనిరి. అందుకాయన ఇట్లనెను–మంచి విత్తనము విత్తువాడు మనుష్యకుమారుడు; పొలము లోకము; మంచి విత్తనములు రాజ్య సంబంధులు; గురుగులు దుష్టుని సంబంధులు; వాటిని విత్తిన శత్రువు అపవాది; కోత యుగసమాప్తి; కోతకోయువారు దేవదూతలు. గురుగులు ఏలాగు కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో ఆలాగే యుగ సమాప్తియందు జరుగును. మనుష్యకుమారుడు తన దూతలను పంపును; వారాయన రాజ్యములోనుండి ఆటంకములగు సకలమైనవాటిని దుర్నీతిపరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లుకొరుకుటయును ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యునివలె తేజరిల్లుదురు. చెవులుగలవాడు వినునుగాక.
మరియు ఆయన–ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి, రాత్రింబగళ్లు నిద్రపోవుచు, మేల్కొనుచు నుండగా, వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యమున్నది. భూమి మొదట మొలకను తరువాత వెన్నును అటుతరువాత వెన్నులో ముదురు గింజలను తనంతటతానే పుట్టించును. పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టి కోయునని చెప్పెను. మరియు ఆయన ఇట్లనెను–దేవుని రాజ్యమును ఎట్లు పోల్చెదము? ఏ ఉపమానముతో దానిని ఉపమించెదము? అది ఆవగింజను పోలియున్నది. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమిమీదనున్న విత్తనములన్నిటికంటె చిన్నదే గాని విత్తబడిన తరువాత అది మొలిచి యెదిగి కూర మొక్కలన్నిటికంటె పెద్దదై గొప్ప కొమ్మలు వేయును గనుక ఆకాశపక్షులు దాని నీడను నివసింపగలవనెను. ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను–పరలోకరాజ్యము, ఒక స్త్రీ తీసికొని పిండి అంతయు పులిసి పొంగువరకు మూడు కుంచముల పిండిలో దాచి పెట్టిన పుల్లని పిండిని పోలియున్నది. నేను నా నోరు తెరచి ఉపమానరీతిగా బోధించెదను,లోకము పుట్టినది మొదలుకొని మరుగుచేయబడిన సంగతులను తెలియజెప్పెదను అని ప్రవక్త చెప్పినమాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులనన్నిటిని జనసమూహములకు ఉపమానరీతిగా బోధించెను; ఉపమానము లేక వారికేమియు బోధింపలేదు.
పరలోకరాజ్యము, పొలములో దాచబడిన ధనమును పోలియున్నది. ఒక మనుష్యుడు దాని కనుగొని దాచి పెట్టి, అది దొరికిన సంతోషముతో వెళ్లి, తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. మరియు పరలోకరాజ్యము, మంచి ముత్యములను కొన వెదకుచున్న వర్తకుని పోలియున్నది. అతడు అమూల్యమైన యొక ముత్యమును కనుగొని, పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొనును. మరియు పరలోకరాజ్యము, సముద్రములో వేయబడి నానావిధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి, కూర్చుండి, మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయుదురు. ఆలాగే యుగసమాప్తియందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలోనుండి దుష్టులను వేరుపరచి, వీరిని అగ్ని గుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లుకొరుకుటయును ఉండును. వీటినన్నిటిని మీరు గ్రహించితిరా అని వారిని అడుగగా వారు గ్రహించితి మనిరి. ఆయన అందువలన పరలోకరాజ్యములో శిష్యుడుగాచేరిన ప్రతిశాస్త్రియు తన ధననిధిలోనుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలియున్నాడని వారితో చెప్పెను. వారికి వినుటకు శక్తి కలిగినకొలది యీలాటి అనేకమైన ఉపమానములను చెప్పి, ఆయన వారికి వాక్యము బోధించెను. ఉపమానము లేక వారికి బోధింపలేదు గాని ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటిని విశదపరచెను.
మరియు ఆయన వారితో ఇట్లనెను. ఎవడును దీపము ముట్టించి పాత్రతో కప్పివేయడు, మంచము క్రింద పెట్టడు గాని, లోపలికి వచ్చువారికి వెలుగు అగపడవలెనని దీపస్తంభముమీద దానిని పెట్టును. రహస్య మేదైనను తేటపరచబడకపోదు; బయలుపరచబడుటకే గాని యేదియు మరుగుచేయబడలేదు వినుటకు చెవులెవనికైన నుండినయెడల వాడు వినునుగాకనెను. మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలువబడును, మరి ఎక్కువగా మీ కియ్యబడును. గనుక మీరేలాగు వినుచున్నారో చూచుకొనుడని చెప్పెను. కలిగినవానికి ఇయ్యబడును, లేనివానికి కలిగినదియు వానియొద్దనుండి తీసివేయబడునని వారితో చెప్పెను.
అధ్యాయము 20
యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తరువాత, అక్కడనుండి బయలుదేరి స్వదేశమునకు రాగా, ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతిదినము వచ్చినప్పుడు ఆయన సమాజమందిరములో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి–ఈ సంగతులు ఇతనికి ఎక్కడనుండి వచ్చెను? ఇతనికియ్యబడిన ఈ జ్ఞానమెట్టిది? ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి? ఇదేమి? ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాడా? ఇతని సోదరీమణులందరు మనతో నున్నారు కారా? అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. అందుకు యేసు–ప్రవక్త తన దేశములోను తన బంధువులలోను తన యింటివారిలోను తప్ప మరి ఎక్కడను ఘనహీనుడు కాడని చెప్పెను. అందువలన కొద్దిమంది రోగులమీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. ఆయన చుట్టుపెట్లనున్న గ్రామములు తిరుగుచు బోధించుచుండెను.
యేసు తన యొద్దనున్న జనసమూహమును చూచి అద్దరికి వెళ్లవలెనని ఆజ్ఞాపించెను. అంతట ఒక శాస్త్రి వచ్చి బోధకుడా నీ వెక్కడికి వెళ్లినను నీ వెంటవచ్చెదనని ఆయనతో చెప్పెను. అందుకు యేసు నక్కలకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములును కలవు గాని మనుష్యకుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలములేదని అతనితో చెప్పెను. ఆయన మరియొకనితో–నా వెంటరమ్మని చెప్పెను. అతడు నేను వెళ్లి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేసెను అందుకాయనమృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము; నీవు వెళ్లి దేవుని రాజ్యమును ప్రకటించుమని వానితో చెప్పెను. మరియొకడు –ప్రభువా, నీ వెంట వచ్చెదను గాని నా యింట నున్న వారియొద్ద సెలవు తీసికొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా యేసు–నాగటిమీద చెయ్యిపెట్టి వెనుకతట్టు చూచు వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడుకాడని వానితో చెప్పెను.
ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన–అద్దరికి పోవుదమని వారితో చెప్పగా, ఆయన దోనె యెక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్లిరి. వారు జనులను పంపివేసి, ఆయనను ఉన్నపాటున చిన్నదోనెలో తీసికొనిపోయిరి; ఆయనవెంబడి మరికొన్ని దోనెలు వచ్చెను .అప్పుడు పెద్ద తుపాను రేగి ఆయన యున్న దోనెమీద అలలు కొట్టినందున దోనె నిండిపోయెను. ఆయన దోనె అమరమున తలగడమీద (తల వాల్చుకొని) నిద్రించుచుండెను. దోనె నీళ్లతో నిండినందునవారు అపాయకరమైన స్థితిలో ఉండిరి గనుక ఆయనయొద్దకు వచ్చి–ప్రభువా ప్రభువా, నశించిపోవుచున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి, గాలిని నీటిపొంగును గద్దింపగానే అవి అణగి నిమ్మళమాయెను. అప్పుడాయన–మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మికలేక యున్నారా? అని వారితో చెప్పెను. అయితే వారు భయపడి–ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే; ఈయన యెవరో అని యొకనితో నొకడు చెప్పుకొని ఆశ్చర్యపడిరి.
వారు గలిలయకు ఎదురుగాఉండు గెరసీనీయుల దేశమునకు వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరివాడొకడు ఆయనకు ఎదురుగావచ్చెను. వాడు దయ్యములుపెట్టినవాడై, బహుకాలమునుండి బట్టలు కట్టుకొనక, సమాధులలోనేగాని యింటిలో ఉండువాడు కాడు. పలుమారు వాని కాళ్లకును చేతులకును సంకెళ్లు వేసి బంధించినను, వాడు ఆ చేతిసంకెళ్లు తెంపి, కాలిసంకెళ్లను తుత్తునియలుగా చేసెను గనుక ఎవడును వానిని సాధు పరచలేకపోయెను. వాడు ఎల్లప్పుడును రాత్రింబగళ్లు సమాధులలోను కొండలలోను కేకలువేయుచు, తన్నుతాను రాళ్లతో గాయపరచుకొనుచు నుండెను. వాడు దూరమునుండి యేసును చూచి, పరుగెత్తికొనివచ్చి, ఆయనకు నమస్కారముచేసి –యేసూ, సర్వోన్నతుడైన దేవునికుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. ఎందుకనగా ఆయన–అపవిత్రాత్మా, యీ మనుష్యుని విడిచి పొమ్మని వానితో చెప్పెను.
మరియు ఆయన–నీ పేరేమని వానినడుగగా వాడు–నా పేరు సేన, యేలయనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశములోనుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను. అక్కడ కొండదగ్గర పందుల పెద్ద మంద మేయుచుండెను. గనుక – ఆ పందులలో ప్రవేశించునట్లు మమ్మును వాటియొద్దకు పంపుమని, ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనెను. యేసు వాటికి సెలవియ్యగా ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశించెను. ప్రవేశింపగా ఇంచుమించు రెండువేల సంఖ్యగల ఆ మంద ప్రపాతమునుండి సముద్రపుదారిని వడిగా పరుగెత్తికొనిపోయి, సముద్రములో పడి ఊపిరి తిరుగక చచ్చెను. మేపుచున్నవారు జరిగినదానిని చూచి, పారిపోయి ఆ పట్టణములోను గ్రామములలోను ఆ సంగతి తెలియజేసిరి. జనులు జరిగినదానిని చూడవెళ్లి, యేసునొద్దకు వచ్చి, దయ్యములు వదలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకొని, స్వస్థచిత్తుడై యేసు పాదములయొద్ద కూర్చుండుట చూచి భయపడిరి. అది చూచినవారు దయ్యములు పెట్టినవాడేలాగు స్వస్థతపొందెనో జనులకు తెలియజేయగా -గెరసీనీయుల ప్రాంతములలోనుండు జనులందరు బహు భయాక్రాంతులైరి గనుక తమ్మును విడిచిపొమ్మని ఆయనను వేడుకొనిరి. ఆయన దోనె యెక్కి తిరిగి వెళ్లుచుండగా ఆయన దోనెయెక్కినప్పుడు, దయ్యములు పెట్టినవాడు ఆయనయొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను గాని ఆయన వానికి సెలవియ్యక–నీవు నీ యింటివారియొద్దకు వెళ్లి, ప్రభువు నీయందు కనికరపడి, నీకు చేసిన కార్యములన్నిటిని వారికి తెలియజెప్పుమనెను. వాడు వెళ్లి, యేసు తనకు చేసిన వన్నియు దెకపొలిలో ప్రకటింప నారంభింపగా అందరు ఆశ్చర్యపడిరి.
అధ్యాయము 21
ఆయన దోనె యెక్కి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశింపగా. జనసమూహము ఆయనకొరకు ఎదురుచూచుచుండెను గనుక యేసు తిరిగివచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. అంతట ఇదిగో సమాజమందిరపు అధికారియైన యాయీరు అను ఒకడు వచ్చి యేసు పాదములమీదపడి. యించుమించు పండ్రెండేండ్ల యీడుగల తనయొక్కతే కుమార్తె ఉన్నది. –నా చిన్నకుమార్తె చావనై యున్నది; అది బాగుపడి బ్రదుకునట్లు నీవు వచ్చి దానిమీద నీచేతులుంచవలెనని ఆయనను మిగుల బతిమాలుకొనగా ఆయన అతనితోకూడ వెళ్లెను; బహుజనసమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి
అప్పుడు పండ్రెండేండ్లనుండి రక్తస్రావరోగముగల యొక స్త్రీ యెవనిచేతను స్వస్థతనొందనిదై ఆయన వెనుకకు వచ్చి, తనకు కలిగినదంతయు వ్యయము చేసికొని, యెంతమాత్రమును ప్రయోజనములేక మరింత సంకట పడెను. ఆమె యేసునుగూర్చి విని–నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదుననుకొని, జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణయైనదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలోనుండి ప్రభావము బయలువెళ్లెనని తనలోతాను గ్రహించి, జనసమూహమువైపు తిరిగి–నా వస్త్రములు ముట్టిన దెవరని అడుగగా ఆయన శిష్యులు –జనసమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే; నన్నుముట్టినదెవడని అడుగుచున్నావా? అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టు చూచెను. యేసు–ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలోనుండి వెడలి పోయినదని, నాకు తెలిసిన దనెను. తాను మరుగై యుండలేదని, ఆ . స్త్రీ చూచి, వణకుచు వచ్చి ఆయన యెదుట సాగిలపడి, తాను ఎందునిమిత్తము ఆయనను ముట్టెనో, వెంటనే తాను ఏలాగు స్వస్థపడెనో ఆ సంగతి ప్రజలందరియెదుట తెలియజెప్పెను. అందుకాయన – కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్ము; నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పెను.
ఆయన ఇంకను మాటలాడుచుండగా, సమాజమందిరపు అధికారి యింటనుండి కొందరు వచ్చి–నీ కుమార్తె చనిపోయినది; నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదువనిరి. యేసు ఆ మాటవిని సమాజమందిరపు అధికారితో –భయపడవద్దు, నమ్మికమాత్రముంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి యింటికి వచ్చినప్పుడు పేతురు యోహాను యాకోబు అను వారిని ఆ చిన్నదాని తలిదండ్రులను తప్ప మరెవరిని ఆయన లోపలికి రానియ్యలేదు. అందరును ఆమె నిమిత్తమై యేడ్చుచు రొమ్ము కొట్టుకొనుచుండగా, ఆయన వారితో –ఏడ్వవద్దు, ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చెప్పెను. ఆమె చనిపోయెనని వారెరిగి ఆయనను అపహసించిరి. అయితే ఆయన ఆమె చెయ్యిపట్టుకొని –చిన్నదానా, లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగివచ్చెను గనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడాయన –ఆమెకు భోజనము పెట్టుడని ఆజ్ఞాపించెను. ఆమె తలిదండ్రులు విస్మయము నొందిరి. అంతట ఆయన– జరిగినది ఎవనితోను చెప్పవద్దని వారికాజ్ఞాపించెను.
యేసు అక్కడనుండి వెళ్లుచుండగా ఇద్దరు గ్రుడ్డివారు ఆయన వెంట వచ్చి–దావీదు కుమారుడా, మమ్మును కనికరించుమని కేకలువేసిరి. ఆయన యింట ప్రవేశించిన తరువాత ఆ గ్రుడ్డివారు ఆయనయొద్దకు వచ్చిరి. యేసు–నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? అని వారి నడుగగా వారు–నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడాయన వారి కన్నులు ముట్టి–మీ నమ్మికచొప్పున మీకు కలుగుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరువబడెను. అప్పుడు యేసు–ఇది ఎవరికిని తెలియకుండ చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. అయినను వారు వెళ్లి ఆ దేశ మంతట ఆయన కీర్తి ప్రచురముచేసిరి.
అధ్యాయము 22
యేసు వారి సమాజమందిరములలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు, ప్రతివిధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు, సమస్త పట్టణములయందును గ్రామములయందును సంచారము చేసెను. ఆయన సమూహములను చూచి, వారు కాపరిలేని గొఱ్ఱెల వలె విసికి చెదరియున్నందున వారిమీద కనికరపడి – కోత విస్తారమేగాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను. ఆయన తన పండ్రెండుమంది శిష్యులను పిలిచి, అపవిత్రాత్మలను వెళ్లగొట్టుటకును, ప్రతివిధమైన రోగమును ప్రతివిధమైన వ్యాధిని స్వస్థపరచుటకును, వారికి అధికారమిచ్చెను. దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకు వారి నంపెను. '
యేసు ఆ పండ్రెండుమందిని పంపుచు, వారినిచూచి వారికాజ్ఞాపించినదేమనగా మీరు అన్యజనుల దారిలోనికి వెళ్లకుడి, సమరయుల యే పట్టణములోనైనను ప్రవేశింపకుడి గాని ఇశ్రాయేలు వంశములోని నశించిన గొఱ్ఱెల యొద్దకే వెళ్లుడి. వెళ్లుచు పరలోకరాజ్యము సమీపించియున్నదని ప్రకటించుడి. రోగులను స్వస్థపరచుడి, చనిపోయినవారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్లగొట్టుడి. ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి. మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలెనైనను రెండు అంగీలనైనను చెప్పులనైనను చేతికఱ్ఱనైనను సిద్ధపరచుకొనకుడి; పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా? మరియు మీరు ఏపట్టణములోనైనను గ్రామములోనైనను ప్రవేశించునప్పుడు, అందులో ఎవడు యోగ్యుడో విచారణచేసి, అక్కడనుండి వెళ్లువరకు అతని యింటనే బసచేయుడి. ఆ యింటిలో ప్రవేశించుచు, ఇంటివారికి శుభమని చెప్పుడి. ఆ యిల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దానిమీదికి వచ్చును; అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. ఎవడైనను మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుండినయెడల మీరు ఆ యింటినైనను ఆ పట్టణమైనను విడిచిపోవునప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి. విమర్శదినమందు ఆ పట్టణపు గతికంటె సొదొమ గొమొఱ్ఱా ప్రదేశముల గతి ఓర్వతగినదై యుండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
ఇదిగో తోడేళ్లమధ్యకు గొఱ్ఱెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాములవలె వివేకులును పావురములవలె నిష్కపటులునై యుండుడి. మనుష్యులనుగూర్చి జాగ్రత్తపడుడి; వారు మిమ్మును మహాసభలకు అప్పగించి, తమ సమాజమందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు, వీరికిని అన్యజనులకును సాక్ష్యార్థమై నానిమిత్తము మీరు అధిపతులయొద్దకును రాజులయొద్దకును తేబడుదురు. వారు మిమ్మును అప్పగించునప్పుడు, – ఏలాగు మాటాడుదుము? ఏమి చెప్పుదుము? అని చింతింపకుడి; మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే గాని మాటలాడువారు మీరు కారు. మీరేమి చెప్పవలసినదియు పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పుననెను. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని, మరణమునకు అప్పగించెదరు; పిల్లలు తలిదండ్రులమీద లేచి వారిని చంపించెదరు. మీరు నా నామము నిమిత్తము అందరిచేత ద్వేషింపబడుదురు; అంతమువరకును సహించినవాడు రక్షింపబడును. వారు ఈ పట్టణములో మిమ్మును హింసించునప్పుడు మరియొక పట్టణమునకు పారిపోవుడి; మనుష్యకుమారుడు వచ్చువరకు మీరు ఇశ్రాయేలు పట్టణములలో సంచారము చేసియుండరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. శిష్యుడు బోధకునికంటె అధికుడు కాడు; దాసుడు యజమానునికంటె అధికుడు కాడు. శిష్యుడు తన బోధకునివలెను దాసుడు తన యజమానునివలెను ఉండిన చాలును. ఇంటి యజమానునికి బయెల్జెబూలని వారు పేరుపెట్టియుండినయెడల ఆయన యింటివారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు గదా. కాబట్టి మీరు వారికి భయపడకుడి,
అంతలో ఒకనినొకడు త్రొక్కుకొనునట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగెను–పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండినిగూర్చి జాగ్రత్తపడుడి. మరుగైనదేదియు బయలుపరచబడకపోదు; రహస్యమైనదేదియు తెలియబడకపోదు. అందుచేత మీరు చీకటిలో మాటలాడుకొనునవి వెలుగులో వినబడును, మీరు గదులయందు చెవిలో చెప్పుకొనునది మిద్దెలమీద చాటింపబడును. మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. చీకటిలో నేను మీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పుడి; చెవిలో మీకు చెప్పబడినది మేడలమీద ప్రకటించుడి.
నా స్నేహితులైన మీతో నేను చెప్పునదేమనగా– దేహమును చంపిన తరువాత మరేమియు చేయనేరని వారికి భయపడకుడి. ఎవనికి మీరు భయపడవలెనో మీకు తెలియజేయుదును; చంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తిగలవానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని, ఆత్మను దేహమును కూడ నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా; అయినను మీ తండ్రి సెలవులేక వాటిలో ఒకటైనను నేలను పడదు. మీ తలవెండ్రుకలన్నియు లెక్కింపబడి యున్నవి గనుక మీరు భయపడకుడి; మీరనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు. మనుష్యులయెదుట నన్ను ఒప్పుకొనువాడెవడో పరలోకమందున్న నా తండ్రి యెదుట నేనును వానిని ఒప్పుకొందును. మనుష్యుల యెదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున్న నా తండ్రియెదుట నేనును ఎరుగనందును
నేను భూమిమీదికి సమాధానమును పంపవచ్చితినని తలంచకుడి; ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనుష్యునికిని వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చితిని. ఒక మనుష్యుని యింటివారే అతనికి శత్రువులగుదురు. తండ్రినైనను తల్లినైనను నా కంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు; కుమారునినైనను కుమార్తెనైనను నాకంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు; తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణము దక్కించుకొనువాడు దాని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకొనువాడు దాని దక్కించుకొనును. మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును; నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవాని చేర్చుకొనును. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనువాడు ప్రవక్తఫలము పొందును; నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకొనువాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని యెవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. యేసు తన పండ్రెండుమంది శిష్యులకు ఆజ్ఞాపించుట. చాలించిన తరువాత వారి పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడనుండి వెళ్లిపోయెను. వారు బయలుదేరి అంతటను సువార్త ప్రకటించుచు, (రోగులను) స్వస్థపరచుచు గ్రామములలో సంచారము చేసిరి. మారుమనస్సు పొందవలెన ప్రకటించుచు. అనేక దయ్యములు వెళ్లగొట్టుచు నూనెరాచి అనేకులగు రోగులను స్వస్థపరచుచునుండిరి. అంతట అపొస్తలులు యేసునొద్దకు కూడివచ్చి తాము చేసినవన్నియు బోధించినవన్నియు ఆయనకు తెలియజేసిరి.
అధ్యాయము 23
అటుతరువాత యేసు తిబెరియ సముద్రము, అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్లెను. రోగుల యెడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. వారు వెళ్లుచుండగా జనులు చూచి, అనేకులాయనను గుర్తెరిగి, సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకనుపరుగెత్తి వారికంటె ముందుగా వచ్చిరి. గనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి, వారు కాపరిలేని గొఱ్ఱెలవలె ఉన్నందున వారిమీద కనికరపడి, వారికి అనేక సంగతులను బోధింపసాగెను. దేవుని రాజ్యమునుగూర్చి వారితో మాటలాడుచు, స్వస్థత కావలసినవారిని స్వస్థపరచెను. సాయంకాలమైనప్పుడు శిష్యులాయనయొద్దకు వచ్చి ఇది అరణ్యప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను, ఈ జనులు గ్రామములలోనికి వెళ్లి భోజనపదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి. యేసు–వారు వెళ్లనక్కరలేదు, మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా . యేసు కన్నులెత్తి బహుజనులు తనయొద్ద చూచి–వీరు భుజించుటకు ఎక్కడనుండి రొట్టెలుకొని తెప్పింతుమని ఫిలిప్పు నడిగెను గాని యేమి చేయనై యుండెనో తానే యెరిగియుండి అతనిని పరీక్షించుటకు ఆలాగడిగెను. అందుకు ఫిలిప్పు–వారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను రెండువందల దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను.–మేము వెళ్లి యీన్నూరు దేనారముల రొట్టెలుకొని వారికి పెట్టుదుమా అని ఆయన నడిగిరి.
అందుకాయన–మీయొద్ద ఎన్ని రొట్టెలున్నవి? పోయి చూడుడని వారితో చెప్పెను. ఆయన శిష్యులలో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రెయ. –ఇక్కడ ఉన్న యొక చిన్నవానియొద్ద అయిదు యవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నవి గాని, యింత మందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా , అందుకాయన వాటిని నాయొద్దకు తెండని చెప్పి. అప్పుడాయన – పచ్చికమీద అందరు పంక్తులు పంక్తులుగా కూర్చుండవలెనని వారికాజ్ఞాపింపగా. అంతట ఆయన ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను ఎత్తికొని, ఆకాశమువైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి, విరిచి, జనసమూహమునకు వడ్డించుటకై శిష్యులకిచ్చెను. వారు తృప్తిగా తినిన తరువాత ఏమియు నష్టపడకుండ మిగిలిన ముక్కలు పోగుచేయుడని తన శిష్యులతో చెప్పెను. కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన అయిదు యవలరొట్టెల ముక్కలు పోగుచేసి పండ్రెండు గంపలు నింపిరి. స్త్రీలును పిల్లలును గాక తినినవారు ఇంచుమించు అయిదు వేలమంది పురుషులు. ఆ మనుష్యులు యేసు చేసిన సూచక క్రియను చూచి–నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి.
రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోవుచున్నారని యేసు ఎరిగి, ఆ జనసమూహములను తాను పంపివేయు నంతలో తన శిష్యులు దోనె యెక్కి తనకంటె ముందుగా అద్దరికి వెళ్లవలెనని ఆయన వారిని బలవంతము చేసెను. ఆయన ఆ జనసమూహములను పంపివేసి, ప్రార్థనచేయుటకు ఏకాంతముగా కొండయెక్కి పోయి, సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికాదోనె దరికి దూరముగనుండగా గాలి యెదురైనందున అలలవలన కొట్టబడుచుండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున, దోనె నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి, రాత్రి ఇంచు మించు నాలుగవ జామున సముద్రముమీద నడుచుచు వారియొద్దకు వచ్చి, వారిని దాటిపోవలెనని యుండెను. ఆయన సముద్రముమీద నడుచుట వారు చూచి, భూత మని తలంచి కేకలువేసిరి. అందరు ఆయనను చూచి తొందరపడగా, వెంటనే ఆయన వారిని పలుకరించి– ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని చెప్పెను.
పేతురు–ప్రభువా, నీవే అయితే నీళ్లమీద నడిచి నీయొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోనెదిగి యేసునొద్దకు వెళ్లుటకు నీళ్లమీద నడచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి – ప్రభువా, నన్ను రక్షించుమని కేకలువేసెను. వెంటనే యేసు చెయ్యిచాపి అతని పట్టుకొని అల్పవిశ్వాసీ, యెందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. వారు దోనె యెక్కినప్పుడు గాలి అణిగెను. అంతట దోనెలో నున్నవారు వచ్చి–నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మ్రొక్కిరి.అందుకు వారు తమలోతాము మిక్కిలి విభ్రాంతి నొందిరి; అయినను వారి హృదయము కఠినమాయెను గనుక వారు రొట్టెలనుగూర్చిన సంగతి గ్రహింపలేదు.వారు అవతలకు వెళ్లి గెన్నేసరెతు దగ్గర ఒడ్డుకు వచ్చి దరి పట్టిరి. వారు దోనె దిగగానే, జనులు ఆయనను గురుతుపట్టి ఆ ప్రదేశమందంతట పరుగెత్తికొనిపోయి, ఆయన యున్నాడని వినినచోటునకు రోగులను మంచములమీద మోసికొని వచ్చుటకు మొదలుపెట్టిరి. గ్రామములలోను పట్టణములలోను పల్లెటూళ్లలోను ఆయన యెక్కడెక్కడ ప్రవేశించెనో అక్కడి జనులు రోగులను సంత వీదులలో ఉంచి, వారిని ఆయన వస్త్రపుచెంగుమాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనుచుండిరి. ఆయనను ముట్టిన వారందరు స్వస్థతనొందిరి.
అధ్యాయము 24
మరునాడు సముద్రపుటద్దరిని నిలిచియున్న జనసమూహము వచ్చి చూడగా, ఒక చిన్న దోనె తప్ప అక్కడ మరియొకటి లేదనియు, యేసు తన శిష్యులతోకూడ దోనె ఎక్కలేదు గాని ఆయన శిష్యులు మాత్రమే వెళ్లిరనియు తెలిసికొనిరి. అయితే ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గరనున్న తిబెరియనుండి వేరే చిన్న దోనెలు వచ్చెను. కాబట్టి యేసును ఆయన శిష్యులును అక్కడ లేకపోవుట జనసమూహము చూచినప్పుడు వారా చిన్న దోనెలెక్కి యేసును వెదకుచు కపెర్నహూమునకు వచ్చిరి. సముద్రపుటద్దరిని ఆయనను కనుగొని–బోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగగా యేసు –మీరు సూచనలను చూచుటవలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుటవలననే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్షయమైన ఆహారముకొరకు కష్టపడకుడి గాని నిత్యజీవము కలుగజేయు అక్షయమైన ఆహారముకొరకే కష్టపడుడి; మనుష్యకుమారుడు దానిని మీకిచ్చును, ఇందుకై తండ్రియైన దేవుడు ఆయనకు ముద్రవేసియున్నాడని చెప్పెను.
వారు–మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలెనని ఆయనను అడుగగా యేసు–ఆయన పంపిన వానియందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియయని వారితో చెప్పెను. వారు–అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ చేయుచున్నావు? ఏమి జరిగించుచున్నావు? భుజించుటకు పరలోకమునుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. కాబట్టి యేసు–పరలోకమునుండి వచ్చు ఆహారము మోషే మీకియ్యలేదు, నా తండ్రియే పరలోకమునుండి వచ్చు నిజమైన ఆహారము మీకనుగ్రహించుచున్నాడు. పరలోకమునుండి దిగి వచ్చి, లోకమునకు జీవము నిచ్చునది దేవుడనుగ్రహించు ఆహారమైయున్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను. కావునవారు–ప్రభువా, యీ ఆహారము ఎల్లప్పుడును మాకు అనుగ్రహించుమనిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను–జీవాహారము నేనే; నాయొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నాయందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పిగొనడు. మీరు నన్ను చూచి యుండియు విశ్వసింపక యున్నారని మీతో చెప్పితిని.
తండ్రి నాకు అనుగ్రహించువారందరును నాయొద్దకు వత్తురు; నాయొద్దకు వచ్చువానిని నేనెంతమాత్రమును బయటికి త్రోసివేయను. నా యిష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు; నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకమునుండి దిగి వచ్చితిని. ఆయన నాకు అనుగ్రహించిన దాని యంతటిలో నేనేమియు పోగొట్టుకొనక, అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపినవాని చిత్తమైయున్నది. కుమారుని చూచి ఆయనయందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవము పొందుటయే నా తండ్రి చిత్తము; అంత్యదినమున నేను వానిని లేపుదును.
కాబట్టి నేను పరలోకమునుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయననుగూర్చి సణుగుకొనుచు–ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా? ఈయన తలిదండ్రులను మన మెరుగుదుము గదా? –నేను పరలోకమునుండి దిగి వచ్చియున్నానని ఈయన ఏలాగు చెప్పుచున్నాడనిరి. అందుకు యేసు–మీలో మీరు సణుగుకొనకుడి; నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని యెవడును నా యొద్దకు రాలేడు; అంత్యదినమున నేను వానిని లేపుదును. –వారందరును దేవునిచేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడియున్నది గనుక తండ్రివలన విని నేర్చుకొనిన ప్రతివాడును నాయొద్దకు వచ్చును. దేవుని యొద్దనుండి వచ్చినవాడు తప్ప మరి యెవడును తండ్రిని చూచియుండలేదు; ఈయనే తండ్రిని చూచియున్నవాడు. విశ్వసించువాడే నిత్యజీవముగలవాడు. జీవాహారము నేనే. మీపితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకమునుండి దిగివచ్చిన ఆహారమిదే. పరలోకమునుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడును జీవించును; మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవముకొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.
యూదులు–ఈయన తన శరీరమును ఏలాగు తిన నియ్యగలడని యొకనితో ఒకడు వాదించిరి. కావున యేసు ఇట్లనెను–మీరు మనుష్యకుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని, మీలో మీరు జీవముగలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవముగలవాడు; అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై యున్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచియుందుము. జీవముగల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకమునుండి దిగివచ్చిన ఆహారము; పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు; ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడును జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాననెను ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజమందిరములో ఈ మాటలు చెప్పెను.
ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని–యిది కఠినమైన మాట, యిది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. యేసు తన శిష్యులు దీనినిగూర్చి సణుగుకొనుచున్నారని తనకుతానే యెరిగి వారితో ఇట్లనెను– దీనివలన మీరు అభ్యంతరపడుచున్నారా? ఆలాగైతే మనుష్యకుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచినయెడల ఏమందురు? ఆత్మయే జీవింపచేయుచున్నది; శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునైయున్నవి గాని మీలో విశ్వసించనివారు కొందరున్నారని వారితో చెప్పెను.విశ్వసించనివారెవరో, తన్నుప్పగింపబోవువాడెవడో, మొదటినుండి యేసునకు తెలియును. మరియు ఆయన –తండ్రిచేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నాయొద్దకు రాలేడని యీ హేతువునుబట్టి మీతో చెప్పితిననెను. అప్పటినుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుకతీసి, మరి ఎన్నడును ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు–మీరు కూడ వెళ్లిపోవలెనని యున్నారా? అని పండ్రెండుమందిని అడుగగా సీమోను పేతురు– ప్రభువా, యెవనియొద్దకు వెళ్లుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు; నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి యెరిగియున్నామని ఆయనతో చెప్పెను. అందుకు యేసు–నేను మిమ్మును పండ్రెండుగురిని ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పెను. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా పండ్రెండు మందిలో ఒకడైయుండి ఆయన నప్పగింపబోవు చుండెను గనుక వానిగూర్చియే ఆయన ఈ మాట చెప్పెను.
అధ్యాయము 25
అటుతరువాత యూదులు ఆయనను చంప వెదకినందున యేసు యూదయలో సంచరించనొల్లక గలిలయలో సంచరించుచుండెను. యూదుల పర్ణశాలల పండుగ సమీపించెను గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి–నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులును చూచునట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్లుము. బహిరంగమున అంగీకరింపబడగోరువాడెవడును తన పని రహస్యమున జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్నయెడల నిన్ను నీవే లోకమునకు కనబరచుకొనుమని చెప్పిరి. ఆయన సహోదరులైనను ఆయనయందు విశ్వాసముంచలేదు. యేసు–నా సమయమింకను రాలేదు; మీ సమయమెల్లప్పుడును సిద్ధముగానే యున్నది. లోకము మిమ్మును ద్వేషింపనేరదుగాని, దాని క్రియలు చెడ్డవని నేను దానినిగూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను. గనుక అది నన్ను ద్వేషించుచున్నది. మీరు పండుగకు వెళ్లుడి; నా సమయమింకను పరిపూర్ణము కాలేదు గనుక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్లనని వారితో చెప్పెను. ఆయన వారితో ఈలాగున చెప్పి గలిలయలో నిలిచిపోయెను.
అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్లిపోయిన తరువాత ఆయన కూడ బహిరంగముగా వెళ్లక రహస్యముగా వెళ్లెను. పండుగలో యూదులు–ఆయన ఎక్కడనని ఆయనను వెదకుచుండిరి. మరియు జనసమూహములలో ఆయననుగూర్చి గొప్ప సణుగు పుట్టెను; కొందరాయన మంచివాడనిరి; మరికొందరు–కాడు, ఆయన జనులను మోసపుచ్చువాడనిరి; అయితే యూదులకు భయపడి ఆయననుగూర్చి యెవడును బహిరంగముగా మాటలాడలేదు.సగము పండుగైనప్పుడు యేసు దేవాలయములోనికి వెళ్లి బోధించుచుండెను. యూదులు అందుకు ఆశ్చర్యపడి–చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యమెట్లు వచ్చెనని చెప్పుకొనిరి. అందుకు యేసు–నేను చేయు బోధ నాది కాదు; నన్ను పంపినవానిదే. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనినయెడల, ఆ బోధ దేవునివలన కలిగినదో, లేక నా యంతట నేనే బోధించుచున్నానో, వాడు తెలిసికొనును. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదకును గాని తన్ను పంపినవాని మహిమను వెదకువాడు సత్యవంతుడు, ఆయనయందు ఏ దుర్నీతియులేదు. మోషే మీకు ధర్మశాస్త్రము ఇయ్యలేదా? అయినను మీలో ఎవడును ఆ ధర్మశాస్త్రమును గైకొనడు; మీరెందుకు నన్ను చంపజూచుచున్నారని వారితో చెప్పెను. అందుకు జనసమూహము–నీవు దయ్యము పట్టినవాడవు, ఎవడు నిన్ను చంపజూచుచున్నాడని అడుగగా యేసు వారిని చూచి–నేను ఒక కార్యము చేసితిని; అందుకు మీరందరు ఆశ్చర్యపడుచున్నారు. మోషే మీకు సున్నతి సంస్కారమును నియమించెను, ఈ సంస్కారము మోషేవలన కలిగినది కాదు, పితరులవలననే కలిగినది. అయినను విశ్రాంతిదినమున మీరు మనుష్యునికి సున్నతి చేయుచున్నారు. మోషే ధర్మశాస్త్రము మీరకుండునట్లు ఒక మనుష్యుడు విశ్రాంతిదినమున సున్నతిపొందును గదా. ఇట్లుండగా నేను విశ్రాంతిదినమున ఒక మనుష్యుని పూర్ణస్వస్థతగల వానిగా చేసినందుకు మీరు నామీద ఆగ్రహపడుచున్నారేమి? వెలిచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడనెను.
యెరూషలేమువారిలో కొందరు–వారు చంప వెదకు వాడు ఈయనే కాడా? ఇదిగో ఈయన బహిరంగముగా మాటలాడుచున్నను ఈయనను ఏమనరు; ఈయన క్రీస్తని అధికారులు నిజముగా తెలిసికొనియుందురా? అయినను ఈయన ఎక్కడి వాడో యెరుగుదుము; క్రీస్తు వచ్చునప్పుడు ఆయన యెక్కడివాడో యెవడును ఎరుగడని చెప్పుకొనిరి. కాగా యేసు దేవాలయములో బోధించుచు–మీరు నన్నెరుగుదురు; నేనెక్కడివాడనో యెరుగుదురు; నా యంతట నేనే రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయనను మీరెరుగరు. నేను ఆయన యొద్దనుండి వచ్చితిని; ఆయన నన్ను పంపెను గనుక నేను ఆయనను ఎరుగుదునని బిగ్గరగా చెప్పెను. అందుకు వారాయనను పట్టుకొన యత్నముచేసిరి గాని ఆయన గడియ యింకను రాలేదు గనుక ఎవడును ఆయనను పట్టుకొనలేదు. మరియు జనసమూహములో అనేకులు ఆయనయందు విశ్వాసముంచి–క్రీస్తు వచ్చునప్పుడు ఈయన చేసినవాటికంటె ఎక్కువైన సూచక క్రియలు చేయునా అని చెప్పుకొనిరి. జనసమూహము ఆయననుగూర్చి యీలాగు సణుగుకొనుట పరిసయ్యులు వినినప్పుడు, ప్రధానయాజకులును పరిసయ్యులును ఆయనను పట్టుకొనుటకు బంట్రౌతులను పంపిరి.
యేసు–ఇంక కొంతకాలము నేను మీతోకూడ నుందును; తరువాత నన్ను పంపినవానియొద్దకు వెళ్లుదును; మీరు నన్ను వెదకుదురు గాని నన్ను కనుగొనరు, నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరనెను. అందుకు యూదులు– మనము ఈయనను కనుగొనకుండునట్లు ఈయన ఎక్కడికి వెళ్లబోవుచున్నాడు? గ్రీసుదేశస్థులలో చెదరిపోయిన వారియొద్దకు వెళ్లి గ్రీసుదేశస్థులకు బోధించునా? –నన్ను వెదకుదురు గాని కనుగొనరు, నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరని ఆయన చెప్పిన యీ మాట ఏమిటో అని తమలోతాము చెప్పుకొనుచుండిరి. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి–ఎవడైనను దప్పిగొనినయెడల నాయొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులోనుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తనయందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మనుగూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడ లేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడియుండలేదు.
జనసమూహములో కొందరు ఈ మాటలు విని–నిజముగా ఈయన ఆ ప్రవక్తయే అనిరి; మరికొందరు–ఈయన క్రీస్తే అనిరి; మరికొందరు–ఏమి? క్రీస్తు గలిలయలోనుండి వచ్చునా? క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బేత్లెహేమను గ్రామములోనుండి వచ్చునని లేఖనము చెప్పుటలేదా అనిరి. కాబట్టి ఆయననుగూర్చి జనసమూహములో భేదము పుట్టెను. వారిలో కొందరు ఆయనను పట్టుకొన దలచిరి గాని యెవడును ఆయనను పట్టుకొనలేదు. ఆ బంట్రౌతులు ధానయాజకుల యొద్దకును పరిసయ్యులయొద్దకును వచ్చినప్పుడు వారు–ఎందుకు మీరాయనను తీసికొని రాలేదని అడుగగా ఆ బంట్రౌతులు–ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవడును ఎన్నడును మాటలాడలేదనిరి. అందుకు పరిసయ్యులు–మీరు కూడ మోసపోతిరా? అధికారులలో గాని పరిసయ్యులలో గాని యెవడైనను ఆయనయందు విశ్వాసముంచెనా? అయితే ధర్మశాస్త్ర మెరుగని యీ జనసమూహము శాపగ్రస్తమైనదని వారితో అనిరి. అంతకుమునుపు ఆయనయొద్దకు వచ్చిన నీకొదేము వారిలో ఒకడు. అతడు–ఒక మనుష్యుని మాట వినకమునుపును, వాడు చేసినది తెలిసికొనకమునుపును, మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చునా అని అడుగగా వారు–నీవును గలిలయుడవా? విచారించి చూడుము, గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడనిరి.
అధ్యాయము 26
యేసు ఒలీవలకొండకు వెళ్లెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయములోనికి రాగా ప్రజలందరు ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులును పరిసయ్యులును, వ్యభిచారమందు పట్టబడిన యొక స్త్రీని తోడుకొనివచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి –బోధకుడా, యీ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను; అట్టివారిని రాళ్లు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మన కాజ్ఞాపించెను గదా; అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన నడిగిరి. ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఈలాగున అడిగిరి. అయితే యేసు వంగి, నేలమీద వ్రేలితో ఏమో వ్రాయుచుండెను. వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తలయెత్తి చూచి–మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమెమీద రాయి వేయ వచ్చునని వారితో చెప్పి మరల వంగి నేలమీద వ్రాయుచుండెను.మరల వంగి నేలమీద వ్రాయుచుండెను. వారామాట విని, పెద్దవారు మొదలుకొని చిన్నవారివరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్లిరి; యేసు ఒక్కడే మిగిలెను; ఆ స్త్రీమధ్యను నిలువబడియుండెను. యేసు తలయెత్తి చూచి–అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరును నీకు శిక్ష విధింపలేదా? అని అడిగినప్పుడు ఆమె –లేదు ప్రభువా అనెను. అందుకు యేసు–నేనును నీకు శిక్ష విధింపను; నీవు వెళ్లి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను.
మరల యేసు–నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండునని వారితో చెప్పెను. కాబట్టి పరిసయ్యులు–నిన్నుగూర్చి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావు; నీ సాక్ష్యము సత్యము కాదని ఆయనతో అనగా యేసు– నేను ఎక్కడనుండి వచ్చితినో యెక్కడికి వెళ్లుదునో నేనెరుగుదును గనుక నన్నుగూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనినను నా సాక్ష్యము సత్యమే; నేను ఎక్కడనుండి వచ్చుచున్నానో యెక్కడికి వెళ్లుచున్నానో మీరు ఎరుగరు. మీరు శరీరమునుబట్టి తీర్పు తీర్చుచున్నారు; నేనెవరికిని తీర్పు తీర్చను. నేను ఒక్కడనైయుండక, నేనును నన్ను పంపిన తండ్రియు కూడ నున్నాము గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే. మరియు ఇద్దరు మనుష్యుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడియున్నది గదా. నన్నుగూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనువాడను; నన్ను పంపిన తండ్రియు నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడని చెప్పెను. వారు–నీ తండ్రి యెక్కడ ఉన్నాడని ఆయనను అడుగగా యేసు–మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు; నన్ను ఎరిగి యుంటిరా నా తండ్రిని కూడ ఎరిగి యుందురని వారితో చెప్పెను. ఆయన దేవాలయములో బోధించుచుండగా, కానుక పెట్టె యున్నచోట ఈ మాటలు చెప్పెను. ఆయన గడియ యింకను రాలేదు గనుక ఎవడును ఆయనను పట్టుకొనలేదు.
మరియొకప్పుడు ఆయన–నేను వెళ్లిపోవుచున్నాను; మీరు నన్ను వెదకుదురు గాని మీ పాపములోనేయుండి చనిపోవుదురు; నేను వెళ్లుచోటికి మీరు రాలేరని వారితో చెప్పెను. అందుకు యూదులు–నేను వెళ్లుచోటికి మీరు రాలేరని యీయన చెప్పుచున్నాడే; తన్ను తానే చంపుకొనునా అని చెప్పుకొనుచుండిరి. అప్పుడాయన–మీరు క్రిందివారు, నేను పైనుండువాడను; మీరు ఈ లోకసంబంధులు, నేను ఈ లోకసంబంధుడను కాను. కాగా మీ పాపములలోనేయుండి మీరు చనిపోవుదురని మీతో చెప్పితిని. నేను ఆయననని మీరు విశ్వసించనియెడల మీరు మీ పాపములోనేయుండి చనిపోవుదురని వారితో చెప్పెను. కాబట్టి వారు–నీ వెవరవని ఆయన నడుగగా యేసు వారితో–మొదటనుండి నేను మీతో ఎవడనని చెప్పుచుంటినో వాడినే. మిమ్మునుగూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాల సంగతులు నాకు కలవు గాని నన్ను పంపినవాడు సత్యవంతుడు; నేను ఆయనయొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పెను. తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పెనని వారు గ్రహింపకపోయిరి. కావున యేసు–మీరు మనుష్యకుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు, నా అంతట నేనే యేమియు చేయక, తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాటలాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. నన్ను పంపినవాడు నాకు తోడైయున్నాడు; ఆయన కిష్టమైన కార్యము నేనెల్లప్పుడును చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను.
ఆయన యీ సంగతులు మాటలాడుచుండగా అనేకులాయనయందు విశ్వాసముంచిరి. కాబట్టి యేసు, తనను నమ్మిన యూదులతో–మీరు నా వాక్యమందు నిలిచినవారైతే నిజముగా నాకు శిష్యులై యుండి సత్యమును గ్రహించెదరు; అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా వారు–మేము అబ్రాహాము సంతానము, మేము ఎన్నడును ఎవనికిని దాసులమై యుండలేదే; మీరు స్వతంత్రులుగా చేయబడుదురని యేల చెప్పుచున్నావని ఆయనతో అనిరి. అందుకు యేసు–పాపముచేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడెల్లప్పుడును ఇంటిలో నివాసముచేయడు; కుమారు డెల్లప్పుడును నివాసముచేయును. కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసినయెడల మీరు నిజముగా స్వతంత్రులైయుందురు. మీరు అబ్రాహాము సంతానమని నాకు తెలియును; అయినను మీలో నా వాక్యమునకు చోటులేదు గనుక నన్ను చంప వెదకుచున్నారు. నేను నా తండ్రియొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను; ఆ ప్రకారమే మీరు మీ తండ్రియొద్ద వినినవాటినే జరిగించుచున్నారని వారితో చెప్పెను. అందుకు వారు ఆయనతో–మా తండ్రి అబ్రాహామనిరి; యేసు–మీరు అబ్రాహాము పిల్లలైతే అబ్రాహాము చేసిన క్రియలు చేతురు. దేవునివలన వినిన సత్యము మీతో చెప్పినవాడనైన నన్ను మీరిప్పుడు చంప వెదకుచున్నారే; అబ్రాహాము అట్లు చేయలేదు. మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పెను; అందుకు వారు– మేము వ్యభిచారమువలన పుట్టినవారము కాము, దేవుడొక్కడే మాకు తండ్రి అని చెప్పగా యేసు వారితో ఇట్లనెను–దేవుడు మీ తండ్రియైనయెడల మీరు నన్ను ప్రేమింతురు; నేను దేవుని యొద్దనుండి బయలుదేరి వచ్చియున్నాను, నా అంతట నేనే వచ్చియుండలేదు, ఆయన నన్ను పంపెను. మీరేల నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండుటవలననేగదా? మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు; మీ తండ్రి దురాశలు నెరవేర్చ గోరుచున్నారు. ఆదినుండి వాడు నరహంతకుడైయుండి సత్యమందు నిలిచినవాడు కాడు; వానియందు సత్యమేలేదు; వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును; వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై యున్నాడు. నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్నయెడల మీరెందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధియైనవాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పెను.
అందుకు యూదులు–నీవు సమరయుడవును దయ్యము పట్టినవాడవును అని మేము చెప్పుమాట సరియేగదా అని ఆయనతో చెప్పగా యేసు–నేను దయ్యము పట్టినవాడను కాను, నా తండ్రిని ఘనపరచువాడను; మీరు నన్ను అవమానపరచుచున్నారు. నేను నా మహిమను వెదకుటలేదు; వెదకుచు తీర్పు తీర్చుచు ఉండువాడొకడు కలడు. ఒకడు నా మాట గైకొనినయెడల వాడెన్నడును మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరమిచ్చెను. అందుకు యూదులు–నీవు దయ్యము పట్టినవాడవని యిప్పుడెరుగుదుము; అబ్రాహామును ప్రవక్తలును చనిపోయిరి; అయినను –ఒకడు నా మాట గైకొనినయెడల వాడు ఎన్నడును మరణము రుచిచూడడని నీవు చెప్పుచున్నావు. మన తండ్రియైన అబ్రాహాము చనిపోయెను గదా; నీవతనికంటె గొప్పవాడవా? ప్రవక్తలును చనిపోయిరి; నిన్ను నీ వెవడవని చెప్పుకొనుచున్నావని ఆయన నడిగిరి. అందుకు యేసు–నన్ను నేనే మహిమపరచుకొనినయెడల నా మహిమ వట్టిది; –మా దేవుడని మీరెవరినిగూర్చి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు. మీరు ఆయనను ఎరుగరు, నేనాయనను ఎరుగుదును; ఆయనను ఎరుగనని నేను చెప్పినయెడల మీవలె నేనును అబద్ధికుడనై యుందును గాని, నేనాయనను ఎరుగుదును, ఆయన మాట గైకొనుచున్నాను. మీ తండ్రియైన అబ్రాహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను; అది చూచి సంతోషించెను అనెను. అందుకు యూదులు– నీకింకను ఏబది సంవత్సరములైన లేవే, నీవు అబ్రాహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు–అబ్రాహాము పుట్టకమునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్లు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయములోనుండి బయటికి వెళ్లిపోయెను.
అధ్యాయము 27
ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గ్రుడ్డియైన యొక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు – బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా, వీని కన్నవారా? అని ఆయనను అడుగగా యేసు–వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని, దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను. పగలున్నంతవరకు నన్ను పంపినవాని క్రియలు మనము చేయుచుండవలెను; రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడును పనిచేయలేడు. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను. ఆయన ఇట్లు చెప్పి నేలమీద ఉమ్మివేసి, ఉమ్మితో బురదచేసి, వాని కన్నులమీద ఆ బురద పూసి –నీవు సిలోయము కోనేటికి వెళ్లి అందులో కడుగుకొనుమని చెప్పెను. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్లి కడుగుకొని చూపు గలవాడై వచ్చెను. కాబట్టి పొరుగువారును, వాడు భిక్షకుడని అంతకుముందు చూచినవారును–వీడు కూర్చుండి భిక్ష మెత్తుకొనువాడు కాడా అనిరి. వీడే అని కొందరును, వీడుకాడు, వీని పోలియున్న యొకడని మరికొందరును అనిరి; వాడైతే–నేనే యనెను. వారు–నీ కన్నులేలాగు తెరవబడెనని వానినడుగగా వాడు–యేసు అను నొక మనుష్యుడు బురద చేసి నా కన్నులమీద పూసి–నీవు సిలోయమను కోనేటికి వెళ్లి కడుగుకొనుమని నాతో చెప్పెను; నేను వెళ్లి కడుగుకొని చూపు పొందితిననెను. వారు, ఆయన ఎక్కడనని అడుగగావాడు, నేనెరుగననెను.
అంతకుముందు గ్రుడ్డియైయుండిన వానిని వారు పరిసయ్యులయొద్దకు తీసికొనిపోయిరి. యేసు బురదచేసి వాని కన్నులు తెరచిన దినము విశ్రాంతిదినము వాడేలాగు చూపుపొందెనో దానినిగూర్చి పరిసయ్యులు కూడ వానిని మరల అడుగగా వాడు–నా కన్నులమీద ఆయన బురద ఉంచగా నేను కడుగుకొని చూపు పొందితినని వారితో చెప్పెను. కాగా పరిసయ్యులలో కొందరు–ఈ మనుష్యుడు విశ్రాంతిదినము ఆచరించుట లేదు గనుక దేవుని యొద్దనుండి వచ్చినవాడు కాడనిరి. మరికొందరు–పాపియైన మనుష్యుడు ఈలాటి సూచక క్రియ లేలాగు చేయగలడనిరి; ఇట్లు వారిలో భేదము పుట్టెను. కాబట్టి వారు మరల ఆ గ్రుడ్డివానితో అతడు నీ కన్నులు తెరచినందుకు నీవతనిగూర్చి యేమనుకొనుచున్నావని యడుగగా వాడు–ఆయన ఒక ప్రవక్త అనెను. వాడు గ్రుడ్డి వాడైయుండి చూపు పొందెనని యూదులు నమ్మక, చూపు పొందినవాని తలిదండ్రులను పిలిపించి, –గ్రుడ్డివాడై పుట్టెనని మీరు చెప్పు మీ కుమారుడు వీడేనా? ఆలాగైతే ఇప్పుడు వీడేలాగు చూచుచున్నాడని వారిని అడిగిరి. అందుకు వాని తలిదండ్రులు–వీడు మా కుమారుడనియు వీడు గ్రుడ్డివాడుగా పుట్టెననియు మేమెరుగుదుము. ఇప్పుడు వీడేలాగు చూచుచున్నాడో యెరుగము; ఎవడు వీని కన్నులు తెరచెనో అదియు మేమెరుగము; వీడు వయస్సు వచ్చినవాడు, వీనినే అడుగుడి; తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో అనిరి. వాని తలిదండ్రులు యూదులకు భయపడి ఆలాగు చెప్పిరి; ఎందుకనిన ఆయన క్రీస్తు అని యెవరైనను ఒప్పుకొనినయెడల వానిని సమాజమందిరములోనుండి వెలి వేతుమని యూదులు అంతకుమునుపు నిర్ణయించుకొని యుండిరి. కావున వాని తలిదండ్రులు–వాడు వయస్సు వచ్చినవాడు; వానిని అడుగుడనిరి.
కాబట్టి వారు గ్రుడ్డివాడైయుండిన మనుష్యుని రెండవ మారు పిలిపించి –దేవుని మహిమపరచుము; ఈ మనుష్యుడు పాపియని మేమెరుగుదుమని వానితో చెప్పగా వాడు–ఆయన పాపియో కాడో నేనెరుగను; ఒకటి మాత్రము నేనెరుగుదును; నేను గ్రుడ్డివాడనైయుండి ఇప్పుడు చూచుచున్నాననెను. అందుకు వారు–ఆయన నీకేమి చేసెను? నీ కన్నులు ఏలాగు తెరచెనని మరల వానిని అడుగగా వాడు–ఇందాక మీతో చెప్పితిని గాని మీరు వినకపోతిరి; మీరెందుకు మరల వినగోరుచున్నారు? మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా యేమి అని వారితో అనెను. అందుకు వారు–నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులము; దేవుడు మోషేతో మాటలాడెనని యెరుగుదుము గాని వీడెక్కడనుండి వచ్చెనో యెరుగమని చెప్పి వానిని దూషించిరి. అందుకు ఆ మనుష్యుడు –ఆయన ఎక్కడనుండి వచ్చెనో మీరెరుగకపోవుట ఆశ్చర్యమే; అయినను ఆయన నా కన్నులు తెరచెను. దేవుడు పాపుల మనవి ఆలకింపడని యెరుగుదుము; ఎవడైనను దేవభక్తుడై యుండి ఆయన చిత్తముచొప్పున జరిగించినయెడల ఆయన వాని మనవి ఆలకించును. పుట్టు గ్రుడ్డివాని కన్నులెవరైన తెరచినట్టు లోకము పుట్టినప్పటినుండి వినబడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కానియెడల ఏమియు చేయనేరడని వారితో చెప్పెను. అందుకు వారు–నీవు కేవలము పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధింప వచ్చితివా అని వానితో చెప్పి వాని వెలివేసిరి.
పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని–నీవు దేవుని కుమారునియందు విశ్వాసముంచుచున్నావా అని అడిగెను. అందుకు వాడు–ప్రభువా, నేను ఆయనయందు విశ్వాసముంచుటకు ఆయన ఎవడని అడుగగా యేసు – నీవాయనను చూచుచున్నావు; నీతో మాటలాడుచున్నవాడు ఆయనే అనెను. అంతట వాడు–ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. అప్పుడు యేసు–చూడనివారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావలెను, అను తీర్పు నిమిత్తము నేనీ లోకమునకు వచ్చితినని చెప్పెను. ఆయన యొద్దనున్న పరిసయ్యులలో కొందరు ఈ మాట విని–మేమును గ్రుడ్డివారమా అని అడిగిరి. అందుకు యేసు – మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేక పోవును గాని–చూచుచున్నామని మీరిప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపము నిలిచియున్నదని చెప్పెను.
అధ్యాయము 28
గొఱ్ఱెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనువాడునై యున్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొఱ్ఱెల కాపరి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొఱ్ఱెలు అతని స్వరము వినును, అతడు తన సొంత గొఱ్ఱెలను పేరుపెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొఱ్ఱెలనన్నిటిని వెలుపలికి నడిపించునపుడెల్ల వాటికి ముందుగా నడుచును; గొఱ్ఱెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును. అన్యుల స్వరము అవి యెరుగవు గనుక అన్యుని ఎంతమాత్రమును వెంబడింపక వానియొద్దనుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పెను గాని ఆయన తమతో చెప్పిన సంగతులెట్టివో వారు గ్రహించుకొనలేదు.కాబట్టి యేసు మరల వారితో ఇట్లనెను –గొఱ్ఱెలు పోవు ద్వారమును నేనే; నాకు ముందు వచ్చిన వారందరు దొంగలును దోచుకొనువారునై యున్నారు; గొఱ్ఱెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును; నా ద్వారా ఎవడైన లోపల ప్రవేశించినయెడల వాడు రక్షింపబడినవాడై, లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచునుండును. దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు; గొఱ్ఱెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొఱ్ఱెలకు మంచి కాపరిని; మంచి కాపరి గొఱ్ఱెలకొరకు తన ప్రాణము పెట్టును. జీతగాడు గొఱ్ఱెల కాపరికాడు గనుక గొఱ్ఱెలు తనవికానందున తోడేలు వచ్చుట చూచి గొఱ్ఱెలను విడిచిపెట్టి పారిపోవును, తోడేలు ఆ గొఱ్ఱెలను పెట్టి చెదరగొట్టును. జీతగాడు జీతగాడే గనుక గొఱ్ఱెలనుగూర్చి లక్ష్యము చేయక పారిపోవును.
నేను గొఱ్ఱెల మంచి కాపరిని. తండ్రి నన్ను ఏలాగున ఎరుగునో నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో ఆలాగే నేను నా గొఱ్ఱెలను ఎరుగుదును, నా గొఱ్ఱెలు నన్ను ఎరుగును, మరియు గొఱ్ఱెలకొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఈ దొడ్డివికాని వేరే గొఱ్ఱెలును నాకు కలవు; వాటిని కూడ నేను తోడుకొని రావలెను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటియు గొఱ్ఱెల కాపరి ఒక్కడును అగును. నేను దాని మరల తీసికొనునట్లు నా ప్రాణము పెట్టుచున్నాను; ఇందు వలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణము తీసికొనడు; నా అంతట నేనే దాని పెట్టుచున్నాను; దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాని తిరిగి తీసికొనుటకును నాకు అధికారము కలదు; నా తండ్రివలన ఈ ఆజ్ఞ పొందితిననెను.ఈ మాటలనుబట్టి యూదులలో మరల భేదము పుట్టెను. వారిలో అనేకులు–వాడు దయ్యము పట్టినవాడు, వెఱ్ఱివాడు; వాని మాట ఎందుకు వినుచున్నారనిరి. మరికొందరు–ఇవి దయ్యము పట్టినవాని మాటలుకావు; దయ్యము గ్రుడ్డివారి కన్నులు తెరవగలదా అనిరి.
ఆలయ ప్రతిష్ఠితపండుగ యెరూషలేములో జరుగుచుండెను. అది శీతకాలము. అప్పుడు యేసు దేవాలయములో సొలొమోను మంటపమున తిరుగుచుండగా యూదులు ఆయనచుట్టు పోగై–ఎంతకాలము మమ్మును సందేహపెట్టుదువు? నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుమనిరి. అందుకు యేసు–మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు, నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అయితే మీరు నా గొఱ్ఱెలలోచేరినవారు కారు గనుక మీరు నమ్మరు. నా గొఱ్ఱెలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్యజీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలోనుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటె గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలోనుండి యెవడును వాటిని అపహరింపలేడు; నేనును తండ్రియును ఏకమై యున్నామని వారితో చెప్పెను.
యూదులు ఆయనను కొట్టవలెనని మరల రాళ్లుచేతపట్టుకొనగా యేసు– తండ్రి యొద్దనుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని; వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారినడిగెను. అందుకు యూదులు–నీవు మనుష్యుడవై యుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. అందుకు యేసు–మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడియుండలేదా? లేఖనము నిరర్థకము కానేరదు గదా, దేవుని వాక్యమెవరికి వచ్చెనో వారే దైవములని చెప్పినయెడల–నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు, తండ్రి ప్రతిష్ఠచేసి యీ లోకములోనికి పంపినవానితో – నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా? నేను నాతండ్రి క్రియలు చేయనియెడల నన్ను నమ్మకుడి, చేసినయెడల నన్ను నమ్మకున్నను, తండ్రి నాయందును నేను తండ్రియందును ఉన్నామని మీరు గ్రహించి తెలిసికొనునట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పెను. వారు మరల ఆయనను పట్టుకొన చూచిరిగాని ఆయన వారి చేతినుండి తప్పించుకొని పోయెను.యొర్దాను అద్దరిని యోహాను మొదట బాప్తిస్మమిచ్చుచుండిన స్థలమునకు ఆయన తిరిగి వెళ్లి అక్కడనుండెను. అనేకులు ఆయనయొద్దకు వచ్చి–యోహాను ఏ సూచక క్రియను చేయలేదు గాని యీయననుగూర్చి యోహాను చెప్పిన సంగతులన్నియు సత్యమైన వనిరి.
అధ్యాయము 29
యెరూషలేమునుండి వచ్చిన పరిసయ్యులును శాస్త్రులలో కొందరును ఆయనయొద్దకు కూడివచ్చి ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో, అనగా కడుగని చేతులతో భోజనము చేయుటచూచిరి. పరిసయ్యులును యూదులందరును పెద్దల పారంపర్యాచారమునుబట్టి చేతులు కడుగుకొంటేనే గాని భోజనము చేయరు. మరియు వారు సంతనుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకొంటేనే గాని భోజనము చేయరు. అప్పుడు పరిసయ్యులును శాస్త్రులును–నీ శిష్యులెందుకు పెద్దల పారంపర్యాచారముచొప్పున నడుచుకొనక, అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయన నడిగిరి. అందుకాయన వారితో ఈలాగు చెప్పెను– ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురుగాని, వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు, మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మునుగూర్చి యెషయా ప్రవచించినది సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి, మనుష్యుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. మరియు ఆయన–మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. –నీ తలిదండ్రులను ఘనపరచవలెననియు, తండ్రినైనను తల్లినైనను దూషించువానికి మరణశిక్ష విధింపవలెననియు మోషే చెప్పెను గదా. -అయినను మీరు–ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి– నావలన నీకు ప్రయోజనమగునది ఏదో అది కొర్బాను, అనగా దేవార్పితమని చెప్పినయెడల, తన తండ్రికైనను తల్లి కైనను వానిని ఏమియు చేయనియ్యక మీరు నియమించిన మీ పారంపర్యాచారమువలన దేవుని వాక్యమును నిరర్థకము చేయుదురు. ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పెను.
అప్పుడాయన జనసమూహమును మరల తనయొద్దకు పిలిచి–మీరందరు నా మాట విని గ్రహించుడి. నోటపడునది మనుష్యుని అపవిత్రపరచదు గాని నోటనుండి వచ్చునదియే మనుష్యుని అపవిత్రపరచునని వారితో చెప్పెను. అంతట ఆయన శిష్యులు వచ్చి పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియునా అని ఆయనను అడుగగా ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెల్లగింపబడును. వారి జోలికి పోకుడి; వారు గ్రుడ్డివారైయుండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపినయెడల వారిద్దరు గుంటలో పడుదురు గదా అనెను. ఆయన జనసమూహమును విడిచి యింటిలోనికి వచ్చినప్పుడు, ఆయన శిష్యులు ఈ ఉపమానమునుగూర్చి ఆయన నడుగగా, అందుకు పేతురు ఈ ఉపమానభావము మాకు తెలుపుమని ఆయనను అడుగగా, ఆయన వారితో ఇట్లనెను– మీరును ఇంత అవివేకులై యున్నారా? వెలుపలినుండి మనుష్యుని లోపలికి పోవునదేదియు వాని నపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా? అది వాని హృదయములో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడువబడును; ఇట్లు అది భోజనపదార్థములన్నిటిని పవిత్రపరచును. మనుష్యుని లోపలినుండి బయలు వెళ్లునది మనుష్యుని అపవిత్రపరచును. లోపలినుండి, అనగా మనుష్యుల హృదయములోనుండి దురాలోచనలును జారత్వములును దొంగతనములును నరహత్యలును వ్యభిచారములును లోభములును చెడుతనములును కృత్రిమమును కామవికారమును మత్సరమును దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును. ఈ చెడ్డ వన్నియు లోపలినుండియే బయలువెళ్లి, మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను.
యేసు అక్కడనుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్లగా, అపవిత్రాత్మ పట్టిన చిన్నకుమార్తెగల యొక స్త్రీ ఆయననుగూర్చి విని, వెంటనే వచ్చి ఆయన పాదములమీద పడెను. ఆ స్త్రీ సురోఫెనికయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఆమె తన కుమార్తెలోనుండి ఆ దయ్యమును వెళ్లగొట్టుమని ఆయనను వేడుకొనెను. ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము; నా కుమార్తె దయ్యముపట్టి, బహు బాధపడుచున్నదని కేకలువేసెను. అందుకాయన ఆమెతో ఒక్క మాటయైనను చెప్పలేదు. అప్పుడాయన శిష్యులు వచ్చి–ఈమె మన వెంబడి వచ్చి కేకలువేయు చున్నది గనుక ఈమెను పంపి వేయుమని ఆయనను వేడుకొనగా ఆయన–ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొఱ్ఱెలయొద్దకే గాని మరి ఎవరియొద్దకును నేను పంపబడలేదనెను అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి– ప్రభువా, నాకు సహాయము చేయుమని అడిగెను. ఆయన ఆమెను చూచి–పిల్లలు మొదట తృప్తి పొందవలెను; పిల్లల రొట్టె తీసికొని కుక్కపిల్లలకు వేయుట యుక్తము కాదనెను. అందుకామె–నిజమే ప్రభువా, అయితే కుక్కపిల్లలు కూడ బల్లక్రింద ఉండి, పిల్లలు పడ వేయు రొట్టెముక్కలు తినును గదా అని ఆయనతో చెప్పెను. అందుకు యేసు –అమ్మా, నీ విశ్వాసము గొప్పది; నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఆమె యింటికి వచ్చి, తన కుమార్తె మంచముమీద పండుకొని యుండుటయు దయ్యము వదలిపోయి యుండుటయు చూచెను.
అధ్యాయము 30
ఆయన మరల తూరు ప్రాంతములు విడిచి, సీదోను ద్వారా దెకపొలి ప్రాంతములమీదుగా గలిలయ సముద్రమునొద్దకు వచ్చెను. అప్పుడు వారు చెవుడుగల నత్తి వాని ఒకని ఆయనయొద్దకు తోడుకొనివచ్చి, వానిమీద చెయ్యి యుంచుమని ఆయనను వేడుకొనిరి. సమూహములోనుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొనిపోయి, వాని చెవులలో తన వ్రేళ్లుపెట్టి, ఉమ్మివేసి, వాని నాలుక ముట్టి ఆకాశమువైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి –ఎప్ఫతా అని వానితో చెప్పెను; ఆ మాటకు తెరవబడుమని అర్థము. అంతట వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాటలాడుచుండెను. అప్పుడాయన ఇది ఎవనితోను చెప్పవద్దని వారికాజ్ఞాపించెను; అయితే ఆయన చెప్పవద్దని వారికాజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా దానిని ప్రసిద్ధిచేయుచు –ఈయన సమస్తమును బాగుగా చేసియున్నాడు; చెవిటి వారు వినునట్లుగాను మూగవారు మాటలాడునట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి.యేసు అక్కడనుండి వెళ్లి, గలిలయ సముద్రతీరమునకు వచ్చి, కొండ యెక్కి అక్కడ కూర్చుండగా బహుజనసమూహములు ఆయనయొద్దకు కుంటివారు గ్రుడ్డివారు మూగవారు అంగహీనులు మొదలైన అనేకులను తీసికొనివచ్చి ఆయన పాదములయొద్ద పడవేసిరి; ఆయన వారిని స్వస్థపరచెను. మూగవారు మాటలాడుటయును అంగహీనులు బాగుపడుటయును కుంటివారు నడుచుటయును గ్రుడ్డివారు చూచుటయును జనసమూహము చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమపరచిరి.
ఆ దినములలో మరియొక సారి బహుజనులు కూడి రాగా, వారికి తిననేమియు లేనందున యేసు తన శిష్యులను తనయొద్దకు పిలిచి –జనులు నేటికి మూడుదినముల నుండి నాయొద్దనున్నారు; వారికి తిననేమియు లేనందున, నేను వారిమీద కనికరపడుచున్నాను; నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసినయెడల మార్గములో మూర్ఛపోవుదురు; వారిలో కొందరు దూరము నుండి వచ్చియున్నారని వారితో చెప్పెను. అందుకాయన శిష్యులు–ఈ అరణ్యప్రదేశములో ఒకడెక్కడ నుండి రొట్టెలు తెచ్చి, వీరిని తృప్తిపరచగలడని ఆయన నడిగిరి. ఆయన–మీయొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారి నడుగగా వారు – ఏడనిరి. అప్పుడాయన – నేలమీద కూర్చుండుడని జనులకాజ్ఞాపించి ఆ యేడు రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, విరిచి, వడ్డించుటకై తన శిష్యులకిచ్చెను, వారు జనసమూహమునకు వడ్డించిరి. కొన్ని చిన్నచేపలు కూడ వారియొద్దనుండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడ వడ్డించుడని చెప్పెను. వారు భోజనముచేసి తృప్తిపొందినమీదట, మిగిలిన ముక్కలు ఏడు గంపలనిండ ఎత్తిరి. స్త్రీలును పిల్లలును గాక తినినవారు నాలుగువేలమంది పురుషులు. తరువాత ఆయన జనసమూహములను పంపివేసి, దోనెయెక్కి మగదాను ప్రాంతములకు వచ్చెను.
అంతట పరిసయ్యులు వచ్చి ఆయనను శోధించుచు, ఆకాశమునుండి యొక సూచకక్రియను చూపుమని ఆయన నడిగి ఆయనతో తర్కింపసాగిరి. ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి–ఈ తరమువారు ఎందుకు సూచక క్రియ నడుగుచున్నారు? ఈ తరమునకు ఏ సూచక క్రియయు ననుగ్రహింపబడదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పి–సాయంకాలమున మీరు–ఆకాశము ఎఱ్ఱగా ఉన్నది గనుక వర్షము కురియదనియు, ఉదయమున– ఆకాశము ఎఱ్ఱగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చుననియు చెప్పుదురు గదా. మీరు పడమటనుండి మబ్బు పైకి వచ్చుట చూచునప్పుడు –వానవచ్చుచున్నదని వెంటనే చెప్పుదురు; ఆలాగే జరుగును. దక్షిణపు గాలి విసరుట చూచునప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు; ఆలాగే జరుగును. వేషధారులారా, మీరు భూమ్యాకాశముల వైఖరి గుర్తింప నెరుగుదురు; ఈ కాలమును మీరు గుర్తింప నెరుగరేల? ఏది న్యాయమో మీ అంతట మీరు విమర్శింపరేల?
వారిని విడిచి మరల దోనె యెక్కి అద్దరికి పోయెను.వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరచిరి; దోనెలో వారియొద్ద ఒక్క రొట్టె తప్ప మరేమియు లేకపోయెను. ఆయన–చూచుకొనుడి; పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండినిగూర్చియు జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా వారు–తమయొద్ద రొట్టెలు లేవేయని తమలోతాము ఆలోచించుకొనిరి. యేసు అది యెరిగి మనయొద్ద రొట్టెలు లేవేయని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకను గ్రహింపలేదా? వివేచింపలేదా? మీరు కఠినహృదయము గలవారై యున్నారా? మీరు కన్నులుండియు చూడరా? చెవులుండియు వినరా? జ్ఞాపకము చేసికొనరా? నేను ఆ అయిదువేలమందికి అయిదు రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపలనిండ ఎత్తితిరని వారి నడిగెను. వారు–పండ్రెండని ఆయనతో చెప్పిరి. ఆ నాలుగు వేలమందికి ఏడు రొట్టెలు నేను విరిచి, పంచి పెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపలనిండ ఎత్తితిరని ఆయన అడుగగా వారు – ఏడనిరి. నేను రొట్టెలనుగూర్చి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండినిగూర్చియే జాగ్రత్తపడుడని చెప్పెను. అప్పుడురొట్టెల పులిసిన పిండినిగూర్చి కాదుగాని పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి బోధనుగూర్చియే జాగ్రత్తపడవలెనని ఆయన తమతో చెప్పెనని వారు గ్రహించిరి.
అధ్యాయము 31
అంతలో వారు బేత్సయిదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయనయొద్దకు ఒక గ్రుడ్డివాని తోడుకొనివచ్చి, వాని ముట్టవలెనని ఆయనను వేడుకొనిరి. ఆయన ఆ గ్రుడ్డివాని చెయ్యిపట్టుకొని ఊరివెలుపలికి తోడుకొనిపోయి, వాని కన్నులమీద ఉమ్మివేసి, వాని మీద చేతులుంచి–నీకేమైనను కనబడుచున్నదా? అని వానినడుగగా, వాడు కన్నులెత్తి – మనుష్యులు నాకు కనబడుచున్నారు; వారు చెట్లవలె నుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారనెను. అంతట ఆయన మరల తన చేతులు వాని కన్నులమీద నుంచగా, వాడు తేరిచూచి కుదుర్చబడి సమస్తమును తేటగా చూడ సాగెను. అప్పుడు యేసు–నీవు ఊరిలోనికి వెళ్లవద్దని చెప్పి వాని యింటికి వానిని పంపివేసెను.
యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి–మనుష్యకుమారుడెవడని జనులు చెప్పకొనుచున్నారని తన శిష్యులను అడుగగా వారు కొందరు బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలీయా అనియు, కొందరు యిర్మీయా అనియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకాయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారి నడిగెను. అందుకు సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను. అందుకు యేసు–సీమోను బర్ యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచెనేకాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు; ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోకరాజ్యముయొక్క తాళపుచెవులు నీకిచ్చెదను, నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. అటుపిమ్మట తాను క్రీస్తు అని యెవనితోను చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను.
అప్పటినుండి తాను యెరూషలేమునకు వెళ్లి పెద్దలచేతను ప్రధానయాజకులచేతను శాస్త్రులచేతను అనేక హింసలు పొంది, చంపబడి, మూడవదినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకొని ప్రభువా, అది నీకు దూరమగుగాక, అది నీ కెన్నడును కలుగదని ఆయనను గద్దింపసాగెను. అయితే ఆయన పేతురువైపు తిరిగి సాతానా, నా వెనుకకు పొమ్ము; నీవు నాకు అభ్యంతర కారణమైయున్నావు; నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపక యున్నావని పేతురుతో చెప్పెను.
అంతట ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి–నన్ను వెంబడింప గోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువయెత్తికొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాని పోగొట్టుకొనును; నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని రక్షించుకొనును. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము? మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్య గలుగును? వ్యభిచారమును పాపమునుచేయు ఈ తరము వారిలో నన్నుగూర్చియు నామాటలనుగూర్చియు సిగ్గుపడు వాడెవడో, వానినిగూర్చి మనుష్యకుమారుడు తన తండ్రి మహిమగలవాడై పరిశుద్ధదూతలతోకూడ వచ్చునప్పుడు సిగ్గుపడునని చెప్పెను. మనుష్యకుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతోకూడ రాబోవుచున్నాడు. అప్పుడాయన ఎవని క్రియలచొప్పున వానికి ఫలమిచ్చును. ఇక్కడ నిలిచియున్న వారిలోకొందరు, మనుష్యకుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచువరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాననెను.
అధ్యాయము 32
ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి యెనిమిది దినములైన తరువాత, ఆయన పేతురును యోహానును యాకోబును వెంటబెట్టుకొని, ప్రార్థనచేయుటకు ఒక కొండ యెక్కెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను; ఆయన వస్త్రములు తెల్లనివై ధగధగ మెరిసెను. మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాటలాడుచుండిరి, వారు మోషే ఏలీయా అనువారు. వారు మహిమతో అగపడి, ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమునుగూర్చి మాటలాడుచుండిరి. పేతురును అతనితోకూడ ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి. వారు మేలుకొనినప్పుడు, ఆయన మహిమను ఆయనతోకూడ నిలిచియున్న యిద్దరు పురుషులను చూచిరి. (ఆ యిద్దరు పురుషులు) ఆయనయొద్ద నుండి వెళ్లిపోవుచుండగా పేతురు యేసుతో–ఏలినవాడా, మనమిక్కడ ఉండుట మంచిది, నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలీయాకు ఒకటియు మూడు పర్ణశాలలు మేము కట్టుదుమని, తాను చెప్పినది తానెరుగకయే చెప్పెను. అతడీలాగు మాటలాడుచుండగా మేఘమొకటి వచ్చి వారిని కమ్మెను; వారు ఆ మేఘములో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి. మరియు– ఈయన నే నేర్పరచుకొనిన నా కుమారుడు, ఈయన మాట వినుడని యొక శబ్దము ఆ మేఘములోనుండి పుట్టెను. శిష్యులు ఈ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా యేసు వారియొద్దకు వచ్చి వారిని ముట్టిలెండి, భయపడకుడని చెప్పెను. వారు కన్నులెత్తి చూడగా, యేసు తప్ప మరి ఎవరును వారికి కనబడలేదు.
వారు కొండ దిగి వచ్చుచుండగా–మనుష్యకుమారుడు మృతులలోనుండి లేచువరకు ఈ దర్శనము మీరు ఎవరితోను చెప్పకుడని యేసు వారికాజ్ఞాపించెను. మృతులలోనుండి లేచుట అనగా ఏమిటో అని వారొకనితో ఒకడు తర్కించుచు ఆ మాట మనస్సున ఉంచుకొనిరి. అప్పుడాయన శిష్యులు ఈలాగైతే ఏలీయా ముందుగా రావలెనని శాస్త్రులెందుకు చెప్పుచున్నారని ఆయన నడిగిరి. అందుకాయన ఏలీయా వచ్చి సమస్తమును చక్కపెట్టునను మాట నిజమే; అయినను ఏలీయా యిదివరకే వచ్చెను; వారతనిని ఎరుగక తమ కిష్టము వచ్చినట్టు అతని యెడల చేసిరి. మనుష్యకుమారుడు కూడ ఆలాగే వారి చేత శ్రమలు పొందబోవుచున్నాడని మీతో చెప్పుచున్నాననెను. అప్పుడాయన బాప్తిస్మమిచ్చు యోహానునుగూర్చి తమతో చెప్పెనని శిష్యులు గ్రహించిరి.
వారు శిష్యులయొద్దకు వచ్చి, వారి చుట్టు బహుజనులు కూడియుండుటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి. వెంటనే జనసమూహమంతయు ఆయనను చూచి, మిగుల విభ్రాంతినొంది ఆయనయొద్దకు పరుగెత్తి కొనివచ్చి ఆయనకు వందనముచేసిరి. అప్పుడాయన–మీరు దేనిగూర్చి వారితో తర్కించుచున్నారని వారి నడుగగా జనసమూహములో ఒకడు– బోధకుడా, మూగదయ్యము పట్టిన నా కుమారుని నీయొద్దకు తీసికొని వచ్చితిని; అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును; అప్పుడు వాడు నురుగు కార్చుకొని, పండ్లు కొరుకుకొని మూర్ఛిల్లును; దానిని వెళ్లగొట్టుడని నీ శిష్యులను అడిగితిని గాని అది వారిచేత కాలేదని ఆయనతో చెప్పెను. అందుకాయన విశ్వాసములేని తరమువారలారా, నేను ఎంతకాలము మీతో నుందును? ఎంతవరకు మిమ్మును సహింతును? వానిని నాయొద్దకు తీసికొని రండని వారితో చెప్పగా
వారాయనయొద్దకు వానిని తీసికొని వచ్చిరి. దయ్యము ఆయనను చూడగానే, వాని విలవిలలాడించెను గనుక వాడు నేలపడి నురుగు కార్చుకొనుచు పొర్లాడుచుండెను. అప్పుడాయన –ఇది వీనికి సంభవించి యెంతకాలమైనదని వాని తండ్రి నడుగగా అతడు–బాల్యమునుండియే; అది వాని నాశనము చేయవలెనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును. ఏమైనను నీవలననైతే మామీద కనికరపడి మాకు సహాయము చేయుమనెను. అందుకు యేసు–(నమ్ముట) నీవలననైతే, నమ్మువానికి సమస్తమును సాధ్యమే యని అతనితో చెప్పెను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి–నమ్ముచున్నాను, నాకు అపనమ్మకముండకుండ సహాయము చేయుమని బిగ్గరగా చెప్పెను. జనులు గుంపుకూడి తనయొద్దకు పరుగెత్తికొనివచ్చుట యేసు చూచి–మూగవైన చెవిటి దయ్యమా, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. అప్పుడు అది కేకవేసి, వానినెంతో విలవిలలాడించి వదలిపోయెను. అంతట వాడు చచ్చినవానివలె ఉండెను గనుక అనేకులు–వాడు చనిపోయెననిరి. అయితే యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలువబడెను. ఆయన ఇంటిలోనికి వెళ్లిన తరువాత ఆయన శిష్యులు–మే మెందుకు ఆ దయ్యమును వెళ్లగొట్టలేక పోతిమని ఏకాంతమున ఆయన నడిగిరి. అందుకాయన–మీ అల్పవిశ్వాసము చేతనే; మీకు ఆవగింజంత విశ్వాసముండినయెడల ఈ కొండను చూచి–ఇక్కడనుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును; మీకు అసాధ్యమైనది ఏదియు నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను.
అధ్యాయము 33
వారక్కడనుండి బయలుదేరి గలిలయ గుండా వెళ్లుచుండిరి; అది ఎవనికిని తెలియుట ఆయన కిష్టములేక పోయెను; ఏలయనగా ఆయన తన శిష్యులకు బోధించుచు –మనుష్యకుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారాయనను చంపెదరు; చంపబడిన మూడుదినములకు ఆయన లేచునని వారితో చెప్పెను. వారు ఆ మాట గ్రహింపలేదు గాని ఆయన నడుగ భయపడిరి.
వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరషెకెలు అను పన్ను వసూలు చేయువారు పేతురునొద్దకువచ్చి– మీ బోధకుడు ఈ అరషెకెలు చెల్లింపడా అని యడుగగా–చెల్లించుననెను. అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడకమునుపే యేసు ఆ సంగతి యెత్తి సీమోనా, నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలుచేయుదురు? కుమారులయొద్దనా అన్యుల యొద్దనా? అని అడిగెను. అతడు–అన్యులయొద్దనే అని చెప్పగా యేసు అలాగైతే కుమారులు స్వతంత్రులే. అయినను మనము వారికి అభ్యంతరము కలుగజేయకుండునట్లు నీవు సముద్రమునకు పోయి, గాలము వేసి, మొదట పైకివచ్చు చేపను పట్టుకొని, దాని నోరు తెరచినయెడల ఒక షెకెలు దొరకును; దానిని తీసికొని నా కొరకును నీకొరకును వారికిమ్మని అతనితో చెప్పెను.
తమలో ఎవడు గొప్పవాడో అని వారిలో తర్కము పుట్టగా, అంతట వారు కపెర్నహూమునకు వచ్చిరి. వారు– ఎవడు గొప్పవాడని మార్గమున ఒకనితో ఒకడు వాదించిరి గనుక , వారు ఊరకుండిరి. అప్పుడాయన కూర్చుండి పండ్రెండుమందిని పిలిచి–ఎవడైనను మొదటి వాడైయుండ గోరినయెడల, వాడందరిలో కడపటివాడును అందరికి పరిచారకుడునై యుండవలెనని చెప్పి. యేసు వారి హృదయాలోచన ఎరిగి, ఒక చిన్న బిడ్డను తీసికొని తనయొద్ద నిలువబెట్టి. –ఈ చిన్న బిడ్డను నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవానిని చేర్చుకొనును, మీ అందరిలో ఎవడు అత్యల్పుడైయుండునో వాడే గొప్ప వాడని వారితో చెప్పెను.
అంతట యోహాను–బోధకుడా, ఒకడు నీ పేరట దయ్యములను వెళ్లగొట్టుట చూచితిమి; వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంకపరచితిమని చెప్పెను. అందుకు యేసు–వానిని ఆటంకపరచకుడి; నాపేరట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగల వాడెవడును లేడు; మనకు విరోధికానివాడు మన పక్షముగా నున్నవాడే. మీరు క్రీస్తువారని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు, తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా, ఆయన యొక చిన్నబిడ్డను తనయొద్దకు పిలిచి, వారిమధ్యను నిలువబెట్టి యిట్లనెను –మీరు మార్పునొంది బిడ్డలవంటి వారైతేనే గాని పరలోకరాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డవలె తన్నుతాను తగ్గించుకొనువాడెవడో వాడే పరలోకరాజ్యములో గొప్పవాడు.
అధ్యాయము 34
ఆయన తన శిష్యులతో ఇట్లనెను–అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము కాని అవి ఎవనివలన వచ్చునో వానికి శ్రమ. నాయందు విశ్వాసముంచు ఈ చిన్న వారిలో ఒకనిని అభ్యంతరపరచువాడెవడో, వాడు మెడకు పెద్ద తిరుగటిరాయి కట్టబడినవాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచి వేయబడుట వానికి మేలు. అభ్యంతరములవలన లోకమునకు శ్రమ; అభ్యంతరములు రాక తప్పవు గాని, యెవనివలన అభ్యంతరము వచ్చునో ఆ మనుష్యునికి శ్రమ కాగా నీ చెయ్యియైనను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరచినయెడల, దానిని నరికి నీయొద్దనుండి పారవేయుము; రెండు చేతులును రెండు పాదములును కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుటకంటె కుంటివాడవుగనో అంగహీనుడవుగనో జీవములో ప్రవేశించుట నీకు మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరచినయెడల దాని పెరికి నీయొద్దనుండి పారవేయుము; రెండు కన్నులు గలిగి అగ్నిగల నరకములో పడవేయబడుటకంటె ఒక కన్ను గలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు. నరకమున వారి పురుగు చావదు; అగ్ని ఆరదు. ప్రతివానికి ఉప్పుసారము అగ్నివలన కలుగును. ఉప్పు మంచిదేగాని ఉప్పు నిస్సారమైనయెడల దేనివలన మీరు దానికి సారము కలుగజేతురు? మీలో మీరు ఉప్పుసారము గలవారై యుండి యొకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పెను.
ఈ చిన్నవారిలో ఒకనినైనను తృణీకరింపకుండ చూచుకొనుడి. వీరి దూతలు, పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడు పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. మీకేమి తోచును? ఒక మనుష్యునికి నూరు గొఱ్ఱెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయినయెడల తొంబదితొమ్మిదింటిని కొండలమీద విడిచివెళ్లి తప్పిపోయినదానిని వెదకడా? వాడు దాని కనుగొనినయెడల తొంబదితొమ్మిది గొఱ్ఱెలనుగూర్చి సంతోషించునంతకంటె దానినిగూర్చి యెక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తముకాదు. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పిదము చేసినయెడల అతని గద్దించుము; అతడు మారుమనస్సు పొందినయెడల అతని క్షమించుము. అతడు ఒక దినమున ఏడుమారులు నీయెడల తప్పిదము చేసి యేడు మారులు నీవైపుతిరిగి–మారుమనస్సు పొందితిననినయెడల అతని క్షమింపవలెననెను.
మరియు నీ సహోదరుడు నీయెడల తప్పిదము చేసినయెడల నీవు పోయి, నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతనిని గద్దించుము; అతడు నీ మాట వినినయెడల నీ సహోదరుని సంపాదించుకొంటివి. అతడు విననియెడల, ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడునట్లు నీవు ఒకరినిద్దరిని వెంటబెట్టుకొని అతనియొద్దకు పొమ్ము. అతడు వారి మాటయు విననియెడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము; అతడు సంఘపు మాటయు విననియెడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము. భూమిమీద మీరు వేటిని బంధింతురో, అవి పరలోకమందును బంధింపబడును; భూమిమీద మీరు వేటిని విప్పుదురో, అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనినిగూర్చియైనను భూమిమీద ఏకీభవించినయెడల అది పరలోకమందున్న నాతండ్రివలన వారికి దొరకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి యుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను. ఆ సమయమున పేతురు ఆయనయొద్దకు వచ్చి– ప్రభువా, నా సహోదరుడు నాయెడల తప్పిదము చేసినయెడల నేనెన్నిమారులు అతని క్షమింపవలెను? ఏడు మారులమట్టుకా? అని అడిగెను. అందుకు యేసు అతనితో ఇట్లనెను–ఏడుమారులుమట్టుకే కాదు, డెబ్బది ఏళ్ల మారులమట్టుకని నీతో చెప్పుచున్నాను.
కావున పరలోకరాజ్యము, తన దాసులయొద్ద లెక్క చూచుకొన గోరిన యొక రాజును పోలియున్నది. అతడు లెక్క చూచుకొన మొదలుపెట్టినప్పుడు, అతనికి పదివేల తలాంతులు అచ్చియున్న యొకడు అతనియొద్దకు తేబడెను. అప్పు తీర్చుటకు వానియొద్ద ఏమియు లేనందున, వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను వానికి కలిగినది యావత్తును అమ్మి, అప్పు తీర్చవలెనని ఆజ్ఞాపించెను. కాబట్టి ఆ దాసుడు అతని యెదుట సాగిలపడి మ్రొక్కి–నాయెడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి, వానిని విడిచిపెట్టి, వాని అప్పు క్షమించెను. అయితే ఆ దాసుడు బయటకు వెళ్లి తనకు నూరు దేనారములు అచ్చియున్న తన తోడిదాసులలో ఒకనినిచూచి, వాని గొంతుపట్టుకొని–నీవు అచ్చియున్నది చెల్లింపు మనెను అందుకు వాని తోడిదాసుడు సాగిలపడి–నా యెడల ఓర్చుకొనుము, నీకు చెల్లించెదనని వానిని వేడుకొనెను గాని వాడు ఒప్పుకొనక అచ్చియున్నది చెల్లించువరకు వానిని చెరసాలలో వేయించెను. కాగా వాని తోడి దాసులు జరిగినది చూచి, మిక్కిలి దుఃఖపడి, వచ్చి, జరిగినదంతయు తమ యజమానునికి వివరముగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి –చెడ్డ దాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించితిని; నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడిదాసుని కరుణింపవలసి యుండెను గదా అని వానితో చెప్పెను. అందుచేత వాని యజమానుడు కోపపడి, తనకు అచ్చియున్నదంతయు చెల్లించువరకు బాధపరచువారికి వాని నప్పగించెను. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపనియెడల నా పరలోకపు తండ్రియు ఆప్రకారమే మీయెడల చేయుననెను.
అధ్యాయము 35
ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్లుటకు మనస్సు స్థిరపరచుకొని, తనకంటె ముందుగా దూతలను పంపెను. వారు వెళ్లి ఆయనకు బస సిద్ధము చేయవలెనని సమరయుల యొక గ్రామములో ప్రవేశించిరి గాని ఆయన యెరూషలేమునకు వెళ్ల నభిముఖుడైనందున వారాయనను చేర్చుకొనలేదు. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి–ప్రభువా, ఆకాశమునుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయునట్లు మేమాజ్ఞాపించుట నీకిష్టమా అని అడుగగా, ఆయన వారితట్టు తిరిగి వారిని గద్దించెను. అంతట వారు మరియొక గ్రామమునకు వెళ్లిరి.
అటుతరువాత ప్రభువు డెబ్బదిమంది యితరులను నియమించి, తాను వెళ్లబోవు ప్రతి ఊరికిని ప్రతిచోటికిని తనకంటె ముందు ఇద్దరిద్దరినిగా పంపెను. పంపినప్పుడాయన వారితో ఇట్లనెను–కోత విస్తారముగా ఉన్నది గాని పనివారు కొద్దిమందియే; కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి. మీరు వెళ్లుడి; ఇదిగో తోడేళ్లమధ్యకు గొఱ్ఱెపిల్లలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను. మీరు సంచినైనను జాలెనైనను చెప్పులనైనను తీసికొనిపోవద్దు; త్రోవలో ఎవనినైనను కుశలప్రశ్న లడుగవద్దు; మీరు ఏ యింటనైనను ప్రవేశించునప్పుడు–ఈ యింటికి సమాధానమగు గాక అని మొదట చెప్పుడి. సమాధానపాత్రుడు అక్కడ నుండినయెడల మీ సమాధానము అతనిమీద నిలుచును; లేనియెడల అది మీకు తిరిగి వచ్చును. వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ యింటిలోనే యుండుడి, పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఇంటింటికి తిరుగవద్దు. మరియు మీరు ఏ పట్టణములోనైన ప్రవేశించునప్పుడు వారు మిమ్మును చేర్చుకొంటే మీ ముందరపెట్టునవి తినుడి. అందులో నున్న రోగులను స్వస్థపరచుడి–దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చియున్నదని వారితో చెప్పుడి. మీరు ఏ పట్టణములోనైన ప్రవేశించునప్పుడు వారు మిమ్మును చేర్చుకొనక పోయినయెడల మీరు దాని వీధులలోనికి పోయి–మా పాదములకు అంటిన మీ పట్టణపు ధూళిని కూడ మీ యెదుటనే దులిపివేయుచున్నాము; అయినను దేవుని రాజ్యము సమీపించియున్నదని తెలిసికొనుడని చెప్పుడి. ఆ పట్టణపు గతికంటె సొదొమ పట్టణపు గతి ఆ దినమున ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాను. మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపినవానిని నిరాకరించుననెను.
పిమ్మట ఏ యే పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణములవారు మారుమనస్సు పొందకపోవుటవలన ఆయన వారి నిట్లు గద్దింపసాగెను. –అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీమధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోనుపట్టణములలో చేయబడినయెడల ఆ పట్టణములవారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిదె వేసికొని మారుమనస్సు పొంది యుందురు. విమర్శదినమందు మీ గతికంటె తూరు సీదోను పట్టణములవారి గతి ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాను. కపెర్నహూమా, ఆకాశము మట్టునకు హెచ్చింపబడెదవా? నీవు పాతాళమువరకు దిగి పోయెదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడినయెడల అది నేటివరకు నిలిచియుండును. విమర్శదినమందు నీ గతికంటె సొదొమ దేశపువారి గతి ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాననెను.
ఆ డెబ్బదిమంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి –ప్రభువా, దయ్యములు కూడ నీ నామమువలన మాకు లోబడుచున్నవని చెప్పగా ఆయన–సాతాను మెరుపు వలె ఆకాశమునుండి పడుట చూచితిని. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటిమీదను మీకు అధికారము అనుగ్రహించియున్నాను; ఏదియు మీ కెంతమాత్రమును హానిచేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడియున్నవని సంతోషించుడని వారితో చెప్పెను. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి–తండ్రీ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను; అవును తండ్రీ, ఆలాగు నీ దృష్టికి అనుకూలమాయెను. సమస్తమును నా తండ్రిచేత నాకు అప్పగింపబడియున్నది; కుమారుడెవడో, తండ్రి తప్ప మరెవడును ఎరుగడు; తండ్రి ఎవడో, కుమారుడును కుమారుడెవనికి ఆయనను బయలు పరచనుద్దేశించునోవాడును తప్ప, మరెవడును ఎరుగడని చెప్పెను. ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చు కొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడొకడు లేచి– బోధకుడా, నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెనని ఆయనను శోధించుచు అడిగెను. అందుకాయన–ధర్మశాస్త్రమందేమి వ్రాయబడి యున్నది? నీ వేమి చదువుచున్నావని అతని నడుగగా అతడు–నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణమనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణవివేకముతోను ప్రేమింపవలెననియు, నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెననియు, వ్రాయబడియున్నదని చెప్పెను. అందుకాయన–నీవు సరిగా ఉత్తరమిచ్చితివి; ఆలాగు చేయుము అప్పుడు జీవించెదవని అతనితో చెప్పెను. అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరచుకొనగోరి, అతడు–అవును గాని నా పొరుగువాడెవడని యేసునడిగెను. అందుకు యేసు ఇట్లనెను–ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికోపట్టణమునకు దిగి వెళ్లుచు దొంగల చేతిలో చిక్కెను; వారు అతని బట్టలు దోచుకొని, అతని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడొక యాజకుడు ఆ త్రోవను వెళ్లుట తటస్థించెను. అతడు అతనిని చూచి, ప్రక్కగా పోయెను. ఆలాగుననే లేవీయుడొకడు ఆ చోటికివచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవుచు, అతడు పడియున్నచోటికి వచ్చి అతనిని చూచి, అతనిమీద జాలిపడి, దగ్గరకుపోయి, నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి, తన వాహనముమీద ఎక్కించి యొక పూటకూళ్లవాని యింటికి తీసికొనిపోయి అతని పరామర్శించెను. మరునాడతడు రెండు దేనారములు తీసి ఆ పూట కూళ్లవానికిచ్చి–ఇతని పరామర్శించుము, నీవింకేమైనను ఖర్చు చేసినయెడల నేను మరల వచ్చునప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పి పోయెను. కాగా దొంగలచేతిలో చిక్కినవానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయెనని నీకు తోచుచున్నది అని యేసు అడుగగా అతడు–అతని మీద జాలి పడినవాడే అనెను. అందుకు యేసు–నీవును వెళ్లి ఆలాగు చేయుమని అతనితో చెప్పెను.
అధ్యాయము 36
అంతట వారు ప్రయాణమై పోవుచుండగా, ఆయన యొక గ్రామములో ప్రవేశించెను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన యింట చేర్చుకొనెను. ఆమెకు మరియ అను సహోదరి యుండెను. ఈమె యేసు పాదములయొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుటచేత తొందరపడి, ఆయనయొద్దకు వచ్చి–ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచి పెట్టినందున, నీకు చింతలేదా? నాకు సహాయము చేయుమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు –మార్తా, మార్తా, నీవనేకమైన పనులనుగూర్చి విచారముకలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే మరియ ఉత్తమమైనదానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను.
ఆయన యొక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు– ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థనచేయ నేర్పుమని ఆయన నడిగెను. అందు కాయన–మీరు ప్రార్థన చేయునప్పుడు–తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మాకు కావలసిన అనుదినాహారము దినదినము మాకు దయచేయుము; మేము మాకచ్చియున్న ప్రతి వానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము; మమ్మును శోధనలోనికి తేకుము అని పలుకుడని వారితో చెప్పెను.
ఆ జనసమూహములో ఒకడు–బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలుపంచిపెట్టవలెనని నా సహోదరునితో చెప్పుమని ఆయన నడుగగా ఆయన–ఓయీ, మీమీద తీర్పరినిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్నెవడు నియమించెనని అతనితో చెప్పెను. మరియు ఆయన వారితో–మీరు ఏవిధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్తపడుడి; ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను –ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు–నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తానాలోచించుకొని – నేనీలాగు చేతును; నా కొట్లు విప్పి, వాటికంటె గొప్పవాటిని కట్టించి, అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో – ప్రాణమా, అనేక సంవత్సరములకు, విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడియున్నది; సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. అయితే దేవుడు–వెఱ్ఱివాడా, యీ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు; నీవు సిద్ధపరచినవి ఎవనివగునని అతనితో చెప్పెను. దేవునియెడల ధనవంతుడు కాక తనకొరకే సమకూర్చుకొనువాడు ఆలాగుననే యుండునని చెప్పెను.
మీ నడుములు కట్టుకొనియుండుడి, మీ దీపములు వెలుగుచుండనియ్యుడి. తమ ప్రభువు పెండ్లివిందునుండి వచ్చి తట్టగానే అతనికి తలుపుతీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతనికొరకు ఎదురు చూచు మనుష్యులవలె ఉండుడి. ప్రభువు వచ్చి యే దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు; అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి, తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు అతడు రెండవ జామున వచ్చినను మూడవ జామున వచ్చినను (ఏ దాసులు) మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. దొంగ యే గడియను వచ్చునో యింటి యజమానునికి తెలిసినయెడల అతడు మెలకువగా ఉండి, తన యింటికి కన్నము వేయనియ్యడని తెలిసికొనుడి. మీరు అనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పెను.
అప్పుడు పేతురు–ప్రభువా, యీ ఉపమానము మాతోనే చెప్పుచున్నావా అందరితోను చెప్పుచున్నావా? అని ఆయన నడుగగా ప్రభువు ఇట్లనెను–తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు, యజమానుడు తన యింటివారిమీద నియమించునట్టి నమ్మకమైన బుద్ధిగల గృహనిర్వాహకుడెవడు? ఎవని ప్రభువు వచ్చి, వాడు ఆలాగు చేయుచుండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తనకు కలిగినదానియంతటిమీద వాని ఉంచునని మీతో నిజముగా చెప్పుచున్నాను. అయితే ఆ దాసుడు–నా యజమానుడు వచ్చుట కాలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని, దాసులను దాసీలనుకొట్టి, తిని త్రాగి మత్తుగా ఉండసాగితే వాడు కనిపెట్టని దినములోను ఎరుగని గడియలోను ఆ దాసుని యజమానుడు వచ్చి వాని నరికించి, అపనమ్మకస్థులతో వానికి పాలు నియమించును. తన యజమానుని చిత్త మెరిగి యుండియు సిద్ధపడక, అతని చిత్తముచొప్పున జరిగింపకఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసినవానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి ఎక్కువగా ఇయ్యబడెనో వానియొద్ద ఎక్కువగా తీయజూతురు; మనుష్యులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు.
నేను భూమిమీద అగ్నివేయ వచ్చితిని; అది ఇదివరకే రగులుకొని మండవలెనని యెంతో కోరుచున్నాను. అయితే నేను పొందవలసిన బాప్తిస్మమున్నది, అది నెరవేరువరకు నేనెంతో ఇబ్బందిపడుచున్నాను. నేను భూమిమీద సమాధానము కలుగజేయ వచ్చితినని మీరు తలంచుచున్నారా? కాదు; భేదమునే కలుగజేయవచ్చితినని మీతో చెప్పుచున్నాను. ఇప్పటినుండి ఒక ఇంటిలో అయిదుగురు వేరుపడి, ఇద్దరికి విరోధముగా ముగ్గురును, ముగ్గురికి విరోధముగా యిద్దరును ఉందురు. తండ్రి కుమారునికిని, కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికిని, అత్త కోడలికిని, కోడలు అత్తకును విరోధులుగా ఉందురని చెప్పెను.
పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపియుండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను–ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందునవారు గలిలయులందరికంటె పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను; మీరు మారుమనస్సు పొందనియెడల మీరందరును ఆలాగే నశింతురు. మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ పదునెనిమిదిమంది, యెరూషలేములో కాపురమున్నవారందరికంటె అపరాధులని తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను; మీరు మారుమనస్సు పొందనియెడల మీరందరును ఆలాగే నశింతురు.మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను –ఒక మనుష్యుని ద్రాక్షతోటలో అంజూరపు చెట్టొకటి నాటబడి యుండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమియు దొరకలేదు గనుక అతడు–ఇదిగో మూడేండ్లనుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను గాని యేమియు దొరకలేదు; దీనిని నరికివేయుము, దీనివలన ఈ భూమియు ఏల వ్యర్థమై పోవలెనని ద్రాక్షతోట మాలితో చెప్పెను. అయితే వాడు–అయ్యా, నేను దానిచుట్టు త్రవ్వి, యెరువు వేయుమట్టుకు ఈ సంవత్సరము కూడ ఉండనిమ్ము; అది ఫలించిన సరి, లేనియెడల నరికించివేయుమని అతనితో చెప్పెను.
అధ్యాయము 37
విశ్రాంతిదినమున ఆయన యొక సమాజమందిరములో బోధించుచున్నప్పుడు పదునెనిమిది ఏండ్లనుండి బలహీనపరచు దయ్యము పట్టిన యొక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి యెంత మాత్రమును చక్కగా నిలువబడలేకుండెను. యేసు ఆమెను చూచి, రమ్మని పిలిచి–అమ్మా, నీ బలహీనతనుండి విడుదల పొంది యున్నావని ఆమెతో చెప్పి ఆమెమీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరచెను. యేసు విశ్రాంతిదినమున స్వస్థపరచినందున ఆ సమాజమందిరపు అధికారి కోపముతో మండిపడి, జనసమూహమును చూచి–పనిచేయదగిన ఆరు దినములు కలవు గనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థతపొందుడి; విశ్రాంతిదినమందు రావద్దని చెప్పెను. అందుకు ప్రభువు–వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతిదినమున తన యెద్దునైనను గాడిదనైనను గాడియొద్దనుండి విప్పి, తోలుకొనిపోయి, నీళ్లు పెట్టును గదా. ఇదిగో పదునెనిమిది ఏండ్లనుండి సాతాను బంధించిన అబ్రాహాము కుమార్తెయైన యీమెను విశ్రాంతిదినమందు ఈ కట్లనుండి విడిపింప దగదా? అని అతనితో చెప్పెను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన నెదిరించిన వారందరు సిగ్గుపడిరి; అయితే జనసమూహమంతయు ఆయన చేసిన ఘన కార్యములన్నిటిని చూచి సంతోషించెను.
ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవుచు బోధించుచు పట్టణములలోను గ్రామములలోను సంచారము చేయుచుండెను. ఒకడు–ప్రభువా, రక్షణపొందువారు కొద్దిమందేనా? అని ఆయన నడుగగా ఆయన వారిని చూచి–ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి; అనేకులు ప్రవేశింప జూతురు గాని వారివలన కాదని మీతో చెప్పుచున్నాను. ఇంటి యజమానుడు లేచి తలుపువేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి–అయ్యా, మాకు తలుపు తీయుమని చెప్ప నారంభించినప్పుడు ఆయన–మీ రెక్కడివారో మిమ్మును ఎరుగనని ఉత్తరము మీతో చెప్పును. అందుకు మీరు నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే; నీవు మా వీధులలో బోధించితివే అని చెప్ప సాగుదురు. అప్పుడాయన– మీ రెక్కడివారో మిమ్మును ఎరుగనని మీతో చెప్పుచున్నాను; అక్రమముచేయు మీరందరు నా యొద్దనుండి తొలగిపొండని చెప్పును. అబ్రాహాము ఇస్సాకు యాకోబులును సకల ప్రవక్తలును దేవుని రాజ్యములో ఉండుటయు, మీరు వెలుపలికి త్రోయబడుటయు, మీరు చూచునప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు. మరియు జనులు తూర్పునుండియు పడమటనుండియు ఉత్తరమునుండియు దక్షిణమునుండియువచ్చి, దేవుని రాజ్యమందు కూర్చుందురు. ఇదిగో కడపటి వారిలో కొందరు మొదటి వారగుదురు, మొదటివారిలో కొందరు కడపటి వారగుదురని చెప్పెను.
ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చి–నీ విక్కడనుండి బయలుదేరి పొమ్ము; హేరోదు నిన్ను చంపగోరుచున్నాడని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి–మీరు వెళ్లి, ఆ నక్కతో ఈలాగు చెప్పుడి– ఇదిగో నేడును రేపును నేను దయ్యములను వెళ్లగొట్టుచు (రోగులను) స్వస్థపరచుచునుండి మూడవదినమున పూర్ణ సిద్ధి పొందెదను. అయినను నేడు రేపు ఎల్లుండి నా త్రోవను నేను పోవుచుండవలెను; ప్రవక్త యెరూషలేమునకు వెలుపల నశింప వల్ల పడదు. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు, నీయొద్దకు పంపబడినవారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఏలాగు చేర్చుకొనునో ఆలాగే ఎన్నో మారులు నేను నీ పిల్లలను చేర్చుకొనవలెనని యుంటినిగాని మీ రొల్లకపోతిరి. ఇదిగో మీ యిల్లు మీకు పాడుగా విడువబడుచున్నది– ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాకని మీరు చెప్పువరకు మీరు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాననెను.
విశ్రాంతిదినమున ఆయన భోజనము చేయుటకు పరిసయ్యుల అధికారులలో ఒకని యింటిలోనికి వెళ్లినప్పుడు, ఆయన ఏమి చేయునో అని వారాయనను కనిపెట్టుచుండిరి. అప్పుడు జలోదర రోగముగల యొకడు ఆయన యెదుట ఉండెను. యేసు–విశ్రాంతిదినమున స్వస్థపరచుట న్యాయమా కాదా? అని ధర్మశాస్త్రోపదేశకులను పరిసయ్యులను అడుగగా వారూరకుండిరి. అప్పు డాయన వానిని చేరదీసి స్వస్థపరచి పంపివేసి –మీలో ఎవని గాడిదయైనను ఎద్దయినను గుంటలో పడినయెడల విశ్రాంతిదినమున దానిని పైకి తీయడా? అని వారి నడిగెను. ఈ మాటలకు వారు ఉత్తరము చెప్పలేకపోయిరి.
పిలువబడినవారు భోజనపంక్తిని అగ్రపీఠములు ఏర్పరచుకొనుట చూచి ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. నిన్నెవరైనను పెండ్లివిందుకు పిలిచినప్పుడు అగ్రపీఠము మీద కూర్చుండవద్దు; ఒకవేళ నీకంటె ఘనుడు అతనిచేత పిలువబడగా నిన్నును అతనిని పిలిచినవాడు వచ్చి –ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును, అప్పుడు నీవు సిగ్గు పడి కడపటి చోటున కూర్చుండసాగుదువు. అయితే నీవు పిలువబడినప్పుడు, నిన్ను పిలిచినవాడు వచ్చి–స్నేహి తుడా, పైచోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటున కూర్చుండుము; అప్పుడు నీతోకూడ కూర్చుండువారందరియెదుట నీకు ఘనత కలుగును. తన్ను తాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గింపబడును; తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడునని చెప్పెను.మరియు ఆయన తన్ను పిలిచినవానితో ఇట్లనెను– నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయునప్పుడు, నీ స్నేహితులనైనను నీ సహోదరులనైనను నీ బంధువులనైనను ధనవంతులగు నీ పొరుగువారినైనను పిలువవద్దు; వారు ఒకవేళ నిన్ను మరల పిలుతురు గనుక నీకు ప్రత్యుపకారము కలుగును. అయితే నీవు విందుచేయునప్పుడు బీదలను అంగహీనులను కుంటివాండ్రను గ్రుడ్డివాండ్రను పిలువుము. నీకు ప్రత్యుపకారము చేయుటకు వారి కేమియు లేదు గనుక నీవు ధన్యుడవగుదువు; నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువని చెప్పెను.
ఆయనతోకూడ భోజనపంక్తిని కూర్చుండినవారిలో ఒకడు ఈ మాటలు విని–దేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా ఆయన అతనితో నిట్లనెను–ఒక మనుష్యుడు గొప్ప విందుచేయించి అనేకులను పిలిచెను. విందుకాలమందు అతడు – ఇప్పుడు సిద్ధమైయున్నది, రండని పిలువబడినవారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరు ఏకమనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు– నేనొక పొలము కొనియున్నాను, అవశ్యముగా వెళ్లి దాని చూడవలెను, నన్ను క్షమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నాననెను. మరియొకడు–నేను అయిదు జతల యెడ్లను కొనియున్నాను, వాటిని పరీక్షింప వెళ్లుచున్నాను, నన్ను క్షమింపవలెనని వేడుకొనుచున్నాననెను. మరి యొకడు – నేనొక స్త్రీని వివాహము చేసికొన్నాను; అందుచేత నేను రాలేననెను. అప్పుడా దాసుడు తిరిగి వచ్చి యీ మాటలు తన యజమానునికి తెలియజేయగా, ఆ యింటి యజమానుడు కోపపడి–నీవు త్వరగా పట్టణపు వీధులలోనికిని సందులలోనికిని వెళ్లి, బీదలను అంగహీనులను కుంటివారిని గ్రుడ్డివారిని ఇక్కడికి తోడుకొనిరమ్మని ఆ దాసునితో చెప్పెను. అంతట దాసుడు–ప్రభువా, నీ వాజ్ఞాపించినట్టు చేసితినిగాని యింకను చోటున్నదని చెప్పెను. అందుకు యజమానుడు–నా యిల్లు నిండునట్లు నీవు రాజమార్గములలోనికిని కంచెలలోనికిని వెళ్లి లోపలికి వచ్చుటకు అక్కడివారిని బలవంతము చేయుము; ఏలయనగా పిలువబడిన ఆ మనుష్యులలో ఒకడును నా విందు రుచిచూడడని మీతో చెప్పుచున్నాననెను.
అధ్యాయము 38
బహుజనసమూహములు ఆయనతోకూడ వెళ్లుచున్నప్పుడు ఆయన వారితట్టు తిరిగి–ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్న దమ్ములను అక్కచెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసికొని నన్ను వెంబడింపని యెడల వాడు నా శిష్యుడు కానేరడు. మీలో ఎవడైనను ఒక గోపురముకట్టింపగోరినయెడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్కచూచుకొనడా? చూచుకొననియెడల అతడు దాని పునాదివేసి, ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచువారందరు–ఈ మనుష్యుడు కట్ట మొదలుపెట్టెను గాని కొన సాగింపలేక పోయెనని అతని చూచి యెగతాళి చేయ సాగుదురు. మరియు ఏ రాజైనను మరియొక రాజుతో యుద్ధము చేయబోవునప్పుడు తనమీదికి ఇరువదివేలమందితో వచ్చువానిని పదివేలమందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా? శక్తి లేనియెడల అతడింకను దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానము చేసికొన చూచును గదా. ఆప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచి పెట్టనివాడు నా శిష్యుడు కానేరడు. ఉప్పు మంచిదేగాని ఉప్పు నిస్సారమైతే దేనివలన దానికి సారము కలుగును? అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు గనుక దానిని బయట పారవేయుదురు. వినుటకు చెవులుగలవాడు వినునుగాక అని వారితో చెప్పెను.
ఒకప్పుడు సమస్తమైన సుంకరులును పాపులును ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా, పరిసయ్యులును శాస్త్రులును అది చూచి–ఇతడు పాపులను చేర్చుకొని వారితోకూడ భోజనముచేయుచున్నాడని చాల సణుగుకొనిరి. అందుకాయన వారితో ఈ ఉపమానము చెప్పెను మీలో ఏ మనుష్యునికైనను నూరు గొఱ్ఱెలుకలిగి యుండగా వాటిలో ఒకటి తప్పిపోయినయెడల అతడు తొంబది తొమ్మిదింటిని అడవిలో విడిచిపెట్టి, తప్పిపోయినది దొరకువరకు దానిని వెదక వెళ్లడా? అది దొరకినప్పుడు సంతోషముతో దానిని తన భుజములమీద వేసికొని యింటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి –మీరు నాతోకూడ సంతోషించుడి; తప్పిపోయిన నా గొఱ్ఱె దొరకినదని వారితో చెప్పును గదా. అటువలె మారుమనస్సు అక్కరలేని తొంబది తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషముకంటె మారుమనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును.ఏ స్త్రీకైనను పది వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకొంటె ఆమె దీపము వెలిగించి యిల్లు ఊడ్చి అది దొరకువరకు జాగ్రత్తగా వెదకదా? అది దొరకినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి –నాతోకూడ సంతోషించుడి, నేను పోగొట్టుకొనిన నాణెము దొరకినదని వారితో చెప్పును గదా. అటువలె మారుమనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతలయెదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాననెను.
మరియు ఆయన ఇట్లనెను–ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండిరి. వారిలో చిన్నవాడు–తండ్రీ, ఆస్తిలో నాకువచ్చు భాగమిమ్మని తన తండ్రి నడుగగా, అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్నిదినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూర దేశమునకు ప్రయాణమై పోయి, అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారమువలన పాడుచేసెను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరవు రాగా వాడు ఇబ్బంది పడసాగి, వెళ్లి ఆ దేశస్థులలో ఒకనిచెంత జేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములలోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను గాని యెవడును వాని కేమియు ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు–నా తండ్రియొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవుచున్నాను. నేను లేచి నా తండ్రియొద్దకు వెళ్లి–తండ్రీ, నేను పరలోకమునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని; ఇకమీదట నీ కుమారుడనని అని పించుకొనుటకు యోగ్యుడను కాను; నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని, లేచి తండ్రియొద్దకు వచ్చెను. వాడింక దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి, పరుగెత్తి వాని మెడమీదపడి ముద్దుపెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో–తండ్రీ, నేను పరలోకమునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని; ఇకమీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను. అయితే తండ్రి తన దాసులను చూచి –ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి; క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదము; ఈ నా కుమారుడు చనిపోయి మరల బ్రదికెను, తప్పిపోయి దొరకెనని చెప్పెను; అంతట వారు సంతోషపడసాగిరి.
అప్పుడు అతని పెద్దకుమారుడు పొలములో ఉండెను. వాడు (పొలమునుండి) వచ్చుచు ఇంటిదగ్గరకు రాగా, వాద్యములును నాట్యమును జరుగుట విని దాసులలో ఒకని పిలిచి–ఇవి ఏమిటని అడుగగా ఆ దాసుడు అతనితో–నీ తమ్ముడు వచ్చియున్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన పశువును వధించెననెను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్లనొల్లక పోయెను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి (లోపలికి రమ్మని) బతిమాలుకొనెను. అందుకతడు తన తండ్రితో–ఇదిగో యిన్నియేండ్లనుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడును మీరలేదే; అయినను నా స్నేహితులతో సంతోషపడునట్లు నీవు నాకెన్నడును ఒక మేకపిల్లనైన ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తిని వేసిన యీ నీ కుమారుడు రాగానే వీనికొరకు క్రొవ్విన పశువును వధించితివని చెప్పెను. అందుకతడు–కుమారుడా, నీ వెల్లప్పుడును నాతోకూడ ఉన్నావు; నావన్నియు నీవి, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే; ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రదికెను, తప్పిపోయి దొరకెనని అతనితో చెప్పెను.
అధ్యాయము 39
మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను–ఒక. ధనవంతునియొద్ద ఒక గృహనిర్వాహకుడుండెను. వాడతని ఆస్తిని పాడుచేయుచున్నాడని అతనియొద్ద వాని మీద నేరము మోపబడగా అతడు వాని పిలిపించి– నిన్నుగూర్చి నేను వినుచున్న యీ మాట ఏమిటి? నీ గృహనిర్వాహకత్వపు లెక్క అప్పగించుము; నీవు ఇక మీదట గృహనిర్వాహకుడవై యుండ వల్లకాదని వానితో చెప్పెను. ఆ గృహనిర్వాహకుడు తనలో తాను–నా యజమానుడు ఈ గృహనిర్వాహకత్వపు పనిలోనుండి నన్ను తీసివేయును గనుక నేను ఏమి చేతును? త్రవ్వలేను, భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను. నన్ను ఈ గృహనిర్వాహకత్వపు పనినుండి తొలగించునప్పుడు వారు నన్ను తమ యిండ్లలోనికి చేర్చుకొనునట్లు ఏమి చేయవలెనో నాకు తెలియుననుకొని, తన యజమానుని ఋణస్థులలో ఒక్కొక్కని పిలిపించి–నీవు నా యజమానునికి ఎంత అచ్చియున్నావని మొదటివాని నడిగెను. వాడు– నూరు మణుగుల నూనె అని చెప్పగా–నీవు నీ చీటి తీసికొని త్వరగా కూర్చుండి యేబది మణుగులని వ్రాసి కొమ్మని వానితో చెప్పెను. తరువాత వాడు–నీవు ఎంత అచ్చియున్నావని మరియొకని నడుగగా వాడు– నూరు తూముల గోధుమలని చెప్పినప్పుడు వానితో–నీవు నీ చీటి తీసికొనియెనుబది తూములని వ్రాసికొమ్మని చెప్పెను. అన్యాయస్థుడైన ఆ గృహనిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనెనని వాని యజమానుడు వాని మెచ్చుకొనెను. వెలుగు సంబంధులకంటె ఈ లోక సంబంధులు తమ తరమునుబట్టి చూడగా యుక్తిపరులై యున్నారు. 9అన్యాయపు సిరివలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి; ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలి పోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును; మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండనియెడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును? మీరు పరుల సొమ్ము విషయములో నమ్మకముగా ఉండనియెడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును? ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు; వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును; మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పెను.
ధనాపేక్షగల పరిసయ్యులు ఈ మాటలన్నియు విని ఆయనను అపహసించుచుండగా ఆయన–మీరు మనుష్యులయెదుట నీతిమంతులని అనిపించుకొనువారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుష్యులలో ఘనముగా ఎంచబడునది దేవునిదృష్టికి అసహ్యము. యోహాను కాలమువరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలును ఉండిరి; అప్పటినుండి దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుచున్నది; ప్రతివాడును ఆ రాజ్యములో బలవంతముగా జొరబడుచున్నాడు ధర్మశాస్త్రములో ఒక పొల్లయిన తప్పి పోవుటకంటె ఆకాశమును భూమియు గతించిపోవుట సులభము. తన భార్యను విడనాడి, మరియొకతెను వివాహము చేసికొను ప్రతివాడు వ్యభిచరించుచున్నాడు; భర్తను విడిచినదానిని వివాహము చేసికొనువాడు వ్యభిచరించుచున్నాడు.
ధనవంతుడొకడుండెను. అతడు ఊదారంగు బట్టలును సన్నపు నార వస్త్రములును ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అను ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని యింటి వాకిట పడియుండి అతని బల్లమీద నుండి పడు రొట్టెముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను; అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతలచేత అబ్రాహాము రొమ్మున (ఆనుకొనుటకు) కొనిపోబడెను. ధనవంతుడు కూడ చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడతడు పాతాళములో బాధపడుచు, కన్నులెత్తి దూరమునుండి అబ్రాహామును అతని రొమ్మున (ఆనుకొనియున్న) లాజరును చూచి –తండ్రివైన అబ్రాహామా, నాయందు కనికరపడి, తన వ్రేలికొనను–నీళ్లలోముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము; నేను ఈ అగ్నిజ్వాలలో యాతనపడుచున్నానని కేకలువేసి చెప్పెను. అందుకు అబ్రాహాము – కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, ఆలాగుననే లాజరు కష్టము అనుభవించెనని జ్ఞాపకము చేసికొనుము; ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడనుండి మీ యొద్దకు దాట గోరువారు దాటి పోజాలకుండునట్లును, అక్కడి వారు మాయొద్దకు దాటి రాజాలకుండునట్లును, మాకును మీకును మధ్య మహా అగాధముంచబడియున్నదని చెప్పెను. అప్పుడతడు–తండ్రీ, ఆలాగైతే నా కయిదుగురు సహోదరులున్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండ వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి యింటికి వాని పంపవలెనని నిన్ను వేడుకొనుచున్నాననెను. అందుకు అబ్రాహాము–వారియొద్ద మోషేయు ప్రవక్తలును ఉన్నారు; వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా అతడు–తండ్రివైన అబ్రాహామా, ఆలాగు అనవద్దు; మృతులలోనుండి ఒకడు వారియొద్దకు వెళ్లినయెడల వారు మారుమనస్సు పొందుదురని చెప్పెను. అందుకతడు–మోషేయు ప్రవక్తలును (చెప్పిన మాటలు) వారు విననియెడల మృతులలోనుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పెననెను.
అపొస్తలులు–మా విశ్వాసము వృద్ధిపొందించుమని ప్రభువుతో చెప్పగా ప్రభువు–మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబళిచెట్టును చూచి–నీవు వేళ్లతోకూడ పెల్లగింపబడి సముద్రములో నాటబడుమని చెప్పునప్పుడు అది మీకు లోబడును. దున్నువాడు గాని మేపువాడు గాని మీలో ఎవనికైన ఒక దాసుడుండగా, వాడు పొలములోనుండి వచ్చినప్పుడు–నీవు ఇప్పుడే వెళ్లి భోజనము చేయుమని వానితో చెప్పునా? చెప్పడు. అంతేకాక–నేను భోజనము చేయుటకు ఏమైనను సిద్ధపరచి, నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకొనువరకు నాకు పరిచారము చేయుము; అటుతరువాత నీవు అన్నపానములు పుచ్చుకొనవచ్చునని వానితో చెప్పును గాని ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపెనని వానిని మెచ్చునా? అటువలె మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నియు చేసిన తరువాత – మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసియున్నామని చెప్పుడనెను.
అధ్యాయము 40
ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవుచు సమరయ గలిలయలమధ్యగా వెళ్లుచుండెను. ఆయన యొక గ్రామములోనికి వెళ్లుచుండగా పదిమంది కుష్ఠ రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి –యేసు ప్రభువా, మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి–మీరు వెళ్లి, మిమ్మును యాజకులకు కనుపరచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్లుచుండగా, శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమ పరచుచు, తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, ఆయన పాదములయొద్ద సాగిలపడెను; వాడు సమరయుడు. అందుకు యేసు–పదిమంది శుద్ధులైరి కారా; ఆ తొమ్మండుగురు ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చినవాడెవడును అగపడలేదా అని చెప్పి –నీవు లేచిపొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని వానితో చెప్పెను.
దేవుని రాజ్యమెప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన నడిగినప్పుడు ఆయన–దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే యున్నది గనుక, ఇదిగో యిక్కడనని, అదిగో అక్కడనని చెప్ప వీలుపడదని వారికి ఉత్తర మిచ్చెను. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను–మనుష్య కుమారుని దినములలో ఒకదినము చూడవలెనని మీరు కోరు దినములు వచ్చునుగాని మీరు ఆ దినమును చూడరు. వారు–ఇదిగో యిక్కడనని అదిగో అక్కడనని మీతో చెప్పినయెడల వెళ్లకుడి, వెంబడింపకుడి. ఆకాశము క్రింద ఒక దిక్కునుండి మెరుపుమెరిసి, ఆకాశముక్రింద మరియొక దిక్కున కేలాగు ప్రకాశించునో ఆలాగున మనుష్యకుమారుడు తన దినమున ఉండును. అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది యీ తరము వారిచేత ఉపేక్షింపబడవలెను.నోవహు దినములలో జరిగినట్టు మనుష్యకుమారుని దినములలోను జరుగును. జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్లిన దినమువరకు, వారు తినుచు త్రాగుచు పెండ్లిచేసికొనుచు పెండ్లికిచ్చుచునుండి జలప్రళయమువచ్చి అందరిని కొట్టుకొనిపోవువరకు ఎరుగక పోయిరి; ఆలాగుననే మనుష్యకుమారుని రాకడ ఉండును.
లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరిని నాశనము చేసెను. ఆప్రకారమే మనుష్యకుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఆ దినమున మిద్దెమీదఉండు వాడు ఇంటఉండు తన సామగ్రిని తీసికొనిపోవుటకు దిగకూడదు; ఆలాగే పొలములో ఉండువాడును తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకము చేసికొనుడి. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును, దాని పోగొట్టుకొనువాడు దానిని సజీవముగా కాపాడుకొనును. ఆ రాత్రి యిద్దరొక్క మంచముమీద ఉందురు; వారిలో ఒకరు కొనిపోబడును ఒకరు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు ఒక్క తిరుగలి విసరుచుందురు; ఒకతె కొనిపోబడును ఒకతె విడిచిపెట్టబడుననెను. ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసి కొనిపోబడును ఒకడు విడిచి పెట్టబడును.కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి. ఆయన నడిగినందుకు ఆయన–పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలును పోగవునని వారితో చెప్పెను.
వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. –దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్యపెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి యొక పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతనియొద్దకు తరచుగావచ్చి–నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచు వచ్చెను గాని అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తరువాత అతడు–నేను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్యపెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాననుకొనెను. మరియు ప్రభువిట్లనెను–అన్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనినవారు దివారాత్రులు తన్నుగూర్చి మొఱ్ఱపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును; వారివిషయమే గదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చునప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా?
తామే నీతిమంతులని తమ్మునమ్ముకొని యితరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ప్రార్థనచేయుటకై యిద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్లిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి–దేవా, నేను చోరులును అన్యాయస్థులును వ్యభిచారులునైన యితర మనుష్యులవలెనైనను, ఈ సుంకరివలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు రెండు మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో పదియవ వంతు చెల్లించుచున్నానని తనలోతాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి, ఆకాశమువైపు కన్నులెత్తుటకైనను ధైర్యముచాలక రొమ్ము కొట్టుకొనుచు–దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతనికంటె ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన యింటికి వెళ్లెనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియు చెప్పెను.
అధ్యాయము 41
యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తరువాత . గలిలయనుండి యొర్దాను అద్దరినున్న యూదయ ప్రాంతములకు వచ్చెను. బహుజనసమూహములు ఆయనను వెంబడింపగా, ఆయన వారిని అక్కడ స్వస్థపరచెను. ఆయన తనవాడుక చొప్పున వారికి మరల బోధించుచుండెను. పరిసయ్యులు ఆయనయొద్దకు వచ్చి, ఆయనను శోధించుటకై–పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా? అని ఆయన నడిగిరి. అందుకాయన–మోషే మీకేమి ఆజ్ఞాపించెనని వారి నడిగెను. వారు–పరిత్యాగ పత్రిక వ్రాయించి, ఆమెను విడనాడవలెనని మోషే సెలవిచ్చెనని చెప్పగా . యేసు–మీ హృదయకాఠిన్యమునుబట్టి అతడీ ఆజ్ఞను మీకు వ్రాసి యిచ్చెను గాని, ఆదినుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించెననియు. –ఇందు నిమిత్తము పురుషుడు తలిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏకశరీరముగా ఉందురని చెప్పెననియు మీరు చదువలేదా? కాబట్టి వారికను ఇద్దరుకాక ఏకశరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరచినవారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పెను.మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరియొకతెను పెండ్లిచేసికొనువాడు వ్యభిచారము చేయుచున్నాడనియు, విడనాడబడిన దానిని పెండ్లిచేసికొనువాడు వ్యభిచారము చేయుచున్నాడనియు మీతో చెప్పుచున్నానని వారితోననెను.
ఇంటికి వచ్చి శిష్యులు ఈ సంగతినిగూర్చి ఆయనను మరల నడిగిరి. అందుకాయన–తన భార్యను విడనాడి మరియొకతెను పెండ్లిచేసికొనువాడు తాను విడనాడిన ఆమె విషయమై వ్యభిచరించువాడగును. మరియు స్త్రీ తన పురుషుని విడనాడి మరియొకని పెండ్లిజేసికొనినయెడల ఆమె వ్యభిచరించునదగునని వారితో చెప్పెను. ఆయన శిష్యులు–భార్యాభర్తలకుండు సంబంధము ఇట్టిదైతే పెండ్లి చేసికొనుట యుక్తము కాదని ఆయనతో చెప్పిరి. అందుకాయన అనుగ్రహము నొందినవారు తప్ప మరి ఎవరును ఈ మాటను అంగీకరింపనేరరు. తల్లి గర్భమునుండి నపుంసకులుగా పుట్టినవారు గలరు, మనుష్యులవలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులునుగలరు, పరలోక రాజ్యమునిమిత్తము తమ్మును తామే నపుంసకులనుగా చేసికొనిన నపుంసకులునుగలరు. (ఈ మాటను) అంగీకరింప గలవాడు అంగీకరించును గాక అని వారితో చెప్పెను.
అప్పుడు ఆయన వారిమీద చేతులుంచి ప్రార్థన చేయవలెనని కొందరు చిన్నపిల్లలను ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి. అయితే శిష్యులు (వారిని తీసికొని వచ్చిన) వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి–చిన్నబిడ్డలను నాయొద్దకు రానియ్యుడి, వారి నాటంకపరచవద్దు; దేవునిరాజ్యము ఈలాటివారిదే. చిన్నబిడ్డవలె దేవునిరాజ్యము నంగీకరింపనివాడు అందులో నెంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని, వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను.
ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరుగెత్తికొనివచ్చి ఆయనయెదుట మోకాళ్లూని–సద్బోధకుడా, నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయుదునని ఆయన నడిగెను. యేసు–నన్ను సత్పురుషుడని యేల చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు.అందుకాయన మంచి కార్యమునుగూర్చి నన్నెందుకు అడుగుచున్నావు. నీవు జీవములో ప్రవేశింపగోరినయెడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పెను. అతడు –ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా యేసు–నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను అనునవియే అని చెప్పెను. అందుకు ఆ యౌవనుడు – ఇవన్నియు అనుసరించుచునే యున్నాను; ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగెను. యేసు అతని చూచి అతని ప్రేమించి–నీకు ఒకటి కొదువగానున్నది; నీవు వెళ్లి నీకు కలిగినవన్నియు అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును; నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పెను.
అతడు మిగుల ఆస్తిగలవాడు, గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని, దుఃఖపడుచు వెళ్లిపోయెను. అప్పుడు యేసు చుట్టు చూచి–ఆస్తిగలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పెను. ఆయన మాటలకు శిష్యులు విస్మయమొందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను– పిల్లలారా, తమ ఆస్తియందు నమ్మికయుంచువారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము; ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుటకంటె ఒంటె సూదిబెజ్జములో దూరుట సులభము. అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి– అట్లయితే ఎవడు రక్షణపొందగలడని ఆయన నడిగిరి. యేసు వారిని చూచి–ఇది మనుష్యులకు అసాధ్యమే గాని, దేవునికి అసాధ్యము కాదు; దేవునికి సమస్తమును సాధ్యమే అనెను.
పేతురు–ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరకునని ఆయనను అడుగగా యేసు వారితో ఇట్లనెను (ప్రపంచ) పునర్జననమందు మనుష్యకుమారుడు తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడైయుండునపుడు నన్ను వెంబడించిన మీరును పండ్రెండు సింహాసనములమీద ఆసీనులై ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములవారికి తీర్పుతీర్చుదురు. దేవుని రాజ్యము నిమిత్తమై యింటినైనను భార్యనైనను అన్నదమ్ములనైనను తలిదండ్రులనైనను పిల్లలనైనను విడిచిపెట్టినవాడెవడును, ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్కచెల్లెండ్రను తల్లులను పిల్లలను భూములను, రాబోవు లోకమందు నిత్యజీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మొదటి వారు అనేకులు కడపటివారగుదురు, కడపటివారు మొదటి వారగుదురు అనెను.
ఏలాగనగా–పరలోకరాజ్యము ఒక ఇంటి యజమానుని పోలియున్నది. అతడు తన ద్రాక్షతోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు ఒక దేనారము చొప్పున పనివారితో ఒడబడి, తన ద్రాక్షతోటలోనికి వారిని పంపెను. తరువాత అతడు దాదాపు తొమ్మిది గంటలకు వెళ్లి సంత వీధిలో ఊరక నిలిచియున్న మరికొందరిని చూచి మీరును నా ద్రాక్షతోటలోనికి వెళ్లుడి, యేమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్లిరి. దాదాపు పండ్రెండు గంటలకును, మూడు గంటలకును, అతడు మరల వెళ్లి, ఆలాగే చేసెను. తిరిగి దాదాపు అయిదు గంటలకు వెళ్లి, మరికొందరు నిలిచియుండగా చూచి ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచియున్నారని వారిని అడుగగా వారు ఎవడును మమ్మును కూలికి పెట్టుకొన లేదనిరి. అందుకతడు మీరును నా ద్రాక్షతోటలోనికి వెళ్లుడనెను. సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్షతోట యజమానుడు తన గృహనిర్వాహకుని చూచి–పనివారిని పిలిచి, చివర వచ్చినవారు మొదలుకొని మొదట వచ్చిన వారివరకు వారికి కూలి ఇమ్మని చెప్పెను. దాదాపు అయిదు గంటలకు కూలికి కుదిరినవారు వచ్చి ఒక్కొక దేనారముచొప్పున తీసికొనిరి. మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరకుననుకొనిరి గాని వారికిని ఒక్కొక దేనారముచొప్పుననే దొరకెను. వారది తీసికొని – చివర వచ్చిన వీరు ఒక్కగంట మాత్రమే పనిచేసినను, పగలంతయు కష్టపడి యెండబాధ సహించిన మాతో వారిని సమానము చేసితివే అని ఆ యింటి యజమానునిమీద సణుగుకొనిరి. అందుకతడు వారిలో ఒకని చూచి స్నేహితుడా, నేను నీకు అన్యాయము చేయలేదే; నీవు నాయొద్ద ఒక దేనారమునకు ఒడబడలేదా? నీ సొమ్ము నీవు తీసికొని పొమ్ము; నీ కిచ్చినట్టే కడపట వచ్చిన వీరికిచ్చుటకును నాకిష్టమైనది; నాకిష్టమువచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపుమంటగా ఉన్నదా అని చెప్పెను. ఈ ప్రకారమే కడపటివారు మొదటివారగుదురు, మొదటివారు కడపటివారగుదురు.
అధ్యాయము 42
వారు ప్రయాణమై యెరూషలేమునకు వెళ్లుచుండిరి. యేసు వారికి ముందు నడుచుచుండగా వారు విస్మయ మొందిరి, వెంబడించువారు భయపడిరి. ఆయన పండ్రెండుమంది శిష్యులను ఏకాంతముగా తీసికొనిపోయి, మార్గమందు వారితో ఇట్లనెను. ఇదిగో యెరూషలేమునకు వెళ్లుచున్నాము; మనుష్యకుమారుని గూర్చి ప్రవక్తలచేత వ్రాయబడిన మాటలన్నియు నెరవేర్చబడును. మనుష్యకుమారుడు ప్రధానయాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును; వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనుల కప్పగించెదరు. వారు ఆయనను అపహసించి, ఆయనమీద ఉమ్మివేసి, కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు; మూడుదినములైన తరువాత ఆయన తిరిగి లేచునని చెప్పెను. వారు ఈ మాటలలో ఒకటైనను గ్రహింపలేదు; ఈ సంగతి వారికి మరుగు చేయబడెను గనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు.
జెబెదయి కుమారులైన యాకోబును యోహానును ఆయనయొద్దకు వచ్చి–బోధకుడా, మేము అడుగునదెల్ల నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా ఆయన–నేను మీకేమి చేయగోరుచున్నారని వారి నడిగెను. వారు–నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ యెడమవైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయుమని చెప్పిరి. యేసు–మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు; నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటయైనను, నేను పొందుచున్న బాప్తిస్మము పొందుటయైనను మీచేత అగునా? అని వారి నడుగగా వారు–మా చేత అగుననిరి. అప్పుడు యేసు–నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు; నేను పొందుచున్న బాప్తిస్మము మీరు పొందెదరు, గాని నా కుడివైపునను ఎడమవైపునను కూర్చుండనిచ్చుట నావశములో లేదు; అది ఎవరికి సిద్ధపరచబడెనో వారికే (దొరకునని) వారితో చెప్పెను. తక్కినపదిమంది శిష్యులు ఆ మాట విని, యాకోబు యోహానులమీద కోపపడసాగిరి. యేసు వారిని తనయొద్దకు పిలిచి వారితో ఇట్లనెను–అన్యజనులలో అధికారులని యెంచబడినవారు వారిమీద ప్రభుత్వము చేయుదురు; వారిలో గొప్పవారు వారిమీద అధికారము చేయుదురని మీకు తెలియును. మీలో ఆలాగుండకూడదు. మీలో ఎవడైనను గొప్పవాడై యుండగోరినయెడల వాడు మీకు పరిచారము చేయువాడై యుండవలెను. మీలో ఎవడైనను ప్రముఖుడై యుండగోరినయెడల, వాడు అందరికి దాసుడై యుండవలెను. ఆలాగే మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని చెప్పెను.
వారు యెరికోపట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోను బహుజనసమూహముతోను యెరికోనుండి బయలుదేరి వచ్చుచుండగా, తీమయి కుమారుడగు బర్తిమయియను గ్రుడ్డి భిక్షకుడు త్రోవప్రక్కను కూర్చుండెను. జనసమూహము దాటిపోవుచున్నట్టు వాడు చప్పుడు విని–ఇది ఏమని అడుగగా వారు–నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్లుచున్నాడని వానితో చెప్పిరి. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని– దావీదు కుమారుడా యేసూ, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరకుండుమని అనేకులు వానిని గద్దించిరి గాని వాడు–దావీదు కుమారుడా, నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలువేసెను. అప్పుడు యేసు నిలిచి–వానిని పిలువుడని చెప్పగా వారా గ్రుడ్డివానిని పిలిచి–ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతట వాడు బట్టను పారవేసి, దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. యేసు–నేను నీకేమి చేయగోరుచున్నావని వానినడుగగా, ఆ గ్రుడ్డివాడు–బోధకుడా, నాకు దృష్టి కలుగజేయుమని ఆయనతో అనెను. యేసు–చూపుపొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని వానితో చెప్పెను; వెంటనే వాడు చూపుపొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరు అది చూచి దేవుని స్తోత్రము చేసిరి.
ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దానిగుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరుగల ఒకడు యేసు ఎవరోయని చూడగోరెనుగాని, పొట్టివాడైనందున జనులు గుంపుకూడి యుండుటవలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానై యుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి, ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు, కన్నులెత్తి చూచి–జక్కయ్యా త్వరగా దిగుము, నేడు నేను నీ యింట నుండవలసియున్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరు అది చూచి–ఈయన పాపియైన మనుష్యునియొద్ద బసచేయ వెళ్లెనని చాల సణుగుకొనిరి. జక్కయ్య నిలువబడి–ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను; నేనెవనియొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసికొనినయెడల అతనికి నాలుగంతలు మరల చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు–ఇతడును అబ్రాహాము కుమారుడే; ఎందుకనగా నేడు ఈ యింటికి రక్షణ వచ్చియున్నది. నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను.
వారు ఈ మాటలు వినుచుండగా తాను యెరూషలేమునకు సమీపమున ఉండుటవలనను, దేవుని రాజ్యము వెంటనే అగుపడునని వారు తలంచుటవలనను, ఆయన మరియొక ఉపమానము చెప్పెను. ఏమనగా, రాజకుమారుడొక రాజ్యము సంపాదించుకొని మరల రావలెనని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను పదిమందిని పిలిచి వారికి పది మినాలనిచ్చి–నేను వచ్చువరకు వ్యాపారము చేయుడని వారితో చెప్పెను. అయితే అతని పట్టణస్థులతని ద్వేషించి–ఇతడు మమ్ము నేలుట మా కిష్టము లేదని అతని వెనుక రాయబారము పంపిరి. అతడా రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు, ప్రతివాడును వ్యాపారమువలన ఏమేమి సంపాదించెనో తెలిసికొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తనయొద్దకు పిలువుమని ఆజ్ఞాపించెను. మొదటివాడాయన యెదుటికి వచ్చి–అయ్యా, నీ మినావలన పది మినాలు లభించెనని చెప్పగా అతడు–భళా, మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక పది పట్టణములమీద అధికారివై యుండుమని వానితో చెప్పెను. అంతట రెండవవాడు వచ్చి–అయ్యా, నీ మినావలన అయిదు మినాలు లభించెననగా అతడు–నీవును అయిదు పట్టణములమీద ఉండుమని అతనితో చెప్పెను. అంతట మరియొకడు వచ్చి–అయ్యా, యిదిగో నీ మినా;
నీవు పెట్టనిదానిని ఎత్తికొనువాడవును, విత్తనిదానిని కోయువాడవునైన కఠినుడవు గనుక, నీకు భయపడి దీనిని రుమాలున కట్టి ఉంచితినని చెప్పెను. అందుకతడు చెడ్డ దాసుడా, నీ నోటి మాటనుబట్టియే నీకు తీర్పు తీర్చుదును; నేను పెట్టనిదానిని ఎత్తువాడను, విత్తనిదానిని కోయువాడనునైన కఠినుడనని నీకు తెలిసియుండగా నీవెందుకు నా సొమ్ము సాహుకారులయొద్ద నుంచలేదు? అట్లు చేసి యుండినయెడల నేను వచ్చి వడ్డితో దానిని తీసికొందునే అని వానితో చెప్పి –వీనియొద్దనుండి ఆ మినా తీసివేసి పది మినాలు గలవాని కియ్యుడని దగ్గర నిలిచినవారితో చెప్పెను. వారు–అయ్యా, వానికి పది మినాలు కలవే అనిరి. అందుకతడు–కలిగిన ప్రతివానికిని ఇయ్యబడును, లేనివానియొద్దనుండి వానికి కలిగినదియు తీసివేయబడునని మీతో చెప్పుచున్నాను. మరియు నేను తమ్మును ఏలుటకు ఇష్టములేని నా శత్రువులను ఇక్కడికి తీసికొనివచ్చి నాయెదుట సంహరించుడని చెప్పెను. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్లవలెనని ముందు సాగిపోయెను.
అధ్యాయము 43
మరియ, ఆమె సహోదరియైన మార్త, అనువారి . గ్రామమైన బేతనియలోనున్న లాజరు అను ఒకడు రోగియాయెను. ఈ లాజరు ప్రభువునకు అత్తరుపూసి తల వెండ్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్కచెల్లెండ్రు – ప్రభువా, యిదిగో నీవు ప్రేమించువాడు రోగియై యున్నాడని ఆయనయొద్దకు వర్తమానము పంపిరి. యేసు అది విని–యీ వ్యాధి మరణముకొరకు వచ్చినదికాదు గాని దేవుని కుమారుడు దానివలన మహిమ పరచబడునట్లు దేవుని మహిమకొరకు వచ్చినదనెను. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. అతడు రోగియై యున్నాడని యేసు వినినప్పుడు తానున్నచోటనే యింక రెండు దినములు నిలిచెను. అటుపిమ్మట ఆయన–మనము యూదయకు తిరిగి వెళ్లుదమని తన శిష్యులతో చెప్పగా ఆయన శిష్యులు–బోధకుడా, యిప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే; అక్కడికి తిరిగి వెళ్లుదువా అని ఆయన నడిగిరి. అందుకు యేసు–పగలు పండ్రెండు గంటలున్నవి గదా, ఒకడు పగటివేళ నడిచినయెడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్రుపడడు. అయితే రాత్రివేళ ఒకడు నడిచినయెడల వానియందు వెలుగులేదు గనుక వాడు తొట్రుపడునని చెప్పెను. ఆయన యీ మాటలు చెప్పిన తరువాత–మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు; అతని మేలుకొలుప వెళ్లుచున్నానని వారితో చెప్పగా శిష్యులు– ప్రభువా, అతడు నిద్రించినయెడల బాగుపడుననిరి. యేసు అతని మరణమునుగూర్చి ఆ మాట చెప్పెను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పెననుకొనిరి. కావున యేసు–లాజరు చనిపోయెను, మీరు నమ్మునట్లు నేనక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను; అయినను అతనియొద్దకు మనము వెళ్లుదము రండని స్పష్టముగా వారితో చెప్పెను. అందుకు దిదుమ అనబడిన తోమా–ఆయనతోకూడ చనిపోవుటకు మనమును వెళ్లుదమని తనతోడి శిష్యులతో చెప్పెను.
యేసు వచ్చి అదివరకే అతడు నాలుగు దినములు సమాధిలో ఉండెనని తెలిసికొనెను. బేతనియ యెరూషలేమునకు సమీపమై యుండెను; దానికి ఇంచుమించు కోసెడు దూరము గనుక యూదులలో అనేకులు వారి సహోదరునిగూర్చి మార్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చియుండిరి. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్లెనుగాని మరియ యింటిలో కూర్చుండి యుండెను. మార్త యేసుతో–ప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకను గ్రహించునని యెరుగుదుననెను. యేసు–నీ సహోదరుడు మరల లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో–అంత్య దినమున పునరుత్థానమందు లేచునని యెరుగుదుననెను. అందుకు యేసు–పునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును; బ్రదికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? అని ఆమెను నడిగెను. ఆమె–అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పెను. ఆమె ఈ మాట చెప్పి వెళ్లి–బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరియైన మరియను రహస్యముగా పిలిచెను. ఆమె విని త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చెను.
యేసు ఇంకను ఆ గ్రామములోనికి రాక, మార్త ఆయనను కలిసికొనిన చోటనే ఉండెను గనుక యింటిలో మరియతోకూడ నుండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్లుట చూచి, ఆమె సమాధియొద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్లుచున్నదనుకొని ఆమె వెంట వెళ్లిరి. అంతట మరియ యేసు ఉన్న చోటికి వచ్చి, ఆయనను చూచి, ఆయన పాదములమీద పడి–ప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండుననెను. ఆమె ఏడ్చుటయు, ఆమెతోకూడ వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు–అతని నెక్కడ నుంచితిరని అడుగగా, వారు–ప్రభువా, వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు–అతనిని ఏలాగు ప్రేమించెనో చూడుడని చెప్పుకొనిరి. వారిలో కొందరు–ఆ గ్రుడ్డివాని కన్నులు తెరచిన యీయన, యితనిని చావకుండ చేయలేడా అని చెప్పిరి. యేసు మరల తనలో మూలుగుచు సమాధియొద్దకు వచ్చెను. అది యొక గుహ, దానిమీద ఒక రాయి పెట్టియుండెను. యేసు–రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయినవాని సహోదరియైన మార్త–ప్రభువా, అతడు చనిపోయి నాలుగు దినములైనది గనుక ఇప్పటికి వాసనకొట్టునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు–నీవు నమ్మినయెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను; అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి–తండ్రీ, నీవు నా మనవి వినినందున నీకు కృత జ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడును నా మనవి వినుచున్నావని నేనెరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టు నిలిచియున్న యీ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై యీ మాట చెప్పితిననెను. ఆయన ఆలాగు చెప్పి–లాజరూ, బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయినవాడు, కాళ్లు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడినవాడై వెలుపలికి వచ్చెను; అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను. అంతట యేసు– మీరు అతని కట్లు విప్పిపోనియ్యుడని వారితో చెప్పెను. కాబట్టి మరియయొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యూదులలో అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరికాని.
వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్లి యేసుచేసిన కార్యములనుగూర్చి వారితో చెప్పిరి. కాబట్టి ప్రధానయాజకులును పరిసయ్యులును మహా సభను సమకూర్చి–మనమేమి చేయుచున్నాము? ఈ మనుష్యుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే. మనమాయనను ఈలాగు చూచుచు ఊరకుండినయెడల అందరు ఆయనయందు విశ్వాసముంచెదరు; అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకొందురని చెప్పిరి. అయితే వారిలో కయప అను ఒకడు ఆ సంవత్సరము ప్రధానయాజకుడైయుండి –మీ కేమియు తెలియదు. మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజలకొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పెను. తనంతట తానే యీలాగు చెప్ప లేదు గాని ఆ సంవత్సరము ప్రధానయాజకుడై యుండెను గనుక యేసు ఆ జనముకొరకును, ఆ జనముకొరకు మాత్రమేగాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును, చావనైయున్నాడని ప్రవచించెను. కాగా ఆ దినమునుండి వారు ఆయనను చంప నాలోచించుచుండిరి. కాబట్టి యేసు అప్పటినుండి యూదులలో బహిరంగముగా సంచరింపక, అక్కడనుండి అరణ్యమునకు సమీప ప్రదేశములోనున్న ఎఫ్రాయిమను ఊరికి వెళ్లి, అక్కడ తన శిష్యులతోకూడ ఉండెను. మరియు యూదుల పస్కాపండుగ సమీపమై యుండెను గనుక అనేకులు తమ్మునుతాము శుద్ధిచేసికొనుటకై పస్కా రాకమునుపే పల్లెటూళ్లలోనుండి యెరూషలేమునకు వచ్చిరి. వారు యేసును వెదకుచు దేవాలయములో నిలువబడి–మీకేమి తోచుచున్నది? ఆయన పండుగకు రాడా యేమి? అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. ప్రధానయాజకులును పరిసయ్యులును ఆయన ఎక్కడ ఉన్నది ఎవనికైనను తెలిసియున్నయెడల తాము ఆయనను పట్టుకొన గలుగుటకు తమకు తెలియజేయవలెనని ఆజ్ఞాపించి యుండిరి.
అధ్యాయము 44
కాబట్టి యేసు తాను మృతులలోనుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కాపండుగకు ఆరు దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను; లాజరు ఆయనతోకూడ భోజనమునకు కూర్చున్నవారిలో ఒకడు. అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర యెత్తు తీసికొని, యేసు పాదములకు పూసి తన తలవెండ్రుకలతో ఆయన పాదములు తుడిచెను; ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనైయున్న ఇస్కరియోతు యూదా యీ అత్తరెందుకు మూడు వందల దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. వాడీలాగు చెప్పినది బీదలమీద శ్రద్ధకలిగి కాదుగాని వాడు దొంగయైయుండి, తన దగ్గర డబ్బు సంచియుండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను గనుక ఆలాగు చెప్పెను. కాబట్టి యేసు–నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీని నుంచుకొననియ్యుడి; బీదలు ఎల్లప్పుడును మీతోకూడ ఉందురుగాని నేనెల్లప్పుడు మీతో ఉండనని చెప్పెను. కాబట్టి యూదులలో సామాన్యజనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలిసికొని, యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలోనుండి ఆయన లేపిన లాజరును కూడ చూడవచ్చిరి. అతనినిబట్టి యూదులలో అనేకులు తమవారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి గనుక ప్రధానయాజకులు లాజరును కూడ చంప నాలోచనచేసిరి.
వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే బేతనియ అను గ్రామములకు వచ్చినప్పుడు, ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ యెదుటనున్న గ్రామమునకు వెళ్లుడి; అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడియున్న యొక గాడిద పిల్ల కనబడును; దానిమీద ఏ మనుష్యుడును ఎప్పుడును కూర్చుండ లేదు; దానిని విప్పి, తోలుకొని రండి. ఎవడైనను– మీరెందుకు ఈలాగు చేయుచున్నారని మిమ్ము నడిగినయెడల–అది ప్రభువునకు కావలసియున్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. వారు వెళ్లగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడియున్న గాడిద పిల్ల యొకటి వారికి కనబడెను; దానిని విప్పుచుండగా, అక్కడ నిలిచియున్న వారిలో కొందరు– మీరేమి చేయుచున్నారు? గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారినడిగిరి. అందుకు శిష్యులు, యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి.వారు ఆ గాడిదపిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి, తమ బట్టలు దానిపై వేయగా ఆయన దానిమీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగుననుపరచిరి, కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలనుపరచిరి. ఒలీవలకొండనుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్లుచుండినవారును వెనుక వచ్చుచుండినవారును –దావీదు కుమారునికి జయము ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి.
ఆ పండుగకు వచ్చిన బహుజనసమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని . ఖర్జూరపుమట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి –జయము, ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలురాజు స్తుతింపబడునుగాక అని కేకలువేసిరి. –సీయోను కుమారీ, భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిదపిల్లమీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడినప్రకారము ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు గాని యేసు మహిమ పరచబడినప్పుడు అవి ఆయననుగూర్చి వ్రాయబడెననియు, వారాయనకు వాటినిచేసిరనియు జ్ఞాపకమునకు తెచ్చుకొనిరి. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు–బోధకుడా, నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి–వీరు ఊరకుండినయెడల ఈ రాళ్లు కేకలు వేయునని మీతో చెప్పుచున్నాననెను. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు– మన ప్రయత్నములెట్లు నిష్ప్రయోజనమై పోయినవో చూడుడి. ఇదిగో లోకము ఆయనవెంటపోయినదని చెప్పుకొనిరి.
ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు–ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము–ఈయన గలిలయలోని నజరేతువాడగు ప్రవక్తయైన యేసు అని చెప్పిరి. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై యేడ్చి నీవును ఈ నీ దినమందైనను సమాధానసంబంధమైన సంగతులను తెలిసికొనినయెడల నీకెంతో మేలు; గాని యిప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడియున్నవి. (ప్రభువు) నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టు గట్టు కట్టి ముట్టడివేసి, అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి, నీలోనున్న నీ పిల్లలతోకూడ నిన్ను నేల కలిపి నీలో రాతిమీద రాయి నిలిచియుండ నియ్యని దినములు వచ్చునని చెప్పెను. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయములో ప్రవేశించి, చుట్టు సమస్తమును చూచి, సాయంకాలమైనందున పండ్రెండుమందితోకూడ బేతనియకు వెళ్లెను.
మరునాడు వారు బేతనియనుండి వెళ్లుచుండగా ఆయన ఆకలిగొని ఆకులుగల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి, దానిమీద ఏమైనను దొరకునేమో అని వచ్చెను. దానియొద్దకు వచ్చి చూడగా, ఆకులు తప్ప మరేమియు కనబడలేదు; ఏలయనగా అది అంజూరపు పండ్లకాలము కాదు. అందుకాయన–ఇకమీదట ఎన్నటికిని నీ పండ్లు ఎవరును తినకుందురు గాక అని చెప్పెను ; ఇది ఆయన శిష్యులు వినిరి. తక్షణమే ఆ అంజూరపుచెట్టు ఎండిపోయెను. శిష్యులదిచూచి ఆశ్చర్యపడి–అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయెనని చెప్పుకొనిరి.
వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయములో ప్రవేశించి, దేవాలయములో క్రయ విక్రయములు చేయువారిని వెళ్లగొట్ట నారంభించి, రూకలు మార్చువారి బల్లలను, గువ్వలమ్మువారి పీటలను పడద్రోసి దేవాలయము గుండ ఏపాత్రయైనను ఎవనిని తేనియ్యకుండెను. మరియు ఆయన బోధించుచు –నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరమనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరనెను. శాస్త్రులును ప్రధానయాజకులును ఆ మాట విని, జనసమూహమంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూచి, ఆయనకు భయపడి, ఆయన నేలాగు సంహరించుదమా అని సమయము చూచుచుండిరి. గ్రుడ్డివారును కుంటివారును దేవాలయములో ఆయనయొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరచెను. కాగా ప్రధానయాజకులును శాస్త్రులును ఆయన చేసిన వింతలను, –దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపముతో మండిపడి –వీరు చెప్పుచున్నది వినుచున్నావా? అని ఆయనను అడిగిరి. అందుకు యేసు– వినుచున్నాను; బాలురయొక్కయు చంటిపిల్లలయొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసితివి అను మాట మీరెన్నడును చదువలేదా? అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణమునుండి బయలుదేరి బేతనియకు వెళ్లి అక్కడ బసచేసెను.
అధ్యాయము 45
ప్రొద్దునవారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపుచెట్టు వేళ్లు మొదలుకొని యెండియుండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని–బోధకుడా, యిదిగో నీవు శపించిన అంజూరపుచెట్టు ఎండిపోయెనని ఆయనతో చెప్పెను. అందుకు యేసు వారితో ఇట్లనెను–మీరు దేవునియందు విశ్వాసముంచుడి. –మీరు విశ్వాసముగలిగి సందేహపడకుండినయెడల, ఈ అంజూరపుచెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుదువు గాకని చెప్పినయెడల, ఆలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి; అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మీకు ఒకనిమీద విరోధ మేమైనను కలిగియున్నయెడల, మీరు నిలువబడి ప్రార్థన చేయునప్పుడెల్లను వాని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును.
ఆయన ప్రతిదినమును దేవాలయములో బోధించుచున్నప్పుడు, ప్రధానయాజకులును శాస్త్రులును ప్రజలలో ప్రధానులును ఆయనను నాశనముచేయ జూచుచుండిరి గాని ప్రజలందరు ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని యుండిరి గనుక ఏమి చేయవలెనో వారికి తోచలేదు.ఆ దినములలో ఒకనాడు ఆయన దేవాలయములో ప్రజలకు బోధించుచు సువార్తను ప్రకటించుచున్నప్పుడు ప్రధానయాజకులును శాస్త్రులును పెద్దలతోకూడ ఆయన మీదికివచ్చి నీవు ఏ అధికారమువలన ఈ కార్యములు చేయుచున్నావు? వీటిని చేయుటకు ఈ యధికారము నీకెవడిచ్చెనని అడిగిరి. అందుకు యేసు–నేనును మిమ్మును ఒక మాట అడిగెదను, నాకు ఉత్తరమియ్యుడి, అప్పుడు నేను ఏ అధికారమువలన వీటిని చేయుచున్నానో అది మీతో చెప్పుదును. యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకమునుండి కలిగినదా మనుష్యులనుండి కలిగినదా? నాకు ఉత్తరమియ్యుడని చెప్పెను. అందుకు వారు–మనము పరలోకమునుండి కలిగినదని చెప్పినయెడల, ఆయన – ఆలాగైతే మీరు ఎందుకతని నమ్మలేదని అడుగును; మనుష్యులవలన కలిగినదని చెప్పినయెడల ప్రజలందరు మనలను రాళ్లతో కొట్టుదురని ; జనులకు భయపడుచున్నాము; అందరు యోహానును ప్రవక్త అని యెంచుచున్నారని తమలో తాము ఆలోచించుకొని–', –ఆ సంగతి మాకు తెలియదని యేసునకు ఉత్తరమిచ్చిరి. అందుకు యేసు–ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నానో అదియు నేను మీతో చెప్పననెను.
ఆ పండుగలో ఆరాధింపవచ్చినవారిలో కొందరు గ్రీసుదేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బేత్సయిదా వాడైన ఫిలిప్పునొద్దకు వచ్చి–అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా ఫిలిప్పు వచ్చి అంద్రెయతో చెప్పెను, అంద్రెయయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను–మనుష్యకుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చియున్నది. గోధుమగింజ భూమిలో పడి చావకుండినయెడల అది ఒంటిగానే యుండును; అది చచ్చినయెడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవముకొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు నన్ను సేవించినయెడల నన్ను వెంబడింపవలెను; అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును; ఒకడు నన్ను సేవించినయెడల నా తండ్రి అతని ఘనపరచును.
ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది; నేనేమందును?–తండ్రీ, యీ గడియ తటస్థింపకుండ నన్ను తప్పించుము; అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చితిని; తండ్రీ, నీ నామము మహిమపరచుమని చెప్పెను. అంతట–నేను దానిని మహిమపరచితిని, మరల మహిమ పరతును అని యొక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జనసమూహము–ఉరిమెను అనిరి. మరికొందరు–దేవదూత ఒకడు ఆయనతో మాటలాడెననిరి. అందుకు యేసు– ఈ శబ్దము నాకొరకు రాలేదు, మీకొరకే వచ్చెను. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును; నేను భూమిమీదనుండి పైకెత్తబడినయెడల అందరిని నాయొద్దకు ఆకర్షించుకొందునని చెప్పెను. తాను ఏవిధముగా మరణము పొందవలసి యుండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పెను.
జనసమూహము–క్రీస్తు ఎల్లప్పుడు ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట వింటిమి. మనుష్యకుమారుడు పైకెత్తబడవలెనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి? మనుష్య కుమారుడగు ఈయన ఎవరని ఆయన నడిగిరి. అందుకు యేసు–ఇంక కొంతకాలము వెలుగు మీమధ్య ఉండును; చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగనే నడువుడి; చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవుచున్నాడో యెరుగడు. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగనే వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పెను. యేసు ఈ మాటలు చెప్పి వెళ్లి వారికి కనబడకుండ దాగియుండెను. ఆయన వారి యెదుట యిన్ని సూచక క్రియలు చేసినను వారాయనయందు విశ్వాసముంచరైరి. –ప్రభువా, మా వర్తమానము నమ్మినవాడెవడు? ప్రభువు యొక్క బాహువు ఎవనికి బయలుపరచబడెను? అని ప్రవక్తయైన యెషయా చెప్పిన వాక్యము నెరవేరునట్లు ఇది జరిగెను. ఇందుచేత వారు నమ్మలేక పోయిరి, ఏలయనగా–వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని నావలన స్వస్థపరచబడకుండునట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగజేసి వారి హృదయము కఠినపరచెను అని యెషయా మరియొక చోట చెప్పెను. యెషయా ఆయన మహిమను చూచినందున ఆయననుగూర్చి ఈ మాటలు చెప్పెను. అయినను అధికారులలో కూడ అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరిగాని, సమాజములోనుండి వెలివేయబడుదుమేమో యని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పుకంటె మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి.
అంతట యేసు బిగ్గరగా ఇట్లనెను–నాయందు విశ్వాసముంచువాడు నాయందు కాదు నన్ను పంపినవానియందే విశ్వాసముంచుచున్నాడు. నన్ను చూచువాడు నన్ను పంపినవానినే చూచుచున్నాడు. నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి యుండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చియున్నాను. ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండినయెడల నే నతనికి తీర్పుతీర్చను; నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చితిని. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు; నేను చెప్పినమాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. ఏలయనగా నా అంతట నేనే మాటలాడలేదు; నేను ఏమనవలెనో యేమి మాటలాడవలెనో దానినిగూర్చి నన్ను పంపిన తండ్రియే నాకాజ్ఞ యిచ్చియున్నాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్యజీవమని నేనెరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాననెను.
అధ్యాయము 46
ఆయన ఉపమానరీతిగా వారికి బోధింపనారంభించెను; మీకేమి తోచుచున్నది? ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండిరి. అతడు మొదటివానియొద్దకు వచ్చి కుమారుడా, నేడు పోయి ద్రాక్షతోటలో పని చేయుమని చెప్పగా వాడు పోను అని యుత్తరమిచ్చెను గాని పిమ్మట మనస్సు మార్చుకొని పోయెను. అతడు రెండవవానియొద్దకు వచ్చి ఆప్రకారమే చెప్పగా వాడు అయ్యా, పోదుననెను గాని పోలేదు. ఈ యిద్దరిలో ఎవడు తండ్రి యిష్టప్రకారము చేసినవాడని వారి నడిగెను. అందుకు వారు–మొదటివాడే అనిరి. యేసు సుంకరులును వేశ్యలును మీకంటె ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను నీతి మార్గమున మీయొద్దకు వచ్చెను, మీరతనిని నమ్మలేదు; అయితే సుంకరులును వేశ్యలును అతనిని నమ్మిరి; మీరు అది చూచియు అతనిని నమ్మునట్లు పశ్చాత్తాపపడక పోతిరి.
మరియొక ఉపమానము వినుడి. ఇంటి యజమానుడొకడుండెను. అతడు ద్రాక్షతోట నాటించి, దాని చుట్టు కంచె వేయించి, అందులో ద్రాక్షలతొట్టి తొలిపించి, గోపురముకట్టించి, కాపులకు దాని గుత్తకిచ్చి, దేశాంతరము పోయెను. పంటకాలమందు ఆ కాపుల నుండి ద్రాక్షతోట పండ్లలో తన భాగము తీసికొని వచ్చుటకు, కాపులయొద్దకు అతడు ఒక దాసునిపంపగా వారు వాని పట్టుకొని కొట్టి, వట్టిచేతులతో పంపివేసిరి. మరల అతడు మరియొక దాసుని వారియొద్దకు పంపగా, వారు వాని తల గాయముచేసి అవమానపరచిరి. మరల నతడు మూడవవాని పంపగా వారు వానిని గాయపరచి వెలుపలికి త్రోసివేసిరి. తుదకు నా కుమారుని సన్మానించెదరనుకొని తన కుమారుని వారి యొద్దకు పంపెను. అయినను ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడు; ఇతనిని చంపి ఇతని స్వాస్థ్యము తీసికొందము రండని తమలోతాము చెప్పుకొని అతని పట్టుకొని ద్రాక్షతోట వెలుపట పడవేసి చంపిరి.
కాబట్టి ఆ ద్రాక్షతోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులనేమి చేయుననెను. అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి, వాటివాటి కాలములయందు తనకు పండ్లను చెల్లించునట్టి ఇతరకాపులకు ఆ ద్రాక్షతోట గుత్త కిచ్చునని ఆయనతో చెప్పిరి. మరియు యేసు వారిని చూచి –ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను. ఇది ప్రభువువలననే కలిగెను. ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో ఎన్నడును చదువ లేదా? కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్దనుండి తొలగింపబడి, దాని ఫలమిచ్చు జనులకియ్యబడునని మీతో చెప్పుచున్నాను. ఆయన చెప్పగా వారు విని– అట్లు కాకపోవును గాకనిరి. ఆయన వారిని చూచి– ఆలాగైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను అని వ్రాయబడిన మాట ఏమిటి? ఈ రాతిమీద పడు ప్రతివాడును తునకలై పోవును; గాని అది ఎవనిమీద పడునో వానిని నలిచేయుననెను. ప్రధానయాజకులును పరిసయ్యులును ఆయన చెప్పిన ఉపమానములను విని, తమ్మునుగూర్చియే చెప్పెనని గ్రహించి ఆయనను పట్టుకొన సమయము చూచుచుండిరి గాని జనులందరు ఆయనను ప్రవక్తయని యెంచిరి గనుక వారికి భయపడిరి.
యేసు వారికి ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమానరీతిగా ఇట్లనెను. పరలోకరాజ్యము, తన కుమారునికి పెండ్లి విందుచేసిన యొక రాజును పోలియున్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడినవారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లక పోయిరి. కాగా అతడు–ఇదిగో నా విందు సిద్ధపరచియున్నాను; ఎద్దులును క్రొవ్విన పశువులును వధింపబడినవి; అంతయు సిద్ధముగా ఉన్నది; పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని వారు లక్ష్యము చేయక, ఒకడు తన పొలమునకును మరియొకడు తన వర్తకమునకును వెళ్లిరి. తక్కినవారు అతని దాసులను పట్టుకొని అవమానపరచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి, ఆ నరహంతకులను సంహరించి, వారి పట్టణము తగలబెట్టించెను. అప్పుడతడు–పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది గాని పిలువబడినవారు పాత్రులు కారు. గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారినందరిని పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డ వారినేమి మంచివారినేమి తమకు కనబడినవారినందరిని పోగుచేసిరి గనుక విందుకు వచ్చినవారితో ఆ పెండ్లి శాల నిండెను. రాజు కూర్చున్నవారిని చూడ లోపలికి వచ్చి, అక్కడ పెండ్లివస్త్రము ధరించుకొనని యొకని చూచి స్నేహితుడా, పెండ్లి వస్త్రములేక ఇక్కడి కేలాగు వచ్చితివని అడుగగా వాడు మౌనియైయుండెను. అంతట రాజు వీని కాళ్లు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను. కాగా పిలువబడినవారు అనేకులు, ఏర్పరచబడినవారు కొందరే అని చెప్పెను.
అప్పుడు పరిసయ్యులు వెళ్లి, మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని ఆలోచనచేయుచు బోధకుడా, నీవు సత్యవంతుడవై యుండి, దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవనిని లక్ష్యపెట్టవనియు, మోమాటము లేనివాడవనియు ఎరుగుదుము. నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా? కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతోకూడ తమ శిష్యులను ఆయనయొద్దకు పంపిరి. యేసు వారి చెడుతనమెరిగి వేషధారులారా, నన్నెందుకు శోధించుచున్నారు? పన్నురూక యొకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారాయనయొద్దకు ఒక దేనారము తెచ్చిరి. అప్పుడాయన ఈ రూపమును పైవ్రాతయు ఎవరివని వారినడుగగా వారు–కైసరువనిరి. అందుకాయన–ఆలాగైతే కైసరువి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పెను. వారు ప్రజలయెదుట ఈ మాటలో తప్పు పట్ట నేరక ఆయన ప్రత్యుత్తరమునకు ఆశ్చర్యపడి ఊరకుండిరి.
అధ్యాయము 47
పునరుత్థానము లేదని చెప్పెడి సద్దూకయ్యులు కొందరు ఆయనయొద్దకు వచ్చి ఆయనను ఇట్లడిగిరి. –బోధకుడా, భార్య బ్రదికియుండగా ఒకని సహోదరుడు సంతానము లేక చనిపోయినయెడల, అతని సహోదరుడతని భార్యను పెండ్లిచేసికొని తన సహోదరునికి సంతానము కలుగజేయవలెనని మోషే మనకు వ్రాసి యిచ్చెను. యేడుగురు సహోదరులుండిరి. మొదటివాడొక స్త్రీని పెండ్లి చేసికొని సంతానము లేక చనిపోయెను. రెండవవాడును మూడవవాడును ఆమెను పెండ్లిచేసికొనిరి. ఆప్రకారమే యేడుగురును ఆమెను పెండ్లాడి సంతానములేకయే చనిపోయిరి. పిమ్మట ఆ స్త్రీయు చనిపోయెను. పునరుత్థానమందు వారిలో ఎవనికి ఆమె భార్యగా ఉండును? ఆమె ఆ యేడుగురికిని భార్య ఆయెను గదా అని అడిగిరి. అందుకు యేసు–మీరు లేఖనములనుగాని దేవుని శక్తినిగాని యెరుగక పోవుటవలననే పొరబడుచున్నారు. ఈ లోకపు జనులు పెండ్లిచేసికొందురు, పెండ్లికియ్యబడుదురు గాని పరమును మృతుల పునరుత్థానమును పొందుటకు యోగ్యులని యెంచబడినవారు పెండ్లిచేసికొనరు, పెండ్లికియ్యబడరు. వారు పునరుత్థానములో పాలివారైయుండి, దేవదూత సమానులును దేవుని కుమారులునై యుందురు గనుక వారికను చావనేరరు. వారు లేచెదరని మృతులనుగూర్చిన సంగతి మోషే గ్రంథమందలి పొదను గురించిన భాగములో మీరు చదువలేదా? ఆ భాగములో దేవుడు–నేను అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడనని అతనితో చెప్పెను. ఆయన సజీవుల దేవుడు గాని మృతుల దేవుడు కాడు. కావున మీరు బహుగా పొరబడుచున్నారని వారితో చెప్పెను. గనుక శాస్త్రులలో కొందరు–బోధకుడా, నీవు యుక్తముగా చెప్పితివనిరి. జనులది విని ఆయన బోధకాశ్చర్యపడిరి.
ఆయన సద్దూకయ్యుల నోరు మూయించెనని పరిసయ్యులు విని కూడివచ్చిరి. శాస్త్రులలో ఒకడు వచ్చి, వారు తర్కించుట విని, ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చెనని గ్రహించి–ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనదేదని ఆయన నడిగెను. అందుకు యేసు – ప్రధానమైనది ఏదనగా – ఓ ఇశ్రాయేలూ, వినుము; మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననునది ప్రధానమైన ఆజ్ఞ.ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెననునది రెండవ ఆజ్ఞ; వీటికంటె ముఖ్యమైన ఆజ్ఞ మరేదియు లేదని అతనితో చెప్పెను ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమై యున్నవని అతనితో చెప్పెను. ఆ శాస్త్రి–బోధకుడా, బాగుగా చెప్పితివి; ఆయన అద్వితీయుడనియు, ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. పూర్ణహృదయముతోను, పూర్ణవివేకముతోను, పూర్ణబలముతోను, ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్నువలె తన పొరుగువాని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటెను బలులకంటెను అధికమని ఆయనతో చెప్పెను. అతడు వివేకముగా నుత్తరమిచ్చెనని యేసు గ్రహించి–నీవు దేవుని రాజ్యమునకు దూరముగ లేవని అతనితో చెప్పెను. ఆ తరువాత ఎవడును ఆయనను ఏ ప్రశ్నయు అడుగ తెగింపలేదు.
ఒకప్పుడు పరిసయ్యులు కూడియుండగా యేసు వారిని చూచి క్రీస్తునుగూర్చి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగెను. వారు– ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా ఉంచువరకు నీవు నాకుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను.అని కీర్తనల గ్రంథములో దావీదే చెప్పియున్నాడు. దావీదు ఆయనను ప్రభువని చెప్పినయెడల ఆయన ఏలాగు అతని కుమారుడగునని చెప్పెను. ఎవడును మారుమాట చెప్పలేకపోయెను. మరియు ఆ దినమునుండి ఎవడును ఆయనను ఒక ప్రశ్నయు అడుగ తెగింపలేదు. సామాన్యజనులు ఆయన మాటలు సంతోషముతో వినుచుండిరి.
ఆయన మాటలాడుచుండగా ఒక పరిసయ్యుడు తనతోకూడ భోజనము చేయుమని ఆయనను పిలువగా ఆయన లోపలికి వెళ్లి భోజనపంక్తిని కూర్చుండెను. ఆయన భోజనమునకు ముందుగా స్నానము చేయలేదని ఆ పరిసయ్యుడు చూచి ఆశ్చర్యపడెను. అందుకు ప్రభువిట్లనెను–పరిసయ్యులైన మీరు గిన్నెయు పళ్లెమును వెలుపల శుద్ధి చేయుదురు గాని మీ అంతరంగము దోపుతోను చెడు తనముతోను నిండియున్నది. అవివేకులారా, వెలుపలి భాగమును చేసినవాడు లోపటి భాగమును చేయలేదా? కాగా మీకు కలిగినవి ధర్మము చేయుడి, అప్పుడు మీ కన్నియు శుద్ధిగా ఉండును. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకఱ్ఱలోను పదియవ వంతు చెల్లించి, ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను, అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి; వాటిని మానక వీటిని చేయవలసి యుండెను. అంధులైన మార్గదర్శకులారా, దోమలేకుండునట్లు వడియగట్టి ఒంటెను మ్రింగువారు మీరే.అయ్యో పరిసయ్యులారా, మీరు సమాజమందిరములలో అగ్రపీఠములను సంతవీధులలో వందనములను కోరుచున్నారు. అయ్యో, మీరు కనబడని సమాధులవలె ఉన్నారు; వాటిమీద నడుచు మనుష్యులు (అవి సమాధులని) యెరుగరనెను.
అప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడొకడు – బోధకుడా, యీలాగు చెప్పి మమ్మును కూడ నిందించుచున్నావని ఆయనతో చెప్పగా, ఆయన–అయ్యో, ధర్మశాస్ర్తప్రదేశకులారా, మోయ శక్యముకాని బరువులను మీరు మనుష్యులమీద మోపుదురు గాని మీరు ఒక వ్రేలితోనైనను ఆ బరువులను ముట్టరు. అయ్యో, ధర్మశాస్ర్తప్రదేశకులారా, మీరు జ్ఞానమను తాళపుచెవిని ఎత్తికొనిపోతిరి; మీరును లోపల ప్రవేశింపరు, ప్రవేశించువారిని అడ్డగింతురని చెప్పెను. ప్రజలందరు వినుచుండగా ఆయన ఇట్లనెను–శాస్త్రులనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు నిలువుటంగీలు ధరించుకొని తిరుగగోరుచు సంతవీధులలో వందనములను, సమాజమందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానములను కోరుదురు. వారు విధవరాండ్ర యిండ్లను దిగమ్రింగుచు, మాయవేషముగా దీర్ఘప్రార్థనలు చేయుదురు. వారు మరి విశేషముగా శిక్ష పొందుదురని తన శిష్యులతో చెప్పెను.
అధ్యాయము 48
అప్పుడు యేసు జనసమూహములతోను తన శిష్యులతోను ఇట్లనెను –శాస్త్రులును పరిసయ్యులును మోషే పీఠమందు కూర్చుండువారు గనుక–వారు మీతో చెప్పువాటినన్నిటిని అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియలచొప్పున చేయకుడి; వారు చెప్పుదురే గాని చేయరు. మనుష్యులకు కనబడునిమిత్తము తమ పనులన్నియు చేయుదురు; తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు; విందులలో అగ్రస్థానములను సమాజమందిరములలో అగ్రపీఠములను సంత వీధులలో వందనములను మనుష్యులచేత బోధకులని పిలువబడుటయు కోరుదురు. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరు సహోదరులు. మరియు భూమిమీద ఎవనికైనను తండ్రి అని పేరుపెట్టవద్దు; ఒక్కడే మీ తండ్రి; ఆయన పరలోకమందున్నాడు. మరియు మీరు గురువులని పిలువబడవద్దు; క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీలో అందరికంటె గొప్పవాడు మీకు పరిచారకుడై యుండవలెను. తన్నుతాను హెచ్చించు కొనువాడు తగ్గింపబడును; తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును.
అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుష్యులయెదుట పరలోకరాజ్యమును మూయుదురు; మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనియ్యరు. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టివచ్చెదరు; అతడు కలిసినప్పుడు అతని మీకంటె రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు.అయ్యో, అంధులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయముతోడని ఒట్టుపెట్టుకొంటె అందులో ఏమియు లేదు గాని దేవాలయములోని బంగారముతోడని ఒట్టు పెట్టుకొంటె వాడు దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది? బంగారమా, బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? మరియు బలిపీఠముతోడని యొకడు ఒట్టుపెట్టుకొంటె, అందులో ఏమియు లేదు గాని, దాని పైనుండు అర్పణముతోడని ఒట్టుపెట్టుకొంటె దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది? అర్పణమా, అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా? బలిపీఠముతోడని ఒట్టుపెట్టుకొనువాడు, దాని తోడనియు దాని పైనుండు వాటన్నిటి తోడనియు ఒట్టు పెట్టుకొనుచున్నాడు. మరియు దేవాలయము తోడని ఒట్టుపెట్టుకొనువాడు, దాని తోడనియు అందులో నివసించువాని తోడనియు ఒట్టుపెట్టుకొనుచున్నాడు. మరియు ఆకాశముతోడని ఒట్టుపెట్టుకొనువాడు దేవుని సింహాసనముతోడనియు దానిపైని కూర్చున్నవాని తోడనియు ఒట్టుపెట్టుకొనుచున్నాడు.
అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్లెమును వెలుపట శుద్ధిచేయుదురు గాని అవి లోపల దోపుతోను అజితేంద్రియత్వముతోను నిండియున్నవి. గ్రుడ్డిపరిసయ్యుడా, గిన్నెయు పళ్లెమును వెలుపల శుద్ధియగునట్టుగా ముందు వాటిలోపల శుద్ధిచేయుము. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నముకొట్టిన సమాధులను పోలి యున్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చినవారి యెముకలతోను సమస్త కల్మషముతోను నిండియున్నవి. ఆలాగే మీరు వెలుపల మనుష్యులకు నీతిమంతులుగా నగపడుచున్నారు గాని, లోపల వేషధారణతోను అక్రమముతోను నిండి యున్నారు.
అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు, నీతిమంతుల గోరీలను శృంగారించుచు మనము మన పితరుల దినములలో ఉండినయెడల ప్రవక్తల మరణ విషయములో వారితో పాలివారమై యుండక పోదుమని చెప్పుకొందురు. మీపితరులు చంపిన. కావున మీరు సాక్షులై మీపితరుల కార్యములకు సమ్మతించుచున్నారు; వారు ప్రవక్తలను చంపిరి, మీరు వారి సమాధులు కట్టించుదురు. అందువలననే మీరు ప్రవక్తలను చంపినవారి కుమారులై యున్నారని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకొనుచున్నారు. మీరును మీపితరుల పరిమాణము పూర్తి చేయుడి. సర్పములారా, సర్పసంతానమా, నరకశిక్షను మీరేలాగు తప్పించుకొందురు? అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను జ్ఞానులను శాస్త్రులను పంపుచున్నాను; మీరు వారిలో కొందరిని చంపి సిలువవేయుదురు, కొందరిని మీ సమాజమందిరములలో కొరడాలతో కొట్టి, పట్టణమునుండి పట్టణమునకు తరుముదురు.
నీతిమంతుడైన హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును, దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జెకర్యా రక్తమువరకు భూమిమీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. ఇవన్నియు ఈ తరమువారిమీదికి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీయొద్దకు పంపబడినవారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కలక్రింది కేలాగు చేర్చుకొనునో ఆలాగే నేనును నీ పిల్లలను ఎన్నోమారులు చేర్చుకొనవలెనని యుంటిని గాని మీరు ఒల్లకపోతిరి. ఇదిగో మీ యిల్లు మీకు విడువబడియున్నది. ఇదిమొదలుకొని– ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాకని మీరు చెప్పువరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను.
అధ్యాయము 49
ఆయన కానుకపెట్టె యెదుట కూర్చుండి, జనసమూహము ఆ కానుకపెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతులైనవారనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ఒక బీద విధవరాలు వచ్చి రెండు కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి–కానుకపెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటె ఈ బీద విధవరాలు ఎక్కువ వేసెనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరు తమకు కలిగిన సమృద్ధిలోనుండి వేసిరి గాని, యీమె తన లేమిలో తనకు కలిగినదంతయు, అనగా తన జీవనమంతయు వేసెనని చెప్పెను.
'యేసు దేవాలయమునుండి బయలుదేరి వెళ్లుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి. కొందరు–ఇది అందమైన రాళ్లతోను అర్పితములతోను శృంగారింపబడియున్నదని దేవాలయమునుగూర్చి, మాటలాడుచుండగా, అందుకాయన – మీరు ఇవన్నియు చూచుచున్నారు గదా; రాతిమీద రాయి యొకటియైనను ఇక్కడ నిలిచియుండకుండ పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఆయన దేవాలయము ఎదుట ఒలీవల కొండమీద కూర్చుండియుండగా, పేతురు యాకోబు యోహాను అంద్రెయ అను వారు ఆయనను చూచి, నీ రాకడకును ఈ యుగసమాప్తికిని సూచనలేవి? మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లు చెప్పసాగెను. యేసు వారితో ఇట్లు చెప్పసాగెను–ఎవడును మిమ్మును మోసపుచ్చకుండ చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి–నేనే ఆయననని చెప్పి అనేకులను మోసపుచ్చెదరు. మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినునప్పుడు కలవరపడకుడి; ఇవి జరుగవలసియున్నవి గాని అంతము వెంటనే రాదు. జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును; అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్లును కరవులును తటస్థించును, ఆకాశమునుండి మహా భయోత్పాతములును గొప్ప సూచనలును పుట్టును. అక్కడక్కడ కరవులును భూకంపములును కలుగును; ఇవన్నియు వేదనలకు ప్రారంభము.
మిమ్మునుగూర్చి మీరే జాగ్రత్తపడుడి. వారు మిమ్మును సభల కప్పగించెదరు; మిమ్మును సమాజమందిరములలో కొట్టించెదరు; మీరు వారికి సాక్ష్యార్థమై అధిపతుల యెదుటను రాజుల యెదుటను నా నిమిత్తము నిలువబడెదరు. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలుచేసి చంపెదరు; మీరు నా నామము నిమిత్తము సకల జనములచేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి, యొకనినొకడు అప్పగించి యొకనినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు; అక్రమము విస్తరించుటచేత అనేకుల ప్రేమ చల్లారును. సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును. 'వారు మిమ్మును అప్పగించుటకు కొనిపోవునప్పుడు మీరు–ఏమి చెప్పుదుమా అని ముందుగా చింతింపకుడి, ఆ గడియలోనే మీకేది ఇయ్యబడునో అదే చెప్పుడి; చెప్పువాడు పరిశుద్ధాత్మయే గాని మీరు కారు. ' ఇది సాక్ష్యార్థమై మీకు సంభవించును. మీ విరోధులందరు ఎదురాడుటకును, కాదనుటకును వీలుకాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. 'తలిదండ్రులచేతను సహోదరులచేతను బంధువులచేతను స్నేహితులచేతను మీరు అప్పగింపబడుదురు; వారు మీలో కొందరిని చంపింతురు; సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని, మరణమున కప్పగింతురు; కుమారులు తలిదండ్రులమీద లేచి వారిని చంపింతురు; నా నామము నిమిత్తము అందరిచేత మీరు ద్వేషింపబడుదురు; అంతమువరకు సహించినవాడే రక్షణ పొందును. గాని మీ తల వెండ్రుకలలో ఒకటైనను నశింపదు. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు.
యెరూషలేము దండ్లచేత చుట్టబడుట మీరు చూచునప్పుడు దాని నాశనము సమీపమైయున్నదని తెలిసికొనుడి. కాబట్టి ప్రవక్తయైన దానియేలుద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయవస్తువు పరిశుద్ధస్థలమందు నిలుచుట మీరు చూడగానే – చదువువాడు గ్రహించుగాక– యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను. మిద్దెమీద ఉండువాడు ఇంటిలోనుండి ఏదైనను తీసికొనిపోవుటకై దిగి అందులో ప్రవేశింపకూడదు; పొలములో ఉండువాడు తన వస్త్రము తీసికొనిపోవుటకు ఇంటిలోనికి తిరిగి రాకూడదు. లేఖనములలో వ్రాయబడినవన్నియు నెరవేరుటకై అవి ప్రతి దండన దినములు. ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చువారికిని శ్రమ. భూమిమీద మిక్కిలి యిబ్బందియు ఈ ప్రజలమీద కోపమును వచ్చును. . వారు కత్తివాత కూలుదురు; చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనములమధ్యకు పోవుదురు; అన్యజనముల కాలములు సంపూర్ణమగువరకు యెరూషలేము అన్యజనములచేత త్రొక్కబడును. అప్పుడు మహా శ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతిదినమందైనను సంభవింపకుండవలెనని ప్రార్థించుడి. ' అవి శ్రమగల దినములు; దేవుడు సృజించిన సృష్ట్యాదినుండి ఇదివరకు అంత శ్రమ కలుగ లేదు, ఇక ఎన్నడును కలుగబోదు. ప్రభువు ఆ దినములను తక్కువచేయనియెడల ఏ శరీరియు తప్పించు కొనక పోవును; ఏర్పరచబడినవారి నిమిత్తము, అనగా తాను ఏర్పరచుకొనిన వారినిమిత్తము ఆయన ఆ దినములను తక్కువ చేసెను.
అధ్యాయము 50
కాగా – ఇదిగో క్రీస్తు ఇక్కడ నున్నాడు, అదిగో అక్కడ నున్నాడు అని యెవడైనను మీతో చెప్పినయెడల నమ్మకుడి. ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులును అబద్ధపు ప్రవక్తలును వచ్చి, సాధ్యమైనయెడల ఏర్పరచబడినవారిని మోసపుచ్చుటకై సూచక క్రియలను మహత్కార్యములను అగపరచెదరు. మీరు జాగ్రత్తగా ఉండుడి; ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి యున్నాను.కాబట్టి ఎవరైనను–ఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్లకుడి ఇదిగో లోపలి గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి మెరుపు తూర్పున పుట్టి పడమటివరకు ఏలాగు కనబడునో ఆలాగే మనుష్యకుమారుని రాకడయు నుండును. పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును. ఆ దినములలో ఆ శ్రమతీరిన తరువాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతిని ఇయ్యడు, ఆకాశమునుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదలింపబడును. మరియు సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలును, భూమిమీద సముద్రతరంగముల ఘోషవలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదికి రాబోవుచున్న వాటి విషయమై భయము కలిగి, మనుష్యులు ఎదురుచూచుచు ధైర్యముచెడి కూలుదురు. అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్యకుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి, భూమిమీదనున్న సకల గోత్రములవారు రొమ్ము కొట్టుకొందురు. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశముయొక్క ఈ చివరనుండి ఆ చివరవరకు నలుదిక్కులనుండి ఆయన ఏర్పరచుకొనినవారిని పోగుచేతురు. ఇవి జరుగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తికొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనెను.
అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపుకొమ్మ లేతదై చిగిరించునప్పుడు వసంత కాలము యింక సమీపముగా ఉన్నదని మీకు తెలియును. ఆప్రకారమే మీరీ సంగతులన్నియు జరుగుట చూచునప్పుడు ఆయన సమీపముననే, ద్వారముదగ్గరనే యున్నాడని తెలిసికొనుడి. ఇవన్నియు జరుగువరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు. అయితే ఆ దినమునుగూర్చియు ఆ గడియనుగూర్చియు తండ్రి మాత్రమే (యెరుగును) గాని, యే మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. జాగ్రత్తపడుడి; మెలకువగానుండి ప్రార్థనచేయుడి; ఆ కాలమెప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఒక మనుష్యుడు తన దాసులకు అధికారమిచ్చి, ప్రతివానికి వాని వాని పని నియమించి – మెలకువగా నుండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి, యిల్లు విడిచి దేశాంతరము పోయినట్టే (ఆ కాలము ఉండును.) ఇంటి యజమానుడు ప్రొద్దు గ్రుంకివచ్చునో, అర్ధరాత్రివచ్చునో, కోడికూయునప్పుడు వచ్చునో, తెల్లవారునప్పుడు వచ్చునో, యెప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రబోవుచుండుట చూచునేమో గనుక మీరు మెలకువగా నుండుడి. నేను మీతో చెప్పుచున్నది అందరితోను చెప్పుచున్నాను; మెలకువగా నుండుడనెను. మీ హృదయములు ఒకవేళ తిండివలనను మత్తువలనను ఐహిక విచారములవలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండ మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమియందంతట నివసించు వారందరిమీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరుగబోవు వీటినెల్లను తప్పించుకొని, మనుష్యకుమారుని యెదుట నిలువబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడును ప్రార్థనచేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను. ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయములో బోధించుచు రాత్రివేళ ఒలీవలకొండకు వెళ్లుచు కాలము గడుపుచుండెను. ప్రజలందరు ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయనయొద్దకు పెందలకడ వచ్చుచుండిరి.
పరలోకరాజ్యము, తమ దివిటీలు పట్టుకొని పెండ్లికుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన పదిమంది కన్యకలను పోలియున్నది. వీరిలో అయిదుగురు బుద్ధిలేని వారు, అయిదుగురు బుద్ధిగలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతోకూడ నూనె తీసికొనిపోలేదు. బుద్ధిగలవారు తమ దివిటీలతోకూడ సిద్దెలలో నూనె తీసికొనిపోయిరి. పెండ్లికుమారుడు ఆలస్యము చేయగా వారందరు కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రివేళ– ఇదిగో పెండ్లికుమారుడు, అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరు లేచి తమ దివిటీలను చక్కపరచిరి గాని,బుద్ధిలేని ఆ కన్యకలు– మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియ్యుడని బుద్ధిగలవారి నడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోవుచుండగా పెండ్లికుమారుడు వచ్చెను, అప్పుడు సిద్ధపడి యున్నవారు అతనితోకూడ పెండ్లి విందుకు లోపలికి పోయిరి; అంతట తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి–అయ్యా, అయ్యా, మాకు తలుపు తీయుమని అడుగగా అతడు–మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. ఆ దినమైనను గడియయైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి.
అధ్యాయము 51
(పరలోకరాజ్యము) ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారి కప్పగించినట్లుండును. అతడు ఒకనికి అయిదు తలాంతులను ఒకనికి రెండు, ఒకనికి ఒకటియు ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి, వెంటనే దేశాంతరము పోయెను. అయిదు తలాంతులు తీసికొనినవాడు వెళ్లి వాటితో వ్యాపారము చేసి, మరి అయిదు తలాంతులు సంపా దించెను. ఆలాగుననే రెండు తీసికొనినవాడు మరి రెండు సంపాదించెను. అయితే ఒక తలాంతు తీసికొనినవాడు వెళ్లి, భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. బహు కాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారియొద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు అయిదు తలాంతులు తీసికొనినవాడు మరి అయిదు తలాంతులు తెచ్చి అయ్యా, నీవు నాకు అయిదు తలాంతులప్పగించితివే; అవియుగాక మరి యయిదు తలాంతులు సంపాదించితినని చెప్పెను. అతని యజమానుడు భళా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైనవాటిమీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలుపొందుమని అతనితో చెప్పెను. ఆలాగే రెండు తలాంతులు తీసికొనినవాడు వచ్చి అయ్యా, నీవు నాకు రెండు తలాంతులప్పగించితివే అవియుగాక మరి రెండు తలాంతులు సంపాదించితినని చెప్పెను. అతని యజమానుడు భళా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైనవాటిమీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలుపొందుమని అతనితో చెప్పెను.
తరువాత ఒక తలాంతు తీసికొనినవాడును వచ్చి – అయ్యా, నీవు విత్తనిచోట కోయువాడవును, చల్లని చోట పంట కూర్చుకొనువాడవునైన కఠినుడవని నేనెరుగుదును గనుక నేను భయపడి, వెళ్లి నీ తలాంతును భూమిలో దాచిపెట్టితిని; ఇదిగో నీది నీవు తీసికొనుమని చెప్పెను. అందుకు అతని యజమానుడు వానిని చూచి సోమరివైన చెడ్డ దాసుడా, నేను విత్తనిచోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకొనువాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారులయొద్ద ఉంచ వలసి యుండెను; నేను వచ్చి వడ్డితోకూడ నా సొమ్ము తీసికొనియుందునే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్దనుండి తీసివేసి, పది తలాంతులు గలవాని కియ్యుడి. కలిగిన ప్రతివానికి ఇయ్యబడును అతనికి సమృద్ధి కలుగును; లేనివానియొద్దనుండి వానికి కలిగినదియు తీసి వేయబడును. మరియు పనికిమాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండుననెను.
తన మహిమతో మనుష్యకుమారుడును ఆయనతోకూడ సమస్త దూతలును వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడైయుండును. అప్పుడు సమస్త జనములు ఆయనయెదుట పోగు చేయబడుదురు; గొల్లవాడు మేకలలోనుండి గొఱ్ఱెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడివైపున గొఱ్ఱెలను ఎడమవైపున మేకలను నిలువబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి నా తండ్రిచేత ఆశీర్వదింపబడినవారలారా, రండి; లోకము పుట్టినది మొదలుకొని మీకొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి; దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై యుంటిని నన్ను చేర్చుకొంటిరి; దిగంబరినై యుంటిని, నాకు బట్టలిచ్చితిరి; రోగినైయుంటిని, నన్ను చూడవచ్చితిరి; చెరసాలలో ఉంటిని నాయొద్దకు వచ్చితిరని చెప్పును అందుకు నీతిమంతులు–ప్రభువా, యెప్పుడు నీవు ఆకలిగొని యుండుట చూచి నీకాహారమిచ్చితిమి? నీవు దప్పిగొని యుండుట చూచి యెప్పుడు దాహమిచ్చితిమి? ఎప్పుడు పరదేశివై యుండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి? దిగంబరివై యుండుట చూచి బట్టలిచ్చితిమి? ఎప్పుడు రోగివై యుండుటయైనను, చెరసాలలో ఉండుటయైనను, చూచి, నీయొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు–మిక్కిలి అల్పులైన యీ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును.
అప్పుడాయన యెడమవైపున ఉండువారిని చూచి శపింపబడినవారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు; దప్పి గొంటిని, మీరు నాకు దాహమియ్యలేదు; పరదేశినై యుంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు; దిగంబరినై యుంటిని, మీరు నాకు బట్టలియ్యలేదు; రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడ రాలేదని చెప్పును. అందుకు వారును–ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలిగొని యుండుటయైనను, దప్పిగొనియుండుటయైనను, పరదేశివైయుండుటయైనను, దిగంబరివై యుండుటయైనను, రోగివై యుండుటయైనను, చెరసాలలో ఉండుటయైనను చూచి, నీకు ఉపచారము చేయకపోతిమని ఆయనను అడిగెదరు. అందుకాయన–మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఈలాగు చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనును. వీరు నిత్యశిక్షకును నీతిమంతులు నిత్యజీవమునకును పోవుదురు.
అధ్యాయము 52
'పస్కా అనబడిన పులియనిరొట్టెల పండుగ సమీపించెను. ' రెండు దినములైన పిమ్మట పస్కాపండుగ, అనగా పులియని రొట్టెలపండుగ వచ్చెను. యేసు ఈ మాటలన్నియు చెప్పి చాలించిన తరువాత జరిగినదేమనగా ఆయన తన శిష్యులను చూచి –రెండు దినములైన పిమ్మట పస్కాపండుగ వచ్చుననియు, అప్పుడు మనుష్యకుమారుడు సిలువవేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియునని చెప్పెను. ఆ సమయమున ప్రధానయాజకులును ప్రజల పెద్దలును కయప అను ప్రధానయాజకుని మందిరములోనికి కూడివచ్చి యేసును మాయోపాయముచేత పట్టుకొని, చంపవలెనని యేకమై ఆలోచనచేసిరి. అయితే ప్రజలలో అల్లరి కలుగకుండు నట్లు–పండుగలో వద్దని చెప్పుకొనిరి.
యేసు బేతనియలో కుష్ఠరోగియైన సీమోను ఇంట నున్నప్పుడు, ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరుబుడ్డి తీసికొని ఆయనయొద్దకు వచ్చి, ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తలమీద పోసెను. అయితే కొందరు కోపపడి – ఈ అత్తరు ఈలాగు నష్టపరచనేల? ఈ అత్తరు మున్నూరు దేనారముల కంటె ఎక్కువ వెలకమ్మి, బీదలకియ్యవచ్చునని చెప్పి ఆమెనుగూర్చి సణుగుకొనిరి. అందుకు యేసు ఇట్లనెను – ఈమె జోలికిపోకుడి; ఈమెను ఎందుకు తొందరపెట్టుచున్నారు? ఈమె నాయెడల మంచి కార్యము చేసెను. బీదలు ఎల్లప్పుడును మీతోనే యున్నారు, మీకిష్టమైనప్పుడెల్ల వారికి మేలుచేయ వచ్చును; నేను ఎల్లప్పుడును మీతో నుండను. ఈమె తన శక్తికొలదిచేసి, నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో, అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను.
అంతట పండ్రెండుమంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను గనుక వాడు వెళ్లి, ఆయనను వారికేలాగు అప్పగింపవచ్చునో దానినిగూర్చి ప్రధానయాజకులతోను అధిపతులతోను మాటలాడెను. –నేనాయనను మీకప్పగించినయెడల నాకేమి ఇత్తురని వారినడిగెను. అందుకు వారు ముప్పది వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. వాడు అందుకు ఒప్పుకొని, జనసమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయము వెదకుచుండెను.
పస్కాపశువును వధింపవలసిన పులియనిరొట్టెల దినమురాగా యేసు పేతురును యోహానును చూచి– మీరు వెళ్లి మనము భుజించుటకై పస్కాను మనకొరకు సిద్ధపరచుడని వారిని పంపెను. వారు–మేమెక్కడ సిద్ధపరచగోరుచున్నావని ఆయనను అడుగగా ఆయన–ఇదిగో మీరు పట్టణములో ప్రవేశించునప్పుడు నీళ్లకుండ మోసికొనిపోవుచున్న యొకడు మీకు ఎదురుగా వచ్చును; అతడు ప్రవేశించు ఇంటిలోనికి అతని వెంట వెళ్లి నేను నా శిష్యులతోకూడ పస్కాను భుజించుటకు విడిది గది యెక్కడనని బోధకుడు నిన్నడుగుచున్నాడని యింటి యజమానునితో చెప్పుడి. అతడు సామగ్రిగల యొక గొప్ప మేడగది మీకు చూపించును; అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పెను. శిష్యులు వెళ్లి పట్టణములోనికి వచ్చి ఆయన వారితో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరచిరి.
అధ్యాయము 53
సాయంకాలమైనప్పుడు ఆయన తన పండ్రెండుమంది శిష్యులతోకూడ వచ్చెను. తాను ఈ లోకమునుండి తండ్రియొద్దకు వెళ్లవలసిన . గడియ వచ్చెనని యేసు పస్కాపండుగకు ముందే యెరిగిన వాడై, లోకములోనున్న తనవారిని ప్రేమించి, వారిని అంతమువరకు ప్రేమించెను. వారు భోజనముచేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించియుండెను గనుక తండ్రి తనచేతికి సమస్తము అప్పగించెననియు, తాను దేవునియొద్ద నుండి బయలుదేరి వచ్చెననియు, దేవునియొద్దకు వెళ్లవలసియున్నదనియు యేసు ఎరిగి భోజనపంక్తిలోనుండి లేచి తన పైవస్త్రము అవతల పెట్టివేసి, యొక తువాలు తీసికొని నడుమునకు కట్టుకొనెను. అంతట పళ్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును, తాను కట్టుకొని యున్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురునొద్దకు వచ్చినప్పుడు అతడు–ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా? అని ఆయనతో అనెను. అందుకు యేసు–నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదుగాని యికమీదట తెలిసికొందువని అతనితో చెప్పగా పేతురు–నీవెన్నడును నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు–నేను నిన్ను కడుగనియెడల నాతో నీకు పాలు లేదనెను. సీమోను పేతురు–ప్రభువా, నా పాదములు మాత్రమేగాక నా చేతులు నా తల కూడ కడుగుమని ఆయనతో చెప్పెను. యేసు అతని చూచి–స్నానముచేసినవాడు పాదములు తప్ప మరేమియు కడుగుకొననక్కరలేదు, అతడు కేవలము పవిత్రుడయ్యెను. మీరును పవిత్రులు కాని మీలో అందరు పవిత్రులు కారనెను. తన్ను అప్పగించువానిని ఎరిగెను గనుక– మీలో అందరు పవిత్రులు కారని ఆయన చెప్పెను.
వారి పాదములు కడిగి తన పైవస్త్రము వేసికొనిన తరువాత, ఆయన మరల కూర్చుండి–నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు; నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగినయెడల మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఈలాగు చేసితిని. దాసుడు తన యజమానునికంటె గొప్పవాడు కాడు, పంపబడినవాడు తన్ను పంపిన వానికంటె గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసినయెడల మీరు ధన్యులగుదురు. మిమ్మునందరినిగూర్చి నేను చెప్పలేదు; నేను ఏర్పరచుకొనినవారిని ఎరుగుదును గాని –నాతోకూడ భోజనముచేయువాడు నాకు విరోధముగా తన మడమ యెత్తెను అను లేఖనము నెరవేరుటకై యీలాగు జరుగును. జరిగినప్పుడు నేనే ఆయననని మీరు నమ్మునట్లు అది జరుగకమునుపు మీతో చెప్పుచున్నాను. నేనెవని పంపుదునో వాని చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనువాడగును; నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవానిని చేర్చుకొనువాడగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను.
ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతోకూడ అపొస్తలులును పంక్తిని కూర్చుండిరి. అప్పుడాయన– నేను శ్రమపడకమునుపు మీతోకూడ ఈ పస్కాను భుజింపవలెనని మిక్కిలి ఆశపడితిని. అది దేవుని రాజ్యములో నెరవేరువరకు ఇక ఎన్నడును దాని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి. 'వారు భోజనముచేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని, దాని నాశీర్వదించి, విరిచి తన శిష్యులకిచ్చి –మీరు తీసికొని తినుడి;' ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడని చెప్పెను.ఆప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని–ఈ గిన్నె మీకొరకు చిందింపబడుచున్న నా రక్తము వలననైన క్రొత్త నిబంధన. దీనిలోనిది మీరందరు త్రాగుడి. ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీతోకూడ నేను ఈ ద్రాక్షారసము క్రొత్త దిగా త్రాగు దినమువరకు, ఇకను దాని త్రాగనని మీతో చెప్పుచున్నాననెను. వారందరు దానిలోనిది త్రాగిరి. '
అధ్యాయము 54
వారు కూర్చుండి భోజనముచేయుచుండగా యేసు–మీలో ఒకడు, అనగా నాతో భుజించుచున్నవాడు నన్ను అప్పగించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పగా. ' అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడును ప్రభువా, నేనా? అని ఆయన నడుగగా ఆయన నాతోకూడ పాత్రలో చెయ్యిముంచినవాడెవడో వాడే నన్ను అప్పగించువాడు. మనుష్యకుమారునిగూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు గాని యెవనిచేత మనుష్యకుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ; ఆ మనుష్యుడు పుట్టియుండనియెడల వానికి మేలని చెప్పెను. వారు–ఈ పనిని చేయబోవువాడెవరో అని తమలోతాము అడుగుకొనసాగిరి. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన యొకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను గనుక ఎవరినిగూర్చి ఆయన చెప్పెనో అది తమకు చెప్పుమని సీమోను పేతురు అతనికి సైగ చేసెను. అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు–ప్రభువా, వాడెవడని ఆయనను అడిగెను. అందుకు యేసు–నేనొక ముక్క ముంచి యెవని కిచ్చెదనో వాడే అని చెప్పి, ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకిచ్చెను; వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. ఆయనను అప్పగించిన యూదా బోధకుడా, నేనా? అని అడుగగా ఆయన–నీవన్నట్టే అనెను. యేసు–నీవు చేయుచున్నది త్వరగా చేయుమని వానితో చెప్పగా. ఆయన ఎందునిమిత్తము అతనితో ఆలాగు చెప్పెనో అది భోజనమునకు కూర్చుండినవారిలో ఎవనికిని తెలియలేదు. డబ్బు సంచి యూదాయొద్ద ఉండెను గనుక పండుగకు తమకు కావలసినవాటినికొనుమనియైనను, బీదలకేమైన ఇమ్మని యైనను యేసు వానితో చెప్పినట్టు కొందరనుకొనిరి. వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్లెను; అప్పుడు రాత్రివేళ.
వాడు వెళ్లిన తరువాత యేసు ఇట్లనెను–ఇప్పుడు మనుష్యకుమారుడు మహిమపరచబడి యున్నాడు; దేవుడును ఆయనయందు మహిమపరచబడి యున్నాడు. దేవుడు ఆయనయందు మహిమపరచబడినయెడల, దేవుడు తనయందు ఆయనను మహిమపరచును; వెంటనే ఆయనను మహిమపరచును. పిల్లలారా, యింక కొంతకాలము మీతోకూడ ఉందును, మీరు నన్ను వెదకుదురు, నేనెక్కడికి వెళ్లుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పినప్రకారము ఇప్పుడు మీతోను చెప్పు చున్నాను. మీరు ఒకరి నొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను; నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరి నొకరు ప్రేమింపవలెను. మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురనెను.
మరియు ఆయన–సంచియు జాలెయు చెప్పులునులేకుండ నేను మిమ్మును పంపినప్పుడు, మీకు ఏమైనను తక్కువాయెనా అని వారినడిగినప్పుడు వారు–ఏమియు తక్కువకాలేదనిరి. అందుకాయన ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు జాలెయు తీసికొని పోవలెను; కత్తి లేనివాడు తన బట్టనమ్మి కత్తి కొనుక్కొనవలెను; –ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడెను అని వ్రాయబడిన మాట నాయందు నెరవేరవలసియున్నది; ఏలయనగా నన్నుగూర్చిన సంగతి సమాప్తమవుచున్నదని మీతో చెప్పుచున్నాననెను. అంతట వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్లిరి.
సీమోను పేతురు–ప్రభువా, నీవెక్కడికి వెళ్లుచున్నావని ఆయనను అడుగగా యేసు–నేను వెళ్లుచున్నచోటికి నీవిప్పుడు నావెంట రాలేవుగాని, తరువాత వచ్చెదవని అతనితో చెప్పెను. అందుకు పేతురు –ప్రభువా, నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను? నీకొరకు నా ప్రాణముపెట్టుదునని ఆయనతో చెప్పగా. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదము వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లనెను –అన్యజనములలో రాజులు వారిమీద ప్రభుత్వము చేయుదురు; వారిమీద అధికారము చేయువారు ఉపకారులనబడుదురు. మీరైతే ఆలాగు ఉండరాదు; మీలో గొప్పవాడు చిన్నవానివలెను, అధిపతి పరిచారకునివలెను ఉండవలెను. గొప్పవాడెవడు? భోజనపంక్తిని కూర్చుండువాడా పరిచర్యచేయువాడా? పంక్తినికూర్చుండు వాడే గదా? అయినను నేను మీ మధ్య పరిచర్యచేయు వానివలె ఉన్నాను. నా శోధనలలో నాతోకూడ నిలిచియున్నవారు మీరే; గనుక నాతండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్లయొద్ద అన్నపానములు పుచ్చుకొని, సింహాసనములమీద కూర్చుండి ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములవారికి మీరు తీర్పుతీర్చుటకై, నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. సీమోనూ, సీమోనూ, ఇదిగో సాతాను మిమ్మును పెట్టి గోధుమలవలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీకొరకు వేడుకొంటిని; నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పెను. అయితే అతడు –ప్రభువా, నీతోకూడ చెరలోనికిని మరణమునకును వెళ్లుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా
అధ్యాయము 55
అప్పుడు యేసు వారిని చూచి–ఈ రాత్రి మీరందరు నా విషయమై అభ్యంతరపడెదరు, ఏలయనగా–గొఱ్ఱెల కాపరిని కొట్టుదును, మందలోని గొఱ్ఱెలు చెదరిపోవును అని వ్రాయబడి యున్నది గదా. నేను లేచిన తరువాత మీకంటె ముందుగా గలిలయకు వెళ్లెదననెను. అందుకు పేతురు నీ విషయమై అందరు అభ్యంతరపడినను నేను ఎప్పుడును అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా యేసు అతని చూచి ఈ రాత్రి కోడి కూయకమునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. పేతురాయనను చూచి నేను నీతోకూడ చావవలసివచ్చినను, నిన్ను ఎరుగనని చెప్పననెను; అదేప్రకారము శిష్యులందరు అనిరి.
మీ హృదయమును కలవరపడనియ్యకుడి; దేవుని యందు విశ్వాసముంచుచున్నారు నాయందును విశ్వాసముంచుడి. నా తండ్రి యింట అనేక నివాసములు కలవు, లేనియెడల మీతో చెప్పుదును; మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను. నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచినయెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసికొనిపోవుదును. నేను వెళ్లుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియునని చెప్పెను. అందుకు తోమా– ప్రభువా, యెక్కడికి వెళ్లుచున్నావో మాకు తెలియదే; ఆ మార్గమేలాగు తెలియునని ఆయన నడుగగా యేసు –నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగియుంటే నా తండ్రిని ఎరిగియుందురు; ఇప్పటినుండి మీరాయనను ఎరుగుదురు, ఆయనను చూచియున్నారని చెప్పెను.
అప్పుడు ఫిలిప్పు–ప్రభువా, తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా యేసు–ఫిలిప్పూ, నేనింతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని యేల చెప్పుచున్నావు? తండ్రియందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యంతట నేనే చెప్పుట లేదు, తండ్రి నాయందు నివసించుచు తన క్రియలుచేయుచున్నాడు. తండ్రియందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నమ్ముడి; లేదా యీ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. నేను తండ్రియొద్దకు వెళ్లుచున్నాను గనుక నేనుచేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటె మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు నా నామమున దేని నడుగుదురో తండ్రి కుమారునియందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును.
మీరు నన్ను ప్రేమించినయెడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీయొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపియగు ఆత్మను అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు; మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతోకూడ నివసించును, మీలో ఉండును. మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడును చూడదు; అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. నేను నా తండ్రియందును, మీరు నాయందును, నేను మీయందును ఉన్నామని ఆ దినమున మీరెరుగుదురు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు; నన్ను ప్రేమించువాడు నా తండ్రివలన ప్రేమింపబడును; నేనును వానిని ప్రేమించి, వానికి నన్ను కనబరచుకొందునని చెప్పెను.
ఇస్కరియోతు కాని యూదా– ప్రభువా, నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనబరచుకొనుటకేమి సంభవించెనని అడుగగా యేసు–ఒకడు నన్ను ప్రేమించినయెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకువచ్చి వానియొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు; మీరు వినుచున్న మాట నామాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. నేను మీయొద్ద ఉండగానే యీ మాటలు మీతో చెప్పితిని. ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును.
శాంతి మీ కనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చునట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదు; మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి. నేను వెళ్లి మీయొద్దకు వచ్చెదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరిగదా. తండ్రి నాకంటె గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించినయెడల నేను తండ్రియొద్దకు వెళ్లుచున్నానని మీరు సంతోషింతురు. ఈ సంగతి సంభవించినప్పుడు, మీరు నమ్మవలెనని అది సంభవింపకముందే మీతో చెప్పుచున్నాను. ఇకను మీతో విస్తరించి మాటలాడను; ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. నాతో వానికి సంబంధమేమియులేదు. అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలిసికొనునట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేనీలాగు చేయుచున్నాను. లెండి, యిక్కడనుండి వెళ్లుదము.
అధ్యాయము 56
నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవ సాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును; ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగెలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటనుబట్టి మీరిప్పుడు పవిత్రులై యున్నారు. నాయందు నిలిచియుండుడి, మీయందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచి యుంటేనేగాని తనంతట తానే యేలాగు ఫలింపదో, ఆలాగే నాయందు నిలిచియుంటేనేకాని మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును; నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు. ఎవడైనను నాయందు నిలిచియుండని యెడల వాడు తీగెవలె బయట పారవేయబడి యెండిపోవును; మనుష్యులు అట్టివాటిని పోగుచేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నాయందు మీరును మీయందు నా మాటలును నిలిచియుండినయెడల మీకేది యిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుటవలన నా తండ్రి మహిమపరచబడును; ఇందువలన మీరు నా శిష్యులగుదురు. తండ్రి నన్ను ఏలాగు ప్రేమించెనో నేనును మిమ్మును ఆలాగు ప్రేమించితిని, నా ప్రేమయందు నిలిచి యుండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనినయెడల నా ప్రేమయందు నిలిచి యుందురు. మీయందు నా సంతోషము ఉండవలెననియు, మీ సంతోషము పరిపూర్ణము కావలెననియు, ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను.
నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము, మీరొకనినొకడు ప్రేమించవలెననుటయే నా ఆజ్ఞ తన స్నేహితులకొరకు తన ప్రాణము పెట్టువానికంటె ఎక్కువైన ప్రేమగలవాడెవడును లేడు. నేను మీ కాజ్ఞాపించువాటినిచేసినయెడల, మీరు నా స్నేహితులైయుందురు. దాసుడు తన యజమానుడు చేయుదానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను, ఎందుకనగా నేను నా తండ్రివలన వినిన సంగతులన్నిటిని మీకు తెలియజేసితిని. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు; మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకనుగ్రహించునట్లు మీరు వెళ్లి ఫలించుటకును, మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. మీరు ఒకనినొకడు ప్రేమింపవలెనని యీ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను.
లోకము మిమ్మును ద్వేషించినయెడల మీకంటె ముందుగా నన్ను ద్వేషించెనని మీరెరుగుదురు. మీరు లోక సంబంధులైనయెడల లోకము తన వారిని స్నేహించును; అయితే మీరు లోకసంబంధులు కారు; నేను మిమ్మును లోకములోనుండి ఏర్పరచుకొంటిని; అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. దాసుడు తన యజమానునికంటె గొప్పవాడు కాడని నేను మీతో చెప్పినమాట జ్ఞాపకము చేసికొనుడి. లోకులు నన్ను హింసించినయెడల మిమ్మును కూడ హింసింతురు; నా మాట గైకొనినయెడల, మీ మాట కూడ గైకొందురు. అయితే వారు నన్ను పంపిన వానిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తము వీటినన్నిటిని మీకు చేయుదురు. నేను వచ్చి వారికి బోధింపకుండినయెడల, వారికి పాపము లేకపోవును; ఇప్పుడైతే వారి పాపమునకు మిషలేదు. నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడ ద్వేషించుచున్నాడు. ఎవడును చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండినయెడల వారికి పాపము లేకపోవును; ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించియున్నారు. అయితే –నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రములో వ్రాయబడిన వాక్యము నెరవేరునట్లు ఈలాగు జరిగెను. తండ్రియొద్దనుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త, అనగా తండ్రి యొద్దనుండి బయలుదేరు సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్నుగూర్చి సాక్ష్యమిచ్చును. మీరు మొదటనుండి నాయొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిత్తురు.
మీరు అభ్యంతరపడకుండవలెనని యీ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మును సమాజమందిరములలోనుండి వెలివేయుదురు; మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవచేయుచున్నానని అనుకొను కాలమువచ్చుచున్నది. వారు తండ్రిని నన్నును తెలిసికొనలేదు గనుక ఈలాగు చేయుదురు. అవి జరుగుకాలము వచ్చినప్పుడు నేను వాటినిగూర్చి మీతో చెప్పితినని మీరు జ్ఞాపకము చేసికొనులాగున యీ సంగతులు మీతో చెప్పుచున్నాను; నేను మీతోకూడ ఉంటిని గనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు. ఇప్పుడు నన్ను పంపినవాని యొద్దకు వెళ్లుచున్నాను –నీవు ఎక్కడికి వెళ్లుచున్నావని మీలో ఎవడును నన్నడుగుటలేదు గాని నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండియున్నది. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్లిపోవుటవలన మీకు ప్రయోజనకరము; నేను వెళ్లనియెడల ఆదరణకర్త మీయొద్దకు రాడు; నేను వెళ్లినయెడల ఆయనను మీయొద్దకు పంపుదును. ఆయన వచ్చి, పాపమునుగూర్చియు నీతినిగూర్చియు తీర్పునుగూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. లోకులు నాయందు విశ్వాసముంచలేదు గనుక పాపమునుగూర్చియు, నేను తండ్రి యొద్దకు వెళ్లుటవలన మీరిక నన్ను చూడరు గనుక నీతినిగూర్చియు, ఈ లోకాధికారి తీర్పు పొంది యున్నాడు గనుక తీర్పునుగూర్చియు ఒప్పుకొనజేయును. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని యిప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును; ఆయన తనంతట తానే యేమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసికొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగినవన్నియు నావి, అందుచేత ఆయన నావాటిలోనివి తీసికొని మీకు తెలియజేయునని నేను చెప్పితిని.
కొంచెము కాలమైన తరువాత మీరిక నన్ను చూడరు; మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని చెప్పెను. కాబట్టి ఆయన శిష్యులలో కొందరు–కొంచెము కాలమైన తరువాత నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరు, నేను తండ్రియొద్దకు వెళ్లుచున్నాననియు, ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటని యొకనితో ఒకరు చెప్పుకొనిరి. కొంచెము కాలమని ఆయన చెప్పుచున్న దేమిటి? ఆయన చెప్పుచున్న సంగతి మనకు తెలియదని చెప్పుకొనిరి. వారు తన్ను అడుగ గోరుచుండిరని యేసు యెరిగి వారితో ఇట్లనెను–కొంచెము కాలమైన తరువాత మీరు నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని నేను చెప్పిన మాటనుగూర్చి మీరు ఒకనితో ఒకడు ఆలోచించుకొనుచున్నారా? మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును; మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్త్రీ ప్రసవించునప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదనపడును; అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనను సంతోషముచేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసికొనదు. అటువలె మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మును మరల చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడును మీయొద్దనుండి తీసివేయడు. ఆ దినమున మీరు దేని గూర్చియు నన్ను అడుగరు;
మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదివరకు మీరేమియు నా పేరట అడుగలేదు; మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరకును. ఈ సంగతులు గూఢార్థముగా మీతో చెప్పితిని; అయితే నేనిక యెన్నడును గూఢార్థముగా మీతో మాటలాడక తండ్రినిగూర్చి మీకు స్పష్టముగా తెలియజెప్పుగడియ వచ్చుచున్నది. ఆ దినమందు మీరు నా పేరట అడుగుదురు గాని మీ విషయమై నేను తండ్రిని వేడుకొందునని మీతో చెప్పుటలేదు. మీరు నన్ను ప్రేమించి, నేను దేవునియొద్దనుండి బయలుదేరి వచ్చితినని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు. నేను తండ్రియొద్దనుండి బయలుదేరి లోకమునకు వచ్చియున్నాను; మరియు లోకమును విడిచి తండ్రియొద్దకు వెళ్లుచున్నానని వారితో చెప్పెను. ఆయన శిష్యులు–ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థముగా ఏమియు చెప్పక స్పష్టముగా మాటలాడుచున్నావు. సమస్తము ఎరిగినవాడవనియు, ఎవడును నీకు ప్రశ్నవేయ నగత్యము లేదనియు, ఇప్పుడెరుగుదుము; దేవునియొద్దనుండి నీవు బయలుదేరి వచ్చితివని దీనివలన నమ్ముచున్నామని చెప్పగా యేసు వారిని చూచి–మీరిప్పుడు నమ్ముచున్నారా? యిదిగో మీలో ప్రతివాడును ఎవని యింటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, వచ్చేయున్నది; అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగాలేను. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించియున్నాననెను.
అధ్యాయము 57
యేసు ఈ మాటలు చెప్పి ఆకాశమువైపు కన్నులెత్తి యిట్లనెను–తండ్రీ, నా గడియ వచ్చియున్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికిచ్చిన వారికందరికిని ఆయన నిత్యజీవము అనుగ్రహించునట్లు సర్వశరీరులమీదను ఆయనకు అధికారమిచ్చితివి. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమిమీద నిన్ను మహిమ పరచితిని. తండ్రీ, లోకము పుట్టకమునుపు నీయొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీయొద్ద మహిమపరచుము. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని. వారు నీవారై యుండిరి, నీవు వారిని నాకనుగ్రహించితివి; వారు నీ వాక్యము గైకొనియున్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికిచ్చియున్నాను; వారామాటలను అంగీకరించి, నేను నీయొద్దనుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి, నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక.
నీవు నాకు అనుగ్రహించినవన్నియు నీవలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి యున్నారు. నేను వారికొరకు ప్రార్థన చేయుచున్నాను; లోకముకొరకు ప్రార్థన చేయుటలేదు, నీవు నాకు అనుగ్రహించియున్నవారు నీవారైనందున వారికొరకే ప్రార్థన చేయుచున్నాను. నావన్నియు నీవి, నీవియు నావి; వారియందు నేను మహిమపరచబడి యున్నాను. నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు; నేను నీయొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రీ, మనము ఏకమైయున్నలాగున వారును ఏకమై యుండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. నేను వారియొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించినవారిని నీ నామమందు కాపాడితిని; నేను వారిని భద్రపరచితిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు. ఇప్పుడు నేను నీయొద్దకు వచ్చుచున్నాను; నా సంతోషము వారియందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. వారికి నీ వాక్యమిచ్చియున్నాను. నేను లోకసంబంధినికానట్టు వారును లోకసంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకములోనుండి వారిని తీసికొనిపొమ్మని నేను ప్రార్థించుటలేదు గాని దుష్టునినుండి వారిని కాపాడు మని ప్రార్థించుచున్నాను. నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు.
సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము; నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠచేయబడునట్లు వారికొరకై నన్ను ప్రతిష్ఠ చేసికొనుచున్నాను. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు, తండ్రీ, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున, వారును మనయందు ఏకమైయుండవలెనని వారికొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు; వాక్యమువలన నాయందు విశ్వాసముంచువారందరును ఏకమైయుండవలెనని వారికొరకును ప్రార్థించుచున్నాను. మనము ఏకమైయున్నలాగున, వారును ఏకమై యుండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారియందు నేనును నాయందు నీవును ఉండుటవలనవారు సంపూర్ణులుగా చేయబడి యేకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడ ప్రేమించితివనియు, లోకము తెలిసికొనునట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. తండ్రీ, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించినవారును నాతోకూడ ఉండవలెననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను. జగత్తుపునాది వేయబడకమునుపే నీవు నన్ను ప్రేమించితివి. నీతి స్వరూపుడవగు తండ్రీ, లోకము నిన్ను ఎరుగలేదు; నేను నిన్ను ఎరుగుదును; నీవు నన్ను పంపితివని వీరెరిగి యున్నారు. నీవు నాయందు ఉంచిన ప్రేమ వారియందు ఉండునట్లును, నేను వారియందు ఉండునట్లును, వారికి నీ నామమును తెలియజేసితిని, ఇంకను తెలియజేసెదనని చెప్పెను.
అధ్యాయము 58
యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతోకూడ కెద్రోను వాగు దాటి పోయెను. అక్కడ ఒక తోట యుండెను, దానిలోనికి ఆయన తన శిష్యులతోకూడ వెళ్లెను. వారు గెత్సేమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు, ఆయన– నేను ప్రార్థనచేసి వచ్చువరకు మీరిక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి పేతురును యాకోబును యోహానును వెంటబెట్టుకొనిపోయి, మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించెను. అప్పుడాయన–నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగియున్నది; మీరిక్కడ ఉండి మెలకువగా నుండుడని వారితో చెప్పి కొంతదూరము సాగిపోయి నేలమీద పడి, సాధ్యమైతే ఆ గడియ తనయొద్దనుండి తొలగిపోవలెనని ప్రార్థించుచు, నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నాయొద్దనుండి తొలగిపోనిమ్ము, అయినను నా యిష్టప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను.
అప్పుడు పరలోకమునుండి యొకదూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. ఆయన వేదనపడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట, నేల పడుచున్న గొప్ప రక్త బిందువులవలె ఆయెను. ఆయన మరల శిష్యులయొద్దకు వచ్చి, వారు నిద్రించుట చూచి ఒక గడియయైనను నాతోకూడ మేల్కొనియుండలేరా? .మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థనచేయుడి; ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరల రెండవమారు వెళ్లి నా తండ్రీ, నేను దీనిని త్రాగితేనే గాని యిది నాయొద్దనుండి తొలగిపోవుట సాధ్యముకానియెడల, నీ చిత్తమే సిద్ధించు గాక అని ప్రార్థించి తిరిగి వచ్చి, వారు మరల నిద్రించుట చూచెను; ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరల విడిచి వెళ్లి, ఆ మాటలే చెప్పుచు మూడవ మారు ప్రార్థనచేసెను. అప్పుడాయన తన శిష్యులయొద్దకు వచ్చి ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి; ఇదిగో ఆ గడియవచ్చియున్నది; మనుష్యకుమారుడు పాపులచేతికి అప్పగింపబడుచున్నాడు; లెండి వెళ్లుదము; ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించియున్నాడని వారితో చెప్పెను.
వెంటనే, ఆయన ఇంకను మాటలాడుచుండగా పండ్రెండుమంది శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యూదా వచ్చెను. వానితోకూడ బహుజనులు కత్తులు గుదియలు పట్టుకొని, ప్రధానయాజకులయొద్దనుండియు, శాస్త్రులయొద్ద నుండియు పెద్దలయొద్దనుండియు వచ్చిరి. యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్లుచుండువాడు గనుక, ఆయనను అప్పగించు యూదాకును ఆ స్థలము తెలిసియుండెను. యేసు తనకు సంభవింపబోవున వన్నియు ఎరిగినవాడై వారియొద్దకు వెళ్లి–మీరెవని వెదకుచున్నారని వారిని అడిగెను. వారు–నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమియ్యగా యేసు–ఆయనను నేనే అని వారితో చెప్పెను; ఆయనను అప్పగించిన యూదాయు వారియొద్ద నిలుచుండెను. ఆయన–నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేలమీద పడిరి. మరల ఆయన–మీరు ఎవనిని వెదకుచున్నారని వారిని అడిగెను. అందుకు వారు–నజరేయుడైన యేసునని చెప్పగా యేసు వారితో–నేనే ఆయనని మీతో చెప్పితిని గనుక మీరు నన్ను వెదకుచున్నయెడల వీరిని పోనియ్యుడని చెప్పెను. –నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకనినైనను నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరునట్లు ఈలాగు చెప్పెను.
ఆయనను అప్పగించువాడు – నేనెవరిని ముద్దుపెట్టుకొందునో ఆయనే (యేసు); ఆయనను పట్టుకొని భద్రముగా కొనిపోవుడని వారికి గురుతు చెప్పియుండెను. ఆయన ఇంకను మాటలాడుచుండగా, ఇదిగో పండ్రెండుమందిలో యూదా అన బడినవాడు వారికంటె ముందుగా నడిచి, యేసును ముద్దు పెట్టుకొనుటకు ఆయనయొద్దకు రాగా యేసు–యూదా, నీవు ముద్దుపెట్టుకొని మనుష్యకుమారుని అప్పగించుచున్నావా అని వానితో అనగా, వెంటనే యేసు నొద్దకు వచ్చి–బోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దుపెట్టుకొనెను. యేసు చెలికాడా, నీవు చేయవచ్చినది చేయుమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయనమీదపడి ఆయనను పట్టుకొనిరి. 'ఆయన చుట్టు ఉన్నవారు జరుగబోవు దానిని చూచి–ప్రభువా, కత్తితో నరుకుదుమా అని ఆయనను అడిగిరి. ' సీమోను పేతురునొద్ద కత్తియుండినందున అతడు దానిని దూసి, ప్రధానయాజకుని దాసుని కొట్టి అతని కుడిచెవి తెగనరికెను. ' యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము; కత్తి పట్టుకొను వారందరు కత్తిచేతనే నశింతురు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనినయెడల ఆయన పండ్రెండు సేనా వ్యూహములకంటె ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవనుకొనుచున్నావా? నేను వేడుకొనినయెడల–ఈలాగు జరుగవలెనను లేఖనము ఏలాగు నెరవేరునని అతనితో చెప్పెను. అయితే యేసు–ఈ మట్టుకు తాళుడని చెప్పి, వాని చెవి ముట్టి బాగుచేసెను.
అధ్యాయము 59
యేసు తన్ను పట్టుకొనవచ్చిన ప్రధానయాజకులతోను దేవాలయపు అధిపతులతోను పెద్దలతోను–మీరు బందిపోటు దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతోను గుదియలతోను బయలుదేరి వచ్చితిరా? నేను అనుదినము మీచెంత దేవాలయములో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు; అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అనెను. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగెనని చెప్పెను. అప్పుడు శిష్యులందరు ఆయనను విడిచి పారిపోయిరి. తన దిగంబర శరీరముమీద నారబట్ట వేసికొనియున్న యొక పడుచువాడు ఆయన వెంట వెళ్లుచుండగా, వారతనిని పట్టుకొనిరి. అతడు నారబట్ట విడిచి, దిగంబరుడై పారిపోయెను.
అంతట సైనికులును సహస్రాధిపతియు, యూదుల బంట్రౌతులును యేసును పట్టుకొని ఆయనను బంధించి, మొదట అన్నయొద్దకు ఆయనను తీసికొనిపోయిరి. అతడు ఆ సంవత్సరము ప్రధానయాజకుడైన కయపకు మామ. కయప–ఒక మనుష్యుడు ప్రజలకొరకు చనిపోవుట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు. ప్రధానయాజకుడు ఆయన శిష్యులనుగూర్చియు ఆయన బోధనుగూర్చియు యేసును అడుగగా యేసు–నేను బాహాటముగా లోకము ఎదుట మాటలాడితిని; యూదులందరు కూడివచ్చు సమాజమందిరములలోను దేవాలయములోను ఎల్లప్పుడును బోధించితిని; రహస్యముగా నేనేమియు మాటలాడలేదు. నీవు నన్ను అడుగనేల? నేను వారికేమి బోధించినది విన్నవారిని అడుగుము; ఇదిగో నేను చెప్పినది వీరెరుగుదురని అతనితో అనెను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచియున్న బంట్రౌతులలో ఒకడు – ప్రధానయాజకునికి ఈలాగు ఉత్తరమిచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను. అందుకు యేసు–నేను కాని మాట ఆడినయెడల ఆ కాని మాట ఏదో చెప్పుము; మంచిమాట ఆడినయెడల నన్నేల కొట్టుచున్నావనెను. అంతట అన్న, యేసును బంధింపబడియున్నట్టుగానే ప్రధానయాజకుడైన కయప యొద్దకు పంపెను.
యేసును పట్టుకొనినవారు ప్రధానయాజకుడైన కయప యొద్దకు ఆయనను తీసికొనిపోగా, అక్కడ శాస్త్రులును పెద్దలును కూడియుండిరి. పేతురు ప్రధానయాజకుని యింటిముంగిటివరకు, ఆయనను దూరమునుండి వెంబడించి లోపలికి పోయి–దీని అంత మేమవునో చూడవలెనని బంట్రౌతులతోకూడ కూర్చుండెను. అంతట కొందరు నడుముంగిట మంటవేసి చుట్టు కూర్చుండినప్పుడు, పేతురును వారిమధ్యను కూర్చుండెను. అప్పుడొక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండుట చూచి అతని తేరిచూచి–వీడును అతనితోకూడ ఉండెనని చెప్పెను. అందుకు పేతురు–అమ్మాయీ, నేనతని నెరుగననెను. మరి కొంత సేపటికి మరియొకడు అతని చూచి–నీవును వారిలో ఒకడవనగా పేతురు– ఓయీ, నేను కాననెను. ఇంచుమించు ఒక గడియయైన తరువాత మరియొకడు–నిజముగా వీడును అతనితోకూడ ఉండెను, వీడు గలిలయుడని దృఢముగా చెప్పెను. అందుకు పేతురు–ఓయీ, నీవు చెప్పినది నాకు తెలియదనెను. అతడింకను మాటలాడుచుండగా వెంటనే కోడికూసెను. అప్పుడు ప్రభువు తిరిగి పేతురువైపు చూచెను గనుక పేతురు–నేడు కోడి కూయకమునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందువని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసికొని వెలుపలికిపోయి సంతాపపడి యేడ్చెను.
ప్రధానయాజకులును మహాసభవారందరును యేసును చంపింపవలెనని ఆయనమీద సాక్ష్యము వెదకిరిగాని, యేమియు వారికి దొరకలేదు. అనేకులు ఆయనమీద అబద్ధసాక్ష్యము పలికినను వారి సాక్ష్యములు ఒకదానికి ఒకటి సరిపడలేదు. అప్పుడు కొందరు లేచి చేతిపనియైన ఈ దేవాలయమును పడగొట్టి, మూడుదినములలో చేతిపనికాని మరియొక దేవాలయమును నేను కట్టుదునని వీడు చెప్పుచుండగా వింటిమని ఆయనమీద అబద్ధసాక్ష్యము చెప్పిరి గాని ఆలాగైనను వీరి సాక్ష్యమును సరిపడలేదు. ప్రధానయాజకుడు వారిమధ్యను లేచి నిలిచి–ఉత్తరమేమియు చెప్పవా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని యేసు నడిగెను. అందుకు ప్రధానయాజకుడు ఆయనను చూచి నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవముగల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాననెను. అందుకు యేసు– నీవన్నట్టే. – నేను మీతో చెప్పినయెడల మీరు నమ్మరు. అదియుగాక నేను మిమ్మును అడిగినయెడల మీరు నాకు ఉత్తరము చెప్పరు. మనుష్యకుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశమేఘారూఢుడై వచ్చుటయు చూచెదరని చెప్పెను. 'అందుకు వారందరు–అట్లయితే నీవు దేవుని కుమారుడవా? అని అడుగగా ఆయన–మీరన్నట్టు నేనే ఆయనను అని వారితో చెప్పెను. ' ప్రధానయాజకుడు తన వస్త్రము చింపుకొని వీడు దేవదూషణ చేసెను; మనకిక సాక్షులతో పని ఏమి? ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు; మీకేమితోచుచున్నదని అడిగెను. అందుకు వారు–వీడు మరణమునకు పాత్రుడనిరి. అప్పుడు వారు ఆయన ముఖముమీద ఉమ్మివేసి, ఆయనను గుద్దిరి; కొందరు ఆయనను అరచేతులతో కొట్టి – క్రీస్తూ, నిన్ను కొట్టినవాడెవడో ప్రవచింపుమనిరి.
అధ్యాయము 60
వారు కయపయొద్దనుండి అధికారమందిరమునకు యేసును తీసికొనిపోయిరి. అప్పుడు ఉదయమాయెను గనుక వారు మైలపడకుండ పస్కాను భుజింపవలెనని అధికారమందిరములోనికి వెళ్లలేదు. కావున పిలాతు బయట ఉన్నవారి యొద్దకు వచ్చి–ఈ మనుష్యుని మీద మీరు ఏ నేరము మోపుచున్నారనెను. అందుకు వారు–వీడు దుర్మార్గుడు కానియెడల వీనిని నీకు అప్పగించియుండమని అతనితో చెప్పిరి. పిలాతు–మీరతని తీసికొనిపోయి మీ ధర్మశాస్త్రము చొప్పున అతనికి తీర్పుతీర్చుడనగా యూదులు–ఎవనికిని మరణశిక్ష విధించుటకు మాకు అధికారములేదని అతనితో చెప్పిరి. అందువలన యేసు తాను ఎట్టిమరణము పొందబోవునో దానిని సూచించి చెప్పిన మాట నెరవేరెను.యేసు అధిపతియెదుట నిలిచెను; 'ప్రధానయాజకులు ఆయనమీద అనేకమైన నేరములు మోపగా, ' –ఇతడు మా జనమును తిరుగబడ ప్రేరేపించుచు, కైసరునకు పన్నియ్యవద్దనియు, తానే క్రీస్తను ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమని ఆయనమీద నేరము మోపసాగిరి.
పిలాతు తిరిగి అధికారమందిరములో ప్రవేశించి యేసును పిలిపించి–యూదుల రాజువు నీవేనా? అని ఆయన నడుగగా యేసు–నీ అంతట నీవే యీ మాట అనుచున్నావా? లేక యితరులు నీతో నన్నుగూర్చి యిది చెప్పిరా? అని అడిగెను. అందుకు పిలాతు–నేను యూదుడనా యేమి? నీ స్వజనమును ప్రధానయాజకులును నిన్ను నాకు అప్పగించిరిగదా; నీవేమి చేసితివని అడుగగా యేసు–నా రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదు; నా రాజ్యము ఈ లోకసంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహసంబంధమైనది కాదనెను. అందుకు పిలాతు–నీవు రాజువా? అని ఆయనను అడుగగా యేసు–నీవన్నట్టు నేను రాజునే; సత్యమునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని; ఇందు నిమిత్తమే యీ లోకమునకు వచ్చితిని; సత్యసంబంధియైన ప్రతివాడును నా మాట వినుననెను. అందుకు పిలాతు–సత్యమనగా ఏమిటి? అని ఆయనతో చెప్పెను. ప్రధానయాజకులును పెద్దలును ఆయనమీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమియు ఇయ్యలేదు. కాబట్టి పిలాతు– నీమీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు విన లేదా? అని ఆయనను అడిగెను. అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరమియ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను.
పిలాతు ప్రధానయాజకులతోను జనసమూహములతోను–ఈ మనుష్యునియందు నాకు ఏ నేరమును కనబడలేదనెను. అయితే వారు–ఇతడు గలిలయదేశము మొదలుకొని ఇంతవరకును యూదయదేశమందంతట ఉపదేశించుచు ప్రజలనురేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి. పిలాతు ఈ మాట విని–ఈ మనుష్యుడు గలిలయుడా అని అడిగి ఆయన హేరోదు అధికారము క్రింద ఉన్న ప్రదేశపువాడని తెలిసికొని హేరోదునొద్దకు ఆయనను పంపెను. హేరోదు ఆ దినములలో యెరూషలేములో ఉండెను. హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. ఆయననుగూర్చి చాల సంగతులు విన్నందున ఆయన ఏదైనను ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి, బహుకాలమునుండి ఆయనను చూడగోరెను. ఆయనను చూచినప్పుడు చాల ప్రశ్నలువేసినను ఆయన అతనికి ఉత్తరమేమియు ఇయ్యలేదు. ప్రధానయాజకులును శాస్త్రులును నిలువబడి ఆయనమీద తీక్షణముగా నేరము మోపిరి. హేరోదు తన సైనికులతో కలిసి, ఆయనను తృణీకరించి అపహసించి, ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతునొద్దకు మరల పంపెను. అంతకు ముందు హేరోదును పిలాతును ఒకనికొకడు శత్రువులై యుండి ఆ దినముననే యొకనికొకడు మిత్రులైరి.
అంతట పిలాతు ప్రధానయాజకులను అధికారులను ప్రజలను పిలిపించి –ప్రజలు తిరుగబడునట్లు చేయుచున్నాడని మీరీమనుష్యుని నాయొద్దకు తెచ్చితిరే. ఇదిగో నేను మీయెదుట ఇతనిని విమర్శింపగా మీరితని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు; హేరోదునకు కూడ కనబడలేదు. హేరోదు అతని మాయొద్దకు తిరిగి పంపెను గదా; ఇదిగో మరణమునకు తగినదేదియు ఇతడు చేయలేదు. కాబట్టి నేనితనిని శిక్షించి విడుదల చేయుదునని వారితో చెప్పగా. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తలమీద పెట్టి ఊదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయనయొద్దకు వచ్చి–యూదుల రాజా, శుభమని చెప్పి ఆయనను అరచేతులతోకొట్టిరి. పిలాతు మరల వెలుపలికి వచ్చి–ఇదిగో ఈయనయందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియునట్లు ఈయనను మీయొద్దకు వెలుపలికి తీసికొని వచ్చుచున్నానని వారితో అనెను. ఆ ముండ్ల కిరీటమును ఊదారంగు వస్త్రమును ధరించినవాడై, యేసు వెలుపలికి రాగా, పిలాతు–ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పెను. ప్రధానయాజకులును బంట్రౌతులును ఆయనను చూచి–సిలువవేయుము సిలువవేయుము అని కేకలువేయగా పిలాతు–ఆయనయందు ఏ దోషమును నాకు కనబడలేదు గనుక మీరే ఆయనను తీసికొనిపోయి సిలువవేయుడని వారితో చెప్పెను. అందుకు యూదులు–మాకొకనియమముకలదు; తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకొనెను గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావవలెనని అతనితో చెప్పిరి.
పిలాతు ఆ మాట విని మరియెక్కువగా భయపడి, తిరిగి అధికారమందిరములో ప్రవేశించి. నీవెక్కడ నుండి వచ్చితివని యేసును అడిగెను; అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు గనుక పిలాతు–నాతో మాటలాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదనియు, నిన్ను సిలువవేయుటకు నాకు అధికారము కలదనియు నీ వెరుగవా? అని ఆయనతో అనెను. అందుకు యేసు–పైనుండి నీకు ఇయ్యబడి యుంటేనే తప్ప నామీద నీకు ఏ అధికారమును ఉండదు; అందుచేత నన్ను నీకు అప్పగించినవానికి ఎక్కువ పాపము కలదనెను. ఈ మాటనుబట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నముచేసెను గాని యూదులు–నీవు ఇతని విడుదల చేసితివా కైసరునకు స్నేహితుడవు కావు; తాను రాజునని చెప్పుకొను ప్రతివాడును కైసరునకు విరోధముగా మాటలాడుచున్నవాడే అని కేకలువేసిరి. పిలాతు ఈ మాటలు విని, యేసును బయటికి తీసికొనివచ్చి, రాళ్లు పరచిన స్థలమందు న్యాయపీఠముమీద కూర్చుండెను. హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబ్బతా అని పేరు. ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము; అప్పుడు ఉదయము ఆరు గంటలు కావచ్చెను.
అధ్యాయము 61
ఆ పండుగలో వారు కోరుకొనిన యొక ఖయిదీని పిలాతు విడిపించువాడు. అధికారుల నెదిరించి, కలహములో నరహత్య చేసినవారితోకూడ బంధించబడియుండిన బరబ్బ అను ఒకడుండెను. జనులు గుంపుగా కూడివచ్చి, అతడు అదివరకు తమకు చేయుచువచ్చిన ప్రకారము చేయవలెనని అడుగగా ప్రధానయాజకులు అసూయ చేత యేసును అప్పగించిరని పిలాతు తెలిసికొని. 'అయినను పస్కాపండుగలో నేనొకని మీకు విడుదల చేయువాడుక కలదు గదా; నేను యూదుల రాజును విడుదల చేయుట మీకిష్టమా?. 'బరబ్బనా లేక క్రీస్తనబడిన యేసునా? అని వారిని అడిగెను. అతడు బరబ్బను తమకు విడుదల చేయవలెనని జనులు అడుగుకొనునట్లు ప్రధానయాజకులు వారిని ప్రేరేపించిరి. అతడు న్యాయపీఠముమీద కూర్చుండియున్నప్పుడు అతని భార్య–నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు; ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతని యొద్దకు వర్తమానము పంపెను. ప్రధానయాజకులును పెద్దలును, బరబ్బను విడిపించుమని అడుగుటకును, యేసును సంహరించుటకును జనసమూహములను ప్రేరేపించిరి.
అధిపతి ఈ యిద్దరిలో నేనెవనిని విడుదల చేయవలెనని మీరు కోరుచున్నారని వారినడుగగా వారు–బరబ్బనే అనిరి. అందుకు పిలాతు ఆలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమిచేతునని వారినడుగగా సిలువవేయుమని అందరును చెప్పిరి. అధిపతి–ఎందుకు? ఇతడు ఏ దుష్కార్యము చేసెనని అడుగగా వారు సిలువవేయుమని మరి ఎక్కువగా కేకలువేసిరి. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తనవలన ప్రయోజనమేమియు లేదని గ్రహించి, నీళ్లు తీసికొని జనసమూహము ఎదుట చేతులు కడుగుకొని–ఈ నీతిమంతుని రక్తమునుగూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పెను. అందుకు ప్రజలందరు–వాని రక్తము మా మీదను మా పిల్లలమీదను ఉండుగాకనిరి.అయితే వారొకేపట్టుగా పెద్ద కేకలువేసి, వీనిని సిలువవేయుమని అడుగగా వారి కేకలే గెలిచెను. కాగా వారడిగినట్టే జరుగవలెనని పిలాతు తీర్పుతీర్చి అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడియుండినవానిని వారడిగినట్టు వారికి విడుదలచేసి, యేసును వారికిష్టము వచ్చినట్టు చేయుటకు అప్పగించెను. సిలువవేయబడుటకై అతడాయనను వారికి అప్పగించెను.
అప్పుడాయనను అప్పగించిన యూదా, ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి, ఆ ముప్పది వెండి నాణెములు ప్రధానయాజకులయొద్దకును పెద్దలయొద్దకును మరల తెచ్చి – నేను నిరపరాధరక్తమును అప్పగించి పాపము చేసితినని చెప్పెను. వారు దానితో మాకేమి? నీవే చూచుకొనుమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయములో పారవేసి, పోయి ఉరిపెట్టుకొనెను. ప్రధానయాజకులు ఆ వెండి నాణెములు తీసికొని – ఇవి రక్తక్రయధనము గనుక వీటిని కానుక పెట్టెలో వేయతగదని చెప్పుకొనిరి. కాబట్టి వారు ఆలోచనచేసి వాటినిచ్చి, పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరి వాని పొలముకొనిరి. అందువలన నేటివరకు ఆ పొలము రక్తపు పొలమనబడుచున్నది.
'వారు యేసును తీసికొనిపోయిరి. ఆయన తన సిలువ మోసికొని కపాలస్థలమను చోటికి వెళ్లెను. హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. వారాయనను తీసికొనిపోవుచుండగా పల్లెటూరినుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనను ఒకని పట్టుకొని, యేసువెంట సిలువను మోయుటకు అతనిమీద దానిని పెట్టిరి. గొప్ప జనసమూహమును, ఆయననుగూర్చి రొమ్ముకొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలమంది స్త్రీలును ఆయనను వెంబడించిరి. యేసు వారివైపు తిరిగి–యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడ్వకుడి; మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడ్వుడి. ఇదిగో–గొడ్రాండ్రును కనని గర్భములును పాలియ్యనిస్తనములును ధన్యములైనవని చెప్పుదినములు వచ్చుచున్నవి. అప్పుడు–మామీదపడుడని పర్వతములతోను, మమ్ముకప్పుడని కొండలతోను జనులు చెప్పసాగుదురు. వారు పచ్చిమ్రానుకే యీలాగు చేసినయెడల ఎండినదానికేమి చేయుదురో అని చెప్పెను. మరి యిద్దరు ఆయనతోకూడ చంపబడుటకు తేబడిరి; వారు నేరము చేసినవారు.
అధ్యాయము 62
సైనికులు యేసును సిలువవేసిన తరువాత ఆయన వస్ర్తములు తీసికొని,యొక్కొక్క సైనికునికి ఒక్కొక భాగము వచ్చునట్లు వాటిని నాలుగు భాగములు చేసిరి. ఆయన అంగీని కూడ తీసికొని, ఆ అంగీ కుట్టులేక పైనుండి యావత్తు నేయబడినది గనుక వారు–దానిని చింపక అది ఎవనికి వచ్చునో అని దానికోసరము చీట్లు వేయుదమని యొకరితో ఒకరు చెప్పుకొనిరి.వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కోసరము చీట్లు వేసిరి అను లేఖనము నెరవేరునట్లు ఇది జరిగెను; ఇందుకే సైనికులు ఈలాగు చేసిరి. అప్పుడు ఆ మార్గమున వెళ్లుచున్నవారు తమ తలలూచుచు –ఆహా దేవాలయమును పడగొట్టి మూడుదినములలో కట్టువాడా, సిలువమీదనుండి దిగి, నిన్ను నీవే రక్షించుకొనుమని చెప్పి ఆయనను దూషించిరి. ఆలాగే శాస్త్రులును పెద్దలును ప్రధానయాజకులును కూడ ఆయనను అపహసించుచు వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు; ఇశ్రాయేలురాజుగదా, యిప్పుడు సిలువమీదనుండి దిగినయెడల వాని నమ్ముదుము. వాడు దేవునియందు విశ్వాసముంచెను, నేను దేవుని కుమారుడనని చెప్పెను గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి. ప్రజలు నిలువబడి చూచుచుండిరి; అధికారులును–వీడు ఇతరులను రక్షించెను; వీడు దేవుడేర్పరచుకొనిన క్రీస్తు అయినయెడల తన్నుతాను రక్షించుకొనునని అపహసించిరి. అంతట సైనికులు ఆయనయొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనుమని ఆయనను అపహసించిరి.
వారు కపాలస్థలమను అర్థమిచ్చు గొల్గొతా అనబడిన చోటికి వచ్చి చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి గాని ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయెను. అక్కడ కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఆ నేరస్థులను ఆయనతోకూడ సిలువవేసిరి. ఆయనను సిలువవేసినప్పుడు పగలు తొమ్మిది గంటలాయెను. [అప్పుడు ఆయన అక్రమకారులలో నొకడుగా నెంచబడెనాని చెప్పి లేఖనము నెరవేరినది] 'యేసు– తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. మరియు పిలాతు–యూదులరాజైన నజరేయుడగు యేసు అను పైవిలాసము వ్రాయించి సిలువమీద పెట్టించెను. యేసు సిలువవేయబడిన స్థలము పట్టణమునకు సమీపమైయుండెను, అది హెబ్రీ గ్రీకు రోమా భాషలలో వ్రాయబడెను గనుక యూదులలో అనేకులు దానిని చదివిరి. నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు వ్రాయుము గాని–యూదులరాజు అని వ్రాయవద్దని యూదుల ప్రధానయాజకులు పిలాతుతో చెప్పగా పిలాతు–నేను వ్రాసిన దేమో వ్రాసితిననెను.
వ్రేలాడవేయబడిన ఆ నేరస్థులలో ఒకడు ఆయనను దూషించుచు–నీవు క్రీస్తువు గదా? నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడ రక్షించుమని చెప్పెను. అయితే రెండవవాడు వానిని గద్దించి–నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే యిది న్యాయమే; మనము చేసినవాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని యీయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి–యేసూ, నీవు నీ రాజ్యములోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొనుమనెను. అందుకాయన వానితో–నేడు నీవు నాతోకూడ పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాననెను. ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, క్లోపా భార్యయైన మరియయు, మగ్దలేనే మరియయు యేసు సిలువయొద్ద నిలుచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి–అమ్మా, యిదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను, తరువాత శిష్యుని చూచి–యిదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియనుండి ఆ శిష్యుడు ఆమెను తన యింట చేర్చుకొనెను.
అప్పుడు రమారమి మధ్యాహ్నమాయెను. అది మొదలుకొని మూడు గంటలవరకు ఆ దేశమంతటిమీద చీకటి కమ్మెను; మూడు గంటలకు యేసు ఎలోయీ, ఎలోయీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేక వేసెను; ఆ మాటలకు నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యివిడిచితివని అర్థము. దగ్గర నిలిచినవారిలో కొందరు ఆ మాటలు విని–అదిగో ఏలీయాను పిలుచుచున్నాడనిరి. అటుతరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లు–నేను దప్పిగొనుచున్నాననెను. చిరకతో నిండియున్న యొక పాత్ర అక్కడ పెట్టియుండెను గనుక వారు ఒక స్పంజీ చిరకతో నింపి, హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందిచ్చిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని–సమాప్తమైనదని చెప్పి తలవంచి ఆత్మను అప్పగించెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి–తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననెను. ఆయన యీలాగు చెప్పి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందివరకు రెండుగా చినిగెను; భూమి వణకెను; బండలు బద్దలాయెను; సమాధులు తెరవబడెను; నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలోనుండి బయటికి వచ్చి ఆయన లేచినతరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి. శతాధిపతియు అతనితోకూడ యేసునకు కావలి యున్నవారును, భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూచి, మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి.
అధ్యాయము 63
ఆయనకు నెళవైనవారందరును, గలిలయనుండి ఆయనను వెంబడించిన స్త్రీలును దూరముగా నిలుచుండి వీటిని చూచుచుండిరి. వారిలో మగ్దలేనే మరియయు, చిన్నయాకోబు యోసే అనువారి తల్లియైన మరియయు, సలోమేయు ఉండిరి. ఆయన గలిలయలో ఉన్నప్పుడు వీరాయనను వెంబడించి ఆయనకు పరిచారము చేసినవారు. వీరు కాక ఆయనతో యెరూషలేమునకు వచ్చిన ఇతర స్త్రీలనేకులును వారిలో ఉండిరి.ఆయన కెదురుగా నిలిచియున్న శతాధిపతి ఆయన ఈలాగు ప్రాణము విడుచుట చూచి–నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పెను. కొందరు స్త్రీలు దూరమునుండి చూచుచుండిరి. 'చూచుటకై కూడివచ్చిన ప్రజలందరు జరిగిన కార్యములు చూచి, రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్లిరి. ఆ దినము సిద్ధపరచుదినము; మరుసటి విశ్రాంతిదినము మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతిదినమున సిలువ మీద ఉండకుండునట్లు, వారి కాళ్లు విరుగగొట్టించి వారిని తీసివేయించుమని యూదులు పిలాతును అడిగిరి. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతోకూడ సిలువవేయబడిన మొదటి వాని కాళ్లను రెండవవాని కాళ్లను విరుగగొట్టిరి. వారు యేసునొద్దకు వచ్చి, అంతకుముందే ఆయన మృతిపొంది యుండుట చూచి ఆయన కాళ్లు విరుగగొట్టలేదు గాని సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఇది చూచినవాడు సాక్ష్యమిచ్చుచున్నాడు; అతని సాక్ష్యము సత్యమే. మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయనెరుగును. –అతని యెముకలలో ఒకటైనను విరువబడదు అను లేఖనము నెరవేరునట్లు ఇవి జరిగెను. మరియు –తాము పొడిచినవానితట్టు చూతురు అని మరియొక లేఖనము చెప్పుచున్నది.
ఆ దినము సిద్ధపరచు దినము, అనగా విశ్రాంతిదినమునకు పూర్వదినము. గనుక సాయంకాలమైనప్పుడు, అరిమతయియ అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడుండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడునైయుండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యముకొరకు కనిపెట్టు చుండినవాడు. అతడు పిలాతునొద్దకు వెళ్లి, యేసు దేహము (తనకిమ్మని) అడుగుకొని. పిలాతు – ఆయన ఇంతలోనే చనిపోయెనా అని ఆశ్చర్యపడి యొక శతాధిపతిని తనయొద్దకు పిలిపించి–ఆయన ఇంతలోనే చనిపోయెనా అని అతని నడిగెను. శతాధిపతివలన సంగతి తెలిసికొని, యోసేపునకు ఆ శవము నప్పగించెను. మొదట రాత్రివేళ ఆయన యొద్దకు వచ్చిన నీకొదేము కూడ బోళముతో కలిపిన అగరు రమారమి నూట ఏబది సేర్ల యెత్తు తెచ్చెను. అంతట వారు యేసు దేహమును ఎత్తికొని వచ్చి, యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. ఆయనను సిలువవేసిన స్థలములో ఒక తోట యుండెను; ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని క్రొత్తసమాధియొకటి యుండెను. తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి, సమాధి ద్వారమునకు పెద్దరాయి పొర్లించి వెళ్లిపోయెను. ఆ దినము సిద్ధపరచు దినము; విశ్రాంతిదినారంభము కావచ్చెను. అప్పుడు గలిలయనుండి ఆయనతోకూడ వచ్చిన స్త్రీలు వెంట వెళ్లి ఆ సమాధిని, ఆయన దేహము ఏలాగుంచబడెనో చూచి తిరిగి వెళ్లి, సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరచి, ఆజ్ఞచొప్పున విశ్రాంతిదినమున తీరికగా ఉండిరి.
మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధానయాజకులును పరిసయ్యులును పిలాతు నొద్దకు కూడివచ్చి అయ్యా, ఆ వంచకుడు సజీవుడై యుండినప్పుడు మూడుదినములైన తరువాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. కాబట్టి మూడవ దినమువరకు సమాధిని భద్రముచేయనాజ్ఞాపించుము; వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొనిపోయి –ఆయన మృతులలోనుండి లేచెనని ప్రజలతో చెప్పుదురేమో; అప్పుడు మొదటి వంచనకంటె కడపటి వంచన మరి చెడ్డదై యుండునని చెప్పిరి. అందుకు పిలాతు–కావలివారున్నారుగదా మీరు వెళ్లి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పెను. వారు వెళ్లి కావలివారిని కూడ ఉంచుకొని, రాతికి ముద్రవేసి సమాధిని భద్రముచేసిరి.
అధ్యాయము 64
విశ్రాంతిదినము గడచిపోగానే మగ్దలేనే మరియయు యాకోబు తల్లియైన మరియయు సలోమేయు వచ్చి, ఆయనకు పూయవలెనని సుగంధద్రవ్యములుకొనిరి. వారు ఆదివారమున పెందలకడ (లేచి, బయలుదేరి) సూర్యోదయమైనప్పుడు సమాధియొద్దకు వచ్చుచుండగా, –సమాధి ద్వారమునుండి మనకొరకు ఆ రాయి యెవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకమునుండి దిగివచ్చి, రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను; అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపువలె నుండెను, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుటవలన కావలివారు వణకి చచ్చినవారివలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి–మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియును; ఆయన ఇక్కడ లేడు; తాను చెప్పినట్టే ఆయన లేచియున్నాడు; రండి ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్లి, ఆయన మృతులలోనుండి లేచియున్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి; ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్లుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు; ఇదిగో మీతో చెప్పితిననెను.
ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందునుగూర్చి వారికేమియు తోచకయుండగా, ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన యిద్దరు మనుష్యులు వారియొద్ద నిలువబడిరి. వారు భయపడి ముఖములను నేల మోపి యుండగా వీరు–సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదకుచున్నారు? ఆయన ఇక్కడలేడు, ఆయన లేచియున్నాడు; ఆయన ఇంక గలిలయలో ఉండినప్పుడు –మనుష్యకుమారుడు పాపిష్టులైన మనుష్యుల చేతికి అప్పగింపబడి, సిలువవేయబడి, మూడవ దినమందు లేవవలసియున్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసికొనుడని వారితో అనిరి. అప్పుడు వారాయన మాటలు జ్ఞాపకము చేసికొని. వారు భయముతోను మహా ఆనందముతోను సమాధియొద్దనుండి త్వరగా వెళ్లి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరుగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని–మీకు శుభమని చెప్పెను. వారు ఆయనయొద్దకు వచ్చి, ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా యేసు–భయపడకుడి; మీరు వెళ్లి, నా సహోదరులు గలిలయకు వెళ్లవలెననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. వారు సమాధి యొద్దనుండి తిరిగి వెళ్లి యీ సంగతులన్నియు పదునొకండుగురు శిష్యులకును తక్కినవారికందరికిని తెలియజేసిరి. ఈ సంగతులు అపొస్తలులతో చెప్పిన వారెవరనగా–మగ్దలేనే మరియయు యోహన్నయు యాకోబు తల్లియైన మరియయు వారితోకూడ ఉన్న యితర స్త్రీలును. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెఱ్ఱిమాటలుగా కనబడెను గనుక వీరు వారి మాటలు నమ్మలేదు.
వారు వెళ్లుచుండగా కావలివారిలో కొందరు పట్టణములోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటిని ప్రధానయాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతోకూడి వచ్చి ఆలోచనచేసి ఆ సైనికులకు చాల ద్రవ్యమిచ్చి మేము నిద్రపోవుచుండగా అతని శిష్యులు రాత్రివేళవచ్చి అతనిని ఎత్తికొనిపోయిరని మీరు చెప్పుడి; ఇది అధిపతి చెవినిబడినయెడల మేమతని సమ్మతిపరచి మీకేమియు తొందరకలుగకుండ చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసికొని తమకు బోధింపబడినప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటివరకు ప్రసిద్ధమైయున్నది.
ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి, తాను ఏడు దయ్యములను వెళ్లగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడ సమాధియొద్దకు వచ్చి, సమాధి మీద ఉండిన రాయి తీయబడియుండుట చూచెను. గనుక ఆమె పరుగెత్తికొని సీమోను పేతురునొద్దకును యేసు ప్రేమించిన ఆ మరియొక శిష్యునియొద్దకును వచ్చి –ప్రభువును సమాధిలోనుండి యెత్తికొనిపోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో యెరుగమని చెప్పెను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధియొద్దకు వచ్చిరి. వారిద్దరును కూడి పరుగెత్తుచుండగా, ఆ శిష్యుడు పేతురుకంటే త్వరగా పరుగెత్తి ముందుగా సమాధియొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడియుండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతట సీమోను పేతురు అతని వెంబడి వచ్చి, సమాధిలో ప్రవేశించి, నారబట్టలు పడియుండుటయు, ఆయన తల రుమాలు నార బట్టలయొద్ద ఉండక వేరుగా ఒకచోట చుట్టిపెట్టియుండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధియొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతులలోనుండి లేచుట అగత్యమను లేఖనము వారింకను గ్రహింపరైరి. అంతట ఆ శిష్యులు తిరిగి తమ వారియొద్దకు వెళ్లిపోయిరి.
అయితే మరియ సమాధి బయట నిలిచి యేడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా, తెల్లని వస్త్రములు ధరించిన యిద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ల వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. వారు– అమ్మా, యెందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమె–నా ప్రభువును ఎవరో యెత్తికొనిపోయిరి; ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పెను. ఆమె యీ మాట చెప్పి వెనుకతట్టు తిరిగి, యేసు నిలిచియుండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు–అమ్మా యెందుకు ఏడ్చుచున్నావు, ఎవనిని వెదకుచున్నావు? అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని–అయ్యా, నీవు ఆయనను మోసికొనిపోయినయెడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తికొని పోదునని చెప్పెను. యేసు ఆమెను చూచి–మరియా అనిపిలిచెను. ఆమె ఆయనవైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూనీ అనిపిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము. యేసు ఆమెతో నేను ఇంకను తండ్రియొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు; అయితే నా సహోదరులయొద్దకు వెళ్లి–నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవుచున్నానని వారితో చెప్పుమనెను. ఆయనతో ఉండినవారు దుఃఖపడి యేడ్చుచుండగా ఆమె వెళ్లి ఆ సంగతి వారికి తెలియజేసెను గాని, ఆయన బ్రదికియున్నాడనియు ఆమెకు కనబడెననియు వారు విని నమ్మకపోయిరి.
అధ్యాయము 65
ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయు అను ఒక గ్రామమునకు వెళ్లుచు జరిగిన ఈ సంగతులన్నిటినిగూర్చి యొకరితో నొకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా, యేసు తానే దగ్గరకువచ్చి వారితోకూడ నడిచెను; అయితే వారాయనను గుర్తుపట్టలేకుండ వారి కన్నులు మూయబడెను. ఆయన– మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న యీ మాట లేమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో క్లెయొపా అనువాడు–యెరూషలేములో బస చేయుచుండి, యీ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవొకడవే యెరుగవా? అని ఆయనను అడిగెను. ఆయన –అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు–నజరేయుడైన యేసునుగూర్చిన సంగతులే; ఆయన దేవునియెదుటను ప్రజలందరియెదుటను క్రియలోను వాక్యములోను శక్తి గల ప్రవక్తయైయుండెను. మన ప్రధానయాజకులును అధికారులును ఆయనను ఏలాగు మరణశిక్షకు అప్పగించి, సిలువవేయించిరో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవువాడు ఈయనే అని మేము నిరీక్షించి యుంటిమి; ఇదిగాక యీ సంగతులు జరిగి నేటికి మూడుదినములాయెను. అయితే మాలో కొందరు . స్త్రీలు తెల్లవారగానే సమాధియొద్దకు వెళ్లి, ఆయన దేహమును కానక వచ్చి కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రదికియున్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసిరి. మాతోకూడ ఉన్నవారిలో కొందరు సమాధియొద్దకు వెళ్లి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి గాని, ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి.
అందుకాయన–అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటిని నమ్మని మందమతులారా, క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలును మొదలుకొని లేఖనములన్నిటిలో తన్నుగూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. ఇంతలో తాము వెళ్లుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన యింక కొంతదూరము వెళ్లునట్లు అగపడగా వారు–సాయంకాలము కావచ్చినది, ప్రొద్దు గ్రుంకినది, మాతోకూడ ఉండుమని చెప్పి, ఆయనను బలవంతముచేసిరి గనుక ఆయన వారితోకూడ ఉండుటకు లోపలికి వెళ్లెను. ఆయన వారితోకూడ భోజనమునకు కూర్చున్నప్పుడు, ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాని విరిచి వారికి పంచి పెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపెట్టిరి; అంతట ఆయన వారికి అదృశ్యుడాయెను. అప్పుడు వారు–ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని యొకనితో ఒకడు చెప్పుకొనిరి. ఆ గడియలోనే వారు లేచి, యెరూషలేమునకు తిరిగి వెళ్లగా, పదునొకొండుగురు శిష్యులును వారితోకూడ ఉన్నవారును కూడివచ్చి ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కనబడెనని చెప్పుకొనుచుండిరి. వారిది విని త్రోవలో జరిగిన సంగతులును, ఆయన రొట్టె విరుచుటవలన తమ కేలాగు తెలియబడెనో అదియు తెలియజేసిరి.
ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి, తాము కూడియున్న యింటి తలుపులు మూసికొనియుండగా యేసు వచ్చిమధ్యను నిలిచి–మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. ' అయితే వారు దిగులుపడి భయాక్రాంతులై, భూతము తమకు కనబడెనని తలంచిరి. అప్పుడాయన–మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేల? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి; నన్ను పెట్టి చూడుడి, నా కున్నట్టుగా మీరు చూచుచున్న యెముకలును మాంసమును భూతమునకుండవని చెప్పి. ఆయన ఆలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. పదునొకండుమంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై, తాను లేచిన తరువాత తన్ను చూచినవారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయకాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. అయితే వారు సంతోషముచేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన–ఇక్కడ మీయొద్ద ఏమైన ఆహారము కలదా అని వారినడిగెను. వారు కాల్చిన చేప ముక్కను ఆయన కిచ్చిరి. ఆయన దానిని తీసికొని వారియెదుట భుజించెను. అంతట ఆయన–మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలలోను నన్నుగూర్చి వ్రాయబడినవన్నియు నెరవేరవలెనని నేను మీయొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను.
అప్పుడు వారు లేఖనములు గ్రహించునట్లుగా ఆయన వారి మనస్సును తెరచి క్రీస్తు శ్రమపడి మూడవదినమున మృతులలోనుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయనపేరట మారుమనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడియున్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీమీదికి పంపుచున్నాను; మీరు పైనుండి శక్తి పొందువరకు పట్టణములో నిలిచి యుండుడని వారితో చెప్పెను. అప్పుడు యేసు–మరల మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపినప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను. ఆయన ఈ మాట చెప్పి వారిమీద ఊది–పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును; ఎవరి పాపములు మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పెను. మరియు–మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మిబాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మినవారివలన ఈ సూచక క్రియలు కనబడును; ఏవనగా, నా నామమున దయ్యములను వెళ్లగొట్టుదురు; క్రొత్త భాషలు మాటలాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగులమీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను.
యేసు వచ్చినప్పుడు, పండ్రెండుమందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయెను గనుక తక్కిన శిష్యులు–మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు–నేనాయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి, నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనే నమ్మనని వారితో చెప్పెను. ఎనిమిది దినములైన తరువాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమా వారితోకూడ ఉండెను. తలుపులు మూయబడియుండగా యేసు వచ్చిమధ్యను నిలిచి–మీకు సమాధానము కలుగును గాక అనెను. తరువాత తోమాను చూచి–నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము; నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి, అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండుమనెను. అందుకు తోమా ఆయనతో–నా ప్రభువా, నా దేవా అనెను. యేసు–నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మినవారు ధన్యులని అతనితో చెప్పెను. మరియు అనేకమైన యితర సూచకక్రియలను యేసు తన శిష్యులయెదుట చేసెను; అవి యీ గ్రంథమందు వ్రాయబడియుండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను.
అధ్యాయము 66
అటుతరువాత యేసు తిబెరియ సముద్రతీరమున శిష్యులకు మరల తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనిన విధమేదనగా సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరివాడగు నతనయేలును, జెబెదయి కుమారులును, ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి యుండిరి. సీమోను పేతురు–నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు–మేమును నీతోకూడ వచ్చెదమనిరి. వారు వెళ్లి దోనె ఎక్కిరి కాని ఆ రాత్రి యేమియు పట్టలేదు. సూర్యోదయమగుచుండగా యేసు దరిని నిలిచెను, అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు– పిల్లలారా, భోజనమునకు మీయొద్ద ఏమైన ఉన్నదా? అని వారిని అడుగగా, లేదని వారాయనతో చెప్పిరి . అప్పుడాయన–దోనె కుడిప్రక్కను వల వేయుడి మీకు దొరుకునని చెప్పెను గనుక వారాలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు–ఆయన ప్రభువు సుమీ అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభువని సీమోను పేతురు విని, వస్ర్తహీనుడై యున్నందున పైబట్టవేసి సముద్రములో దుమికెను. దరియించుమించు ఇన్నూరు మూరల దూరమున్నందున తక్కిన శిష్యులు చేపలుగల వల లాగుచు ఆ చిన్న దోనెలో వచ్చిరి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులును వాటిమీద ఉంచబడిన చేపలును రొట్టెయు కనబడెను. యేసు–మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసికొని రండని వారితో చెప్పగా సీమోను పేతురు దోనె ఎక్కి వలను దరికిలాగెను; అది నూట ఏబది మూడు గొప్ప చేపలతో నిండియుండెను; చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసు–రండి భోజనము చేయుడని వారితో అనెను. ఆయన ప్రభువని వారికి తెలిసినందున–నీవెవడవని శిష్యులలో ఎవడును ఆయనను అడుగ తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసికొని వారికి పంచిపెట్టెను. ఆలాగే చేపలను కూడ పంచిపెట్టెను. యేసు మృతులలోనుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది యిది మూడవసారి.
వారు భోజనముచేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి–యోహాను కుమారుడవైన సీమోనూ, వీరికంటె నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? అని అడుగగా అతడు–అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువని ఆయనతో చెప్పెను; యేసు–నా గొఱ్ఱెపిల్లలను మేపుమని అతనితో చెప్పెను. మరల ఆయన–యోహాను కుమారుడవైన సీమోనూ, నన్ను ప్రేమించుచున్నావా? అని రెండవసారి అతనిని అడుగగా అతడు–అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువని ఆయనతో చెప్పెను; ఆయన–నా గొఱ్ఱెలను కాయుమని చెప్పెను. మూడవసారి ఆయన–యోహాను కుమారుడవైన సీమోనూ, నన్ను ప్రేమించుచున్నావా? అని అతనిని అడిగెను. – నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి–ప్రభువా, నీవు సమస్తము ఎరిగినవాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు – నా గొఱ్ఱెలను మేపుము. నీవు యౌవనుడవై యుండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్లుచుంటివి; నీవు ముసలివాడవైనప్పుడు నీచేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుముకట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసికొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పెను. అతడు ఎట్టి మరణమువలన దేవుని మహిమపరచునో దాని సూచించి ఆయన ఈ మాట చెప్పెను. ఇట్లు చెప్పి–నన్ను వెంబడించుమని అతనితో అనెను.
పేతురు వెనుకకు తిరిగి, యేసు ప్రేమించినవాడును, భోజనపంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని–ప్రభువా, నిన్ను అప్పగించువాడెవడని అడిగినవాడునైన శిష్యుడు తమ వెంట వచ్చుట చూచెను. పేతురు అతనిని చూచి–ప్రభువా, యితని సంగతి ఏమగునని యేసును అడిగెను. యేసు–నేను వచ్చువరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమి? నీవు నన్ను వెంబడించు మనెను. కాబట్టి ఆ శిష్యుడు చావడను మాట సహోదరులలో ప్రచురమాయెను. అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు గాని–నేను వచ్చువరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమని చెప్పెను.ఈ సంగతులనుగూర్చి సాక్ష్యమిచ్చుచు ఇవి వ్రాసిన శిష్యుడు ఇతడే; ఇతని సాక్ష్యము సత్యమని యెరుగుదుము.
తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినమువరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటినిగూర్చి నా మొదటి గ్రంథమును రచించితిని. ఆయన శ్రమపడిన తరువాత నలువది దినములవరకు వారి కగపడుచు, దేవుని రాజ్యవిషయములనుగూర్చి బోధించుచు, అనేక ప్రమాణములను చూపి వారికి తన్నుతాను సజీవునిగా కనుపరచుకొనెను. ఆయన వారిని కలిసికొని యీలాగు ఆజ్ఞాపించెను–మీరు యెరూషలేమునుండి వెళ్లక, నావలన వినిన తండ్రియొక్క వాగ్దానముకొరకు కనిపెట్టుడి; యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనెను. కాబట్టి వారు కూడివచ్చినప్పుడు–ప్రభువా, యీ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరల అనుగ్రహించెదవా? అని ఆయనను అడుగగా ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని యున్నాడు; వాటిని తెలిసికొనుట మీ పనికాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను.పదునొకండుమంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్లిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరిగాని, కొందరు సందేహించిరి. అయితే యేసు వారియొద్దకు వచ్చి–పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది. కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తివరకు సదాకాలము మీతోకూడ ఉన్నానని వారితో చెప్పెను.
ఆయన బేతనియవరకు వారిని తీసికొనిపోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలోనుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండ ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్లుచుండగా, వారు ఆకాశమువైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన యిద్దరు మనుష్యులు వారియొద్ద నిలిచి గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశమువైపు చూచుచున్నారు? మీయొద్దనుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యీ యేసే, ఏ రీతిగా పరలోకమునకు వెళ్లుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్లి యెడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి.
ఈలాగు ప్రభువైన యేసు వారితో మాటలాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి, దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యెను. వారు బయలుదేరి వాక్యమంతట ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై యుండి, వెనువెంట జరుగుచు వచ్చిన సూచక క్రియలవలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్.